బీజీ–3 పత్తి విత్తనంతో కొంప కొల్లేరు | Sakshi
Sakshi News home page

బీజీ–3 పత్తి విత్తనంతో కొంప కొల్లేరు

Published Sat, Oct 21 2017 4:52 AM

BG-III cotton illegally

సాక్షి, హైదరాబాద్‌: బహుళజాతి సంస్థల బాగోతాలను చూసీచూడనట్లుగా వ్యవహరించిన రాష్ట్ర వ్యవసాయశాఖ ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’చందాన ఇప్పుడు మేల్కొంది. మూడు నాలుగేళ్లుగా బీజీ–3 పత్తి విత్తనాన్ని అనుమతి లేకుండా రైతులకు అంటగడుతున్నా పట్టించుకోని ఆ శాఖ ఇప్పుడు భయంతో వణికిపోతుంది. జీవ వైవిధ్యానికి పూడ్చలేని నష్టం జరుగుతుందంటూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది.

దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే పరిస్థితి ప్రమాదకరంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు అంచనాలకు మించి ఏకంగా 47.72 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అందులో దాదాపు ఏడెనిమిది లక్షల ఎకరాల్లో బీజీ–3 పత్తి విత్తనం వేసినట్లు అంచనా. పరిస్థితి అత్యంత దారుణంగా ఉండటంతో కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయశాఖ నివేదిక పంపింది. ఆ నివేదికలోని వివరాలు...

మోన్‌శాంటో చేసిన పాపమే...
మోన్‌శాంటో కంపెనీ రౌండ్‌ అప్‌ రెడీ ప్లెక్స్‌(ఆర్‌ఆర్‌ఎఫ్‌) అనే కీటక నాశినిని తట్టుకునే బీజీ–3 పత్తి విత్తనాలను అభివృద్ధి చేసి అమెరికాలో వాణిజ్యపరం చేసి మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా అమ్మింది. అంతలోనే మహికో కంపెనీ ఆర్‌ఆర్‌ఎఫ్‌ కారకం గల బీజీ–3 పత్తి రకాలను రైతు క్షేత్రాల్లో ప్రయోగాత్మక పరిశీలనలు జరిపిందని తెలిసింది. ఇప్పుడది పత్తి పంటలో ఉంది. ఇతర పత్తి రకాలను కలుషితం చేస్తూ జీవ వనరులను దెబ్బతీసే విధంగా వ్యాపిస్తోందని ఆ నివేదికలో వ్యవసాయశాఖ వివరించింది.

అనుమతి లేకుండా బీజీ–3 విక్రయాలు...
బీజీ పత్తి విత్తనం ప్రతీ ఏడాది పెరుగుతూ వస్తోంది. చాలా విత్తన కంపెనీలు బీజీ పత్తి విత్తనాలను విక్రయించాయి. దీనివల్ల పత్తి పండించే ప్రాంతాల్లో అనుమతిలేని చట్ట వ్యతిరేక జన్యుమార్పిడి కలిగిన కొన్ని రకాల బీజీ–3 పత్తి రకాలు విత్తనోత్పత్తి సమయంలో సహజంగా కలుషితమయ్యాయి. కలుపునాశిని, పురుగులను తట్టుకునే కారకాలు గల జన్యుమార్పిడి పత్తివిత్తనాలను అనుమతి లేకుండా అమ్ముతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి జన్యుమార్పిడి పత్తి విత్తనాలను కేంద్రం అనుమతి లేకుండా అమ్ముతున్న విషయాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని నియమించింది. బీజీ–3 పత్తి రకాల వ్యాప్తిపై చర్చించి కేంద్రానికి నివేదించాలని నిర్ణయించారు. అనుమతిలేని బీజీ–3 విత్తనాల క్రమబద్ధీకరణ, పేటెంట్‌ హక్కులు తదితర అంశాలపై అదనపు అడ్వకేట్‌ జనరల్‌ నుంచి చట్టపరమైన అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ కేంద్రానికి విన్నవించిన నివేదికలో పేర్కొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement