విద్యావలంటీర్ల నియామకాలకు బ్రేక్‌! | Break for hiring academic staff! | Sakshi
Sakshi News home page

విద్యావలంటీర్ల నియామకాలకు బ్రేక్‌!

Jul 2 2018 2:38 AM | Updated on Jul 2 2018 2:38 AM

Break for hiring academic staff! - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యావలంటీర్ల (వీవీ) నియామకాలకు బ్రేక్‌ పడింది. ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటం, బదిలీలపై కొం దరు కోర్టును ఆశ్రయించడంతో తుదితీర్పు వచ్చే వరకు బదిలీల కేటాయింపులు చేయొద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోర్టు తీర్పునకు లోబడే బదిలీల ప్రక్రియ పూర్తి చేయనుంది.

ఈ ప్రక్రియలో ఏర్పడే ఖాళీలపై స్పష్టత వచ్చిన తర్వాతే విద్యావలంటీర్ల (వీవీ)ను నియమిస్తే ఫలితం ఉంటుందని విద్యాశాఖ అంచనాకొచ్చింది. బదిలీలకు సంబం ధించి కోర్టు తీర్పు ఒకట్రెండు రోజుల్లో రానుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ తీర్పు వెలువడటం ఆలస్యమైతే వీవీల నియామకాలు సైతం జాప్యం కానున్నాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధన మరింత ప్రమాదంలో పడనుంది.

విద్యాశాఖ పట్టించుకోకపోవడంతో...
ఉపాధ్యాయ ఖాళీలను విద్యావలంటీర్లతో నెట్టుకు రావాలని భావించిన సర్కారుఆ మేరకు వీవీలను మంజూరు చేసి జూన్‌ నుంచే నియామకాలు చేపట్టా లని విద్యాశాఖకు సూచించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 16,781 వీవీ లను నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ తక్షణమే పూర్తి చేయాలని స్పష్టం చేసింది. తాజాగా మంజూరు చేసిన వీవీ పోస్టుల్లో 15,473 మందిని ఉపాధ్యాయ ఖాళీలు, సెలవులతో ఏర్పడిన ఖాళీ స్థానాల్లో భర్తీ చేస్తారు.

మరో 1,308 మందిని తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు బోధకులుగా నియమిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా నియమిస్తున్న విద్యావలంటీర్లకు నెలవారీ గౌరవ వేతనంగా రూ. 12 వేలు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ మేరకు జూన్‌ నెలకు సంబంధించి వీవీల వేతన నిధులను కూడా విడుదల చేస్తూ ఆర్థికశాఖకు ఆదేశాలు జారీ చేసింది.

కానీ అదే సమయంలో ఉపాధ్యాయుల బదిలీల అంశం తెరపైకి రావడంతో వీవీల నియామకాల ప్రక్రియ అటకెక్కింది. టీచర్ల  బదిలీల కౌన్సెలింగ్‌లో నిమగ్నమైన విద్యాశాఖ  వీవీల నియామకాలను పట్టించుకోలేదు. జూన్‌ ముగిసినప్పటికీ వీవీల ఊసెత్తలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement