పీకలదాకా మద్యం తాగించి.. ఆపై విచక్షణా రహితంగా కొట్టి, మెడకు ఉరి బిగించి గుర్తు తెలియని యువకుడిని హత్య చేసిన ఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది.
హయత్‌నగర్: పీకలదాకా మద్యం తాగించి.. ఆపై విచక్షణా రహితంగా కొట్టి, మెడకు ఉరి బిగించి గుర్తు తెలియని యువకుడిని హత్య చేసిన ఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కొహెడ నుంచి మంగళ్‌పల్లి వెళ్లే దారిలో సీతారామ హౌసింగ్ వెంచర్‌లో రోడ్డుకు కొంత దూరంలో చెట్ల పొదల్లో ఓ యువకుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
మృతునికి సుమారు 25-30 ఏళ్లు ఉండవచ్చని మంగళవారం రాత్రి కొందరు వ్యక్తులు అతన్ని తీసుకొచ్చి మద్యం తాగించి కొట్టి, ఆపై మెడకు ఉరేసి ఆటోకు కట్టి సుమారు 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేశారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో రక్తం మరకలతో పాటు కొద్ది దూరంలో మద్యం సీసాలు లభించాయి. తల, ముఖం, చేతులు, కళ్లు, మర్మాంగాలపై గాయాలున్నాయని, పథకం ప్రకారమే యువకుడిని ఇక్కడికి తీసుకొచ్చి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుని షర్టుపై మైటెక్స్ డబీర్‌పురా అనే లేబుల్ ఉందని, అతను ఆటోడ్రైవర్ అయి ఉంటాడని అనుమానిస్తున్నారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాల కోసం శోధించారు.