బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై దిద్దుబాటు చర్యలు

 Biodiversity flyover: GHMC engineers, SRDP experts visits on safety measures - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు, భద్రతకు సంబంధించి ఏర్పాట్లు చేసేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు నిర్మాణ కంపెనీ, కన్సల్టెంట్‌ సంస్థల ప్రతినిధులతో కలిసి నిన్న ఇక్కడ పర్యటించారు. ఫ్లైఓవర్‌పై వేగం 40కి మించకుండా కట్టడి చేయాలని ఈ  బృందం నిర్ణయించింది. ఇందుకు ఏమేం చేయాలనే దానిపై చర్చించింది. ప్రస్తుతం మూడు చోట్ల మాత్రమే ఉన్న రంబుల్‌ స్ట్రిప్స్‌ను పదికి పెంచాలని, వీటి ఎత్తును కూడా రెట్టింపు (15 మీ.మీ) చేయాలని నిర్ణయించింది. 

కొనసాగుతున్న దిద్దుబాటు చర్యలు
బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై  దిద్దుబాటు చర్యలు కొనసాగుతున్నాయి.  ఫ్లైఓవర్‌ పై వాహన వేగాన్ని 40 కిలోమీటర్లకు తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అలాగే ఫ్లై ఓవర్‌పై  10 మీటర్లకు ఒకటి చొప్పున రంబుల్‌  స్టిప్స్‌ను (తెల్లని మందమైన గీతలు) ఏర్పాటు చేస్తున్నారు. అలాగే  రోడ్లు లైన్‌కు వెలుగులీనే క్యాట్‌ ఐస్‌ పరికారాలను సిబ్బంది అమరుస్తున్నారు.

 చర్యలు చేపట్టాకే అనుమతి...  
ఈ బృందం ముఖ్యంగా వేగ నియంత్రణపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. వాహనాలు నిబంధనలు ఉల్లంఘించినా, వారి వైపు నుంచి పొరపాట్లున్నా వేగం తగ్గేలా ఏర్పాట్లు ఉండాలని యోచిస్తోంది. ఫ్లైఓవర్‌కు రెండువైపులా మలుపు ప్రాంతంలో క్రాష్‌ బారియర్‌ రోలర్స్‌ ఏర్పాటు చేయాలని, డిజైనింగ్‌ సంస్థ ఆమోదిస్తే రెయిలింగ్‌ ఎత్తును పెంచాలని నిర్ణయించింది. నిబంధనల మేరకే రెయిలింగ్‌ ఎత్తు ఉన్నప్పటికీ ప్రమాద ఘటనల నేపథ్యంలో ఎత్తు పెంచాలని.. ఫ్లైఓవర్‌కు కొంత దూరం నుంచే సూచిక, స్పీడ్‌ లిమిట్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రమాదాలు నియంత్రణకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే తిరిగి వాహనాలను అనుమతిస్తారు. ఇందుకు రెండు మూడు రోజులు పడుతుందని అంచనా. సోమవారం థర్డ్‌ పార్టీ కన్సల్టెంట్లను నియమించి, వారి సూచనల మేరకు చర్యలు చేపట్టనున్నారు.  

అభిప్రాయ భేదాలు...  
ఈ అధ్యయనంలో థిషా సంస్థ ప్రతినిధులు మల్లికార్జున్, శివకుమార్, స్టుప్‌ కన్సల్టెన్సీ ప్రతినిధి రాజశేఖర్, ఫ్లైఓవర్‌ నిర్మాణ సంస్థ ఎం.వెంకట్రావ్‌ కంపెనీ ప్రతినిధి నిశ్చల్, ట్రాఫిక్‌ అధికారి చంద్రశేఖర్, జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీధర్, ఎస్‌ఈ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.  అయితే ఫ్లైఓవర్‌ ప్రమాదం ఇంజినీర్ల మధ్య అభిప్రాయ భేదాలకు తెరతీసింది. డిజైన్‌ లోపమే ప్రమాదానికి కారణమని జేఎన్టీయూ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌రావు అభిప్రాయపడ్డారు. అయితే హైవేల హారిజాంటల్‌ జామెట్రీ, స్పీడ్‌ల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోకుండా ఒక ప్రొఫెసర్‌ ఇలా అనడం దురదృష్టకరమని.. న్యూఢిల్లీ సెంట్రల్‌ రోడ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సీఆర్‌ఆర్‌ఐ) రిటైర్డ్‌ హెడ్, ట్రాఫిక్‌ ఇంజినీర్, రోడ్‌ సేఫ్టీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ టీఎస్‌ రెడ్డి అన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top