మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది ఔషధనగరి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫార్మాసిటీకి అడుగడుగునా చిక్కుముళ్లే ఎదురవుతున్నాయి.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది ఔషధనగరి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫార్మాసిటీకి అడుగడుగునా చిక్కుముళ్లే ఎదురవుతున్నాయి. భూసేకరణ ప్రక్రియ మొదలుకాకపోవడానికి బాలారిష్టాలే కారణంగా కనిపిస్తోంది. కందుకూరు మండలం ముచ్చర్లలో 10,939 ఎకరాల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది.
గత ఏడాది డిసెంబర్‌లో ఫార్మారంగ దిగ్గజాలతో కలిసి స్వయంగా ఏరియల్ సర్వే నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఔషధనగరిని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రతిపాదిత ప్రాంతంలో భూసేకరణను వేగవంతం చేసి.. టీఐఐసీకి అప్పగించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో ఆగమేఘాల మీద క్షేత్రస్థాయి సర్వేకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు భూసేకరణ ప్రక్రియ ఆషామాషీకాదని అర్థమైంది.
అటవీశాఖ అంగీకరించేనా?
గుర్తించిన విస్తీర్ణంలో 6,097 ఎకరాలు అటవీశాఖకు చెందిన భూమి ఉంది. తాడిపర్తి, కుర్మిద్ద, ముద్విన్ రిజర్వ్‌ఫారెస్ట్‌లోని ఈ భూములను సేకరించాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సేకరించే భూమికి ప్రత్యామ్నాయంగా భూమిని అటవీశాఖకు కేటాయించడానికి రాష్ట్ర సర్కారు ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే వికారాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో భూములను బదలాయించేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది.
అటవీ భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపే ప్రతిపాదనలకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే, రాష్ట్రస్థాయిలో ఇప్పటివరకు దీనిపై ఫైలు సిద్ధం కాలేదు. ఈ తరుణంలో కేంద్ర సర్కారు ఆమోదముద్ర పడేంతవరకు భూసేకరణ జరిపేందుకు వీలుపడదు. మరోవైపు పక్కనే ఉన్న ‘దిల్' భూములను కూడా ఔషధనగరి కోసం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని 1,642.38 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపంతో ఈ భూమి సేకరించడంలో కాలయాపన జరుగుతోంది. దిల్ భూముల్లో టౌన్‌షిప్ నిర్మాణం చేపట్టే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది.
అసైన్డ్‌దారులతో చిక్కులు!
ముచ్చర్లలోని సర్వే నంబర్ 288లో రెవెన్యూ రికార్డు ప్రకారం 2,746 ఎకరాలు ఉండాల్సివుండగా, అందులో 460 ఎకరాలు లెక్కతేలడంలేదు. ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్(ఈటీఎస్) సర్వేలో కేవలం 2,286 ఎకరాలు మాత్రమే తేలడంతో గుర్తించిన విస్తీర్ణంలో వ్యత్యాసం కనిపిస్తోంది. గట్ నంబర్లకు ఈటీఎస్ సర్వేకు కొంత తేడా రావడం సర్వసాధారణమే. మరోవైపు భూ లభ్యత లెక్క తప్పిందని జుట్టుపీక్కుంటున్న రెవెన్యూ గణానికి అందులోనూ పట్టా భూములు ఉండడం మరింత చిరాకు కలిగిస్తోంది. 381 ఎకరాల మేర ప్రైవేటు వ్యక్తుల సాగుబడిలో ఉండగా, 282 ఎకరాలను ప్రభుత్వం గతంలో పేదలకు పంపిణీ చేసింది.
అయితే, అసైన్డ్‌దారులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించే అంశంపై జాయింట్ కలెక్టర్-1 రజత్‌కుమార్ సైనీ నేతృత్వంలో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. పట్టాలు పొందినప్పటికీ, పొజిషన్‌లో లేన ందున పరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. అయితే, ప్రభుత్వం పొజిషన్ చూపకపోవడంతోనే అసైన్డ్‌దారులు కబ్జాలో లేరని, అది వారి తప్పుగా భావించడంలో అర్థంలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై స్పష్టతవస్తే కానీ భూసేకరణ సాఫీగా జరిగే అవకాశంలేదు.
వివాదరహిత భూమి 2,537 ఎకరాలే!
ఫార్మాసిటీకి గుర్తించిన 10,939 ఎకరాల్లో వివాదరహిత భూమి కేవలం 2,537 ఎకరాలు మాత్రమే ఉంది. 6,099.09 ఎకరాల మేర అటవీ భూముల సేకరణపై కేంద్రం క్లియరెన్స్ రావాల్సి ఉండగా, పట్టా, అసైన్డ్‌దారులకు సంబంధించిన వివాదం తేలేవరకు దాదాపు 663 ఎకరాలను సేకరించే వీలుపడదు. దిల్ భూముల పరిస్థితీ అంతే. ప్రభుత్వ స్థాయిలో జరిగే చర్చల అనంతరమే ఈ భూములను స్వాధీనం చేసుకోవాల్సిఉంటుంది. ఈ నేపథ్యంలో ఔషధనగరి స్థాపన కోసం ఈ స్థలాలను టీఐఐసీకి అప్పగించడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశంలేకపోలేదు.
ఫార్మాసిటీకి ప్రతిపాదిత భూములు
ప్రభుత్వ భూములు: 3,200
దిల్ భూములు: 1,642.38
అటవీ భూములు: 6,097.09