స్థానికతకు కొత్త నిర్వచనం

changes of Zonal system in telangana govt - Sakshi

చదువు బదులు నివాసం, పూర్వీకత ఇక ప్రామాణికం!

 జోనల్‌ వ్యవస్థ మార్పులపై ఉన్నతస్థాయి

కమిటీ ముమ్మర కసరత్తు

 స్టేట్‌ కేడర్‌ ఉద్యోగాలు పూర్తిగా ఎత్తివేత? 

సాక్షి, హైదరాబాద్‌: జోనల్‌ వ్యవస్థ మార్పుల్లో భాగంగా స్థానికతను కొత్తగా నిర్వచించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఉన్న విద్యా ప్రామాణికతను కాకుండా నివాసము, పూర్వీకతను పరిగణనలోకి తీసుకోవాలని యోచిస్తోంది. తెలంగాణ వారికే ఉద్యోగాలు దక్కేలా స్థానికతకు కొత్త రూపునిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో స్థానికత నిర్వచనంలో ఉన్న లోపా ల వల్లే ఇబ్బందులు కలిగాయని చెబుతున్నా యి. దీంతో తెలంగాణ వారికే ఉద్యోగాలు దక్కేలా స్థానికతను పునర్‌నిర్వచించాలని సీఎం అధికారులను ఆదేశించారు. గతంలో అభ్యర్థి ప్రాథమిక విద్యా కాలాన్ని పరిగణనలోకి తీసుకుని స్థానికత నిర్ధారించే వారు. పదో తరగతిలోపు వరుసగా నాలుగేళ్లపాటు ఏ జిల్లాలో చదువుకుంటే ఆ జిల్లా స్థానికుడిగా గుర్తించేవారు. దీనికి బదులుగా కేవలం వ్యక్తి నివాసాన్ని, పూర్వీకతను పరిగణన లోకి తీసుకోవాలని భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా స్థానికతకు కొత్త నిర్వచనం రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. మరో వైపు జోనల్‌ వ్యవస్థలో మార్పులపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. నేడు మరోసారి భేటీ అవుతున్న కమిటీ...23న వివిధ శాఖల హెచ్‌ఓడీలతో కూడా సమావేశం కానుంది. అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతోనూ సమావేశమై అభిప్రాయాలను తీసుకోనుంది. అయితే స్థానికతపై ప్రభుత్వం ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.

స్టేట్‌ కేడర్‌కు ఫుల్‌స్టాప్‌!
స్టేట్‌ కేడర్‌ ఉద్యోగాల్లో లోకల్‌ కోటా ఉండదు కాబట్టి దేశంలో ఏ రాష్ట్రం వారైనా పోటీ పడవచ్చు. ఇతర రాష్ట్రాల వారు ఈ ఉద్యోగాలకు పోటీ పడకపోయినా ఒకే భాష కావడంతో ఏపీకి చెందిన వారు పోటీ పడే అవకాశం ఉంది. దీన్ని కట్టడి చేసే అవకాశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు స్టేట్‌ కేడర్‌ పోస్టులను పూర్తిగా ఎత్తేయాలని భావిస్తున్నారు. స్టేట్‌ కేడర్‌ పోస్టులను మల్టీజోన్‌ పోస్టులుగా మార్చాలని భావిస్తున్నారు. మల్టీజోన్‌ పోస్టుల్లో 60% లోకల్‌ కోటా ఉంటుంది. మిగిలిన నాన్‌ లోకల్‌ కోటా 40% పోస్టుల్లోనూ తెలంగాణవారు ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. దీనివల్ల కనీసం 80% ఉద్యోగాలు తెలంగాణవారే పొందవచ్చు. అందుకే స్థానికతను పునర్‌నిర్వచించడంతోపాటు స్టేట్‌ కేడర్‌ పోస్టులను ఎత్తేసి మల్టీజోన్‌ పోస్టులనే ఏర్పాటు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. అంతే కాకుండా సచివాలయ, హెచ్‌ఓడీ, సొసైటీ ఉద్యోగులను కూడా రాష్ట్రంలో ఎక్కడికైనా బదిలీ చేసేలా ఉత్తర్వులను రూపొందిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top