చెప్పేవన్నీ అబద్ధాలే | bjp leader indrasena reddy fired on Kavitha and Harish Rao | Sakshi
Sakshi News home page

చెప్పేవన్నీ అబద్ధాలే

Apr 29 2017 9:13 PM | Updated on Sep 5 2017 9:59 AM

చెప్పేవన్నీ అబద్ధాలే

చెప్పేవన్నీ అబద్ధాలే

మిర్చి రైతుల విషయంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కవిత అబద్దాలు మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్‌.ఇంద్రసేనారెడ్డి అన్నారు.

హైదరాబాద్‌: మిర్చి రైతుల విషయంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కవిత అబద్దాలు మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్‌.ఇంద్రసేనారెడ్డి అన్నారు. కేంద్రం సహకారంతో రైతులకు మంచి ధర అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ధరల విషయంలో పుకార్లు పుట్టించారనడాన్ని ఖండించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ సభ కోసం మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించే హక్కు ప్రభుత్వానికి ఎక్కడుందని ప్రశ్నించారు.

రైతులకు న్యాయమైన ధర అందించడంలో, వ్యాపారస్తులను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మిర్చికి గిట్టుబాటు ధర అందించడంలో కేంద్రం సహకరించడం లేదన్న వాదన సరికాదన్నారు. ధరల్లో హెచ్చుతగ్గులుంటే జోక్యం చేసుకొని ధరల స్థిరీకరణ చేసే హక్కు కేంద్రానికి ఉందని, ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటుండగా తెలంగాణ ఎందుకు నిరాకరిస్తోందని నిలదీశారు. కందుల కొనుగోలు కోసం కేంద్రం రూ.750 కోట్లు విడుదల చేసి 50రోజులు దాటినా రైతులకు చెల్లించడంలేదని విమర్శించారు.

మార్కెట్ యార్డుల ఆధునికీకరణ కోసం ఈనామ్ పథకం కింద ప్రతి మార్కెట్‌కు రూ.30 లక్షలు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులు చేపట్టడం లేదని మండిపడ్డారు. ఆదివారం నిర్వహించే శాసనసభ సమావేశాల్లో మిర్చి, వేసంగి వరి రైతులకు భరోసా కల్పించేందుకు నిర్ణయం తీసుకోవాలని, రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటకు వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ కార్యక్రమాల కోసం కేసీఆర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని,. ప్రభుత్వ వాహనాలకు టీఆర్‌ఎస్‌ జెండాలు కట్టారని ఆరోపించారు. వరంగల్ సభలో కేసీఆర్ తిట్లపురాణం వల్లించడం తప్ప అభివృద్ధి ప్రస్తావన చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. వరంగల్ సభ ఆ పార్టీ పతనానికి ప్రారంభ సూచిక అని అన్నారు.

మహానుభావుడు
విద్యాసాగర్ రావు మృతి పట్ల బీజేపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ చింతల రామచంద్రారెడ్డి సంతాపం తెలిపారు. తెలంగాణలో ప్రతి చేనుకు నీరందించేందుకు కృషి చేసిన మహానుభావుడు అని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement