ఓటేయండి.. లేదా ఉన్నవారితో వేయించండి

CEO Rajat Kumar says No eligible person should be denied voting - Sakshi

ఓటుకు నోటంటే అక్కడే తిరస్కరించండి 

ఓటేయకపోతే ప్రజాస్వామ్యం బక్కచిక్కిపోతుంది 

ఎన్నికల్లో ప్రలోభాలపై సీఈఓ రజత్‌కుమార్‌ ఆవేదన  

సాక్షి, హైదరాబాద్‌: ‘మీ ఓటుకోసం డబ్బిస్తున్నారా, అక్కడికక్కడే తిరస్కరించండి. మీకు ఓటు లేదా...మీరు ఎలాగూ ఓటేసే మహత్తర అవకాశం పోగొట్టుకుంటున్నారు కదా, ఓటుండీ వేయకుండా ఉన్న కనీసం మరో ఐదుమంది వెంటపడి వారి చేత ఓటు వేయించండి. మీ నేతలు మీ మాట వినాలనుకుంటే..ఓటు వేయండి. ఎక్కువ మంది వెళ్లి ఓటేస్తేనే... వారు మీ అవసరాలేమిటో శ్రద్ధగా తెలుసుకోగలుగుతారు. పెద్ద చదువులు చదివి పెద్ద నగరాల్లో ఉంటూ ఓ అరగంట వెచ్చించి ఓటు వేయకపోతే ఏమ వుతుందో తెలుసా...ప్రజాస్వామ్యం బక్కచిక్కిపోతుంది. పోటీలో ఉన్న ఏ అభ్యర్థీ లేదా ఏ రాజకీయ పార్టీ మీకు నచ్చలేదా... వెళ్లి కనీసం ‘నోటా’నొక్కి రండి. గెలిచిన అభ్యర్థి మెజారిటీ తగ్గినందుకు తలదించుకుంటాడు’’ ఇవీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్‌ రజత్‌ కుమార్‌ భావోద్రేకంతో పలికిన పలుకులు.

ఎగ్జిబిషన్‌ సొసైటీకి చెందిన ఆర్థిక కమిటీ, ఉస్మానియా పట్టభద్రుల సంఘం శనివారం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ‘ఓటర్ల చైతన్య కార్యక్రమం’’ఇందుకు వేదికయింది.ముఖ్య అతిథి గా హాజరైన రజత్‌కుమార్‌ ప్రజాస్వామ్య క్రతువులో ప్రతీ పౌరుడూ పాల్గొనాలనీ, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇరుగుపొరుగును ఓటింగ్‌కు ప్రోత్స హించాలనీ చెబుతూ...‘‘ఎవరయినా డబ్బిస్తే, అక్కడికక్కడే వద్దని చెప్పేయండి’’అం టూ  భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘మీరు గమని స్తున్నారో లేదో తెలి యదు. ఎన్నికల్లో డబ్బు, మాఫియాలను లేకుండా చేయడానికి మేము అహోరాత్రాలు కష్టపడుతున్నాం. సమైక్య రాష్ట్రంలోనే మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగిసేలోగా పట్టుబడిన నగదు కంటే ఇప్పుడు కేవలం తెలంగాణలో పోలింగ్‌కు ఇంకా ఐదురోజులుండగానే చిక్కిన మొత్తం రు.104 కోట్లు, అంటే అప్పటికంటే రు.28కోట్లు అధికం. పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోండి. డబ్బు, మాఫియాలు ఎలా చెలరేగుతున్నాయో చూడండి..  కారణం ...మా శ్రమకు మీ సహకారం , మీ పాత్ర తోడు కాకపోవడమే.’’అని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఓటు వేస్తేనే నేతలు మీ మాట వింటారు 
‘‘ఓటర్లు ఎంత ఎక్కువ సంఖ్యలో వెళ్లి ఓటు వేస్తే నేతలు మీ మాట అంతగా వింటారు. వినక తప్పదు. వారు కోరుకునేది కూడా మీ మనసులను గెలవాలనే. అలాగే ఓటు వేసేముందు మీరు గందరగోళం పడకుండా, ప్రశాంతంగా ఆలోచించుకోవడానికి వీలుగా 48 గంటలు అన్ని రకాల ప్రచారాలు ఆపేయిస్తాం. మీరు కులం, డబ్బు వంటి అంశాలు కాకుండా అభ్యర్థులు, రాజకీయపార్టీల విధానాలు,  హామీలు, విశ్వసనీయత ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి’’అని చెప్పారు.

మన ఎన్నికల కమిషన్‌కు నీరాజనాలు
‘‘సంతోషించాల్సిన విషయం, ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే అక్షరాస్యత తక్కువగా ఉండే మారుమూల పల్లెల్లో 80–90% ఓటింగ్‌ నమోదవుతుంటే, హైదరాబాద్, ముంబయి, ఢిల్లీ వంటి నగరాల్లో సగటున 50–55% ఉంటున్నది. ఇది ఎన్నికల చిత్రం. కానీ బయట దేశాల్లో మన ప్రజాస్వామ్యానికి ఎక్కడలేని గుర్తింపుంది. ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయతకు ప్రపంచం నీరాజనాలర్పిస్తోంది. మన ఎన్నికల నిర్వహణ విధానం తమకూ చూపాలని బ్రెజిల్‌ తదితర దేశాలు మనకు ఆహ్వానిస్తున్నాయి.మన ఈవిఎంలు, వీవీప్యాట్‌లను చూసి అమెరికా, జర్మనీ, నెదర్లాండ్స్‌ వంటి దేశాలు ఆశ్చర్యపోతున్నాయి.అక్కడ ఇటువంటి యంత్రాలకు చట్టసమ్మతి లేదు. ఇక ఈసారి దివ్యాంగులకు చక్కని సౌకర్యాలు కల్పించాం’’ అని అన్నారు.

హామీలకు ఆధారాలు కోరాం..
మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారో ఆధారసహితంగా సమాచారం సమర్పించాలని కోరాం. ఓటర్ల జాబితా తయారీ స్ధాయినుండే బోగస్‌ ఓటర్లను తొలగించడం వంటి ప్రక్షాళన పనులు చేపట్టాం. బూత్‌ల దగ్గర కూడా అక్రమాలు జరగకుండా పారదర్శకంగా నిర్వహించడానికి కెమెరాలు పెట్టి, ప్రత్యక్ష ప్రసారలు చేపట్టాం. ఇవే కాదు ఇంకా చాలా చర్యలు తీసుకుంటున్నాం ’అని వివరంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక కమిటీ అధ్యక్షుడు బి. ప్రభాశంకర్, ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు బి.శ్రీనివాస రావు, ఉస్మానియా పట్టభద్రుల సంఘం అధ్యక్షుడు డా.డి.గంగాధర్‌ రావు, కన్వీనర్‌ అశ్విన్‌ మార్గం పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top