బైక్‌.. టేక్‌ కేర్‌

Awareness on Two Wheeler Bikes Repair in Rain Season - Sakshi

ఏయే సమస్యలు ఉత్పన్నమవుతాయంటే...

సనత్‌నగర్‌: వర్షాకాలం వచ్చిందంటే సీజనల్‌ వ్యాధుల ప్రభావమే కాదు.. బైక్‌ కష్టాలూ తప్పవు. నిత్యం మనల్ని గమ్యస్థానానికి చేర్చడంలో కీలకంగా నిలిచే ద్విచక్ర వాహనాలను పదిలంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా వర్షాకాలంలోబైక్‌లు మొరాయిస్తుండడం సహజం. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ కష్టాలను అధిగమించవచ్చంటున్నారు బైక్‌ మెకానిక్‌లు.

వర్షాకాలంలో పవర్‌ ఫ్లగ్‌లు తరచూ పాడవుతుంటాయి. దీంతో ఎంతగా ప్రయత్నించినా∙బైక్‌ స్టార్ట్‌ కాదు.  
నిరంతరాయంగా కురిసే వర్షం కారణంగా కాయిల్స్‌ సామర్థ్యం తగ్గి కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.  
ప్రయాణంలో మార్గమధ్యలో భారీగా వర్షం  నీరు నిలిచినప్పుడు చాలామంది అందులో నుంచే వాహనాన్ని నడిపేస్తుంటారు. ఈ క్రమంలో వాహనం మునిగి ఇంజన్‌లోకి నీరు వెళ్ళి పాడయ్యే ప్రమాదం ఉంది. అలాగే సైలెన్సర్‌లోకి నీరు వెళ్ళడం గానీ, కొన్ని బైక్‌లకు సీటు కింద ఉండే ఫిల్టర్‌ బాక్స్‌లోకి నీరు వెళుతుంది. దీంతో బైక్‌ మొరాయిస్తుంది.
వర్షాకాలంలో రోడ్లు కొట్టుకుపోయి కంకర తేలుతాయి. ఈ క్రమంలో కంకర తేలిన రోడ్లపై నీరు నిల్వ ఉంటాయి. అయితే టైర్ల సామర్ధ్యం సరిగా లేకుంటే రాళ్లు దిగి పంక్చర్‌కు అవకాశం ఉంటుంది.
చాలామంది వాహనాలు సెల్లార్లలో గానీ, లోతట్టు ప్రాంతాల్లో గానీ పార్క్‌ చేస్తుంటారు. దీంతో భారీ వర్షం కురిసినప్పుడు ఆయా వాహనాలు కొట్టుకుపోవడమే కాకుండా ఇంజన్‌లోకి నీరు వెళ్ళి పాడైపోతుంటాయి.
కూర్చొనే సీటు సరైన క్వాలిటీ లేనిపక్షంలో వర్షం పడిన సమయంలో సీటు వర్షంలో నానిపోయి త్వరగా పాడైపోతుంది.
 వర్షాకాలంలో బైక్‌ ఎక్కువ సేపు తడిస్తే ఆ చల్లదనానికి బ్యాటరీ పవర్‌ కూడా డౌన్‌ అయ్యే అవకాశం ఉంటుంది.ఈ క్రమంలో స్టార్టర్‌ నొక్కిన వెంటనే స్టార్ట్‌ అవ్వదు. బ్యాటరీ పవర్‌ డౌన్‌ అవడంతో హారన్, ఇండికేటర్స్‌ శబ్దాలు ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంటాయి.
వర్షాకాలంలో కీస్‌ రంధ్రంలోకి నీరు చేరి అరిగిపోతుంటాయి. 

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే...
వర్షాకాలానికి ముందే కొత్త పవర్‌ ఫ్లగ్‌లు వేయించుకుంటే మేలు.  
ఎప్పటికప్పుడు ఎయిర్‌ ఫిల్టర్‌ క్లీన్‌ చేస్తుండడం ద్వారా కాయిల్‌ వీక్‌ కాకుండా చూసుకోవచ్చు.  
రోడ్డుపై భారీగా వరదనీరు చేరినప్పుడు డైరెక్ట్‌గా వాహనం ఆన్‌లో ఉంచి వెళ్ళడం కంటే సైలెన్సర్‌కు, సీటు కింద ఉన్న ఫిల్టర్‌ బాక్స్‌లకు ఉన్న రంధ్రాలను వస్త్రంతో మూసివేసి నడిపించుకుని వెళ్ళడం ఉత్తమం. ఆ తరువాత వాటిని తీసేసి కిక్‌ కొడితే త్వరగా స్టార్ట్‌ అవుతుంది.
వర్షాకాలంలో కంకర తేలిన రోడ్లపై రాళ్లు గుచ్చుకుని తరచూ పంక్చర్‌ పడే అవకాశం ఉన్నందున సాధ్యమైనంత వరకు టైర్ల సామర్థ్యం ఉండేలా చూసుకోవాలి.
కీస్‌ రంధ్రంలోకి నీరు చేరకుండా ఉండేలా కవర్‌ అయ్యేలా చూసుకోవాలి.
సీటు నాని పాడవకుండా ఉండేలా క్వాలిటీ కవర్లను తొడిగితే మేలు.
వర్షాకాలంలో లోతట్టు ప్రాంతం, సెల్లార్లలో కాకుండా సాధ్యమైనంతవరకు వాహనం మునగకుండా ఉండే చోట పార్క్‌ చేస్తే మేలు. తద్వారా ఇంజన్‌లోకి నీరు చేరకుండా ఉంటుంది. బ్యాటరీ సామర్ధ్యం కూడా తగ్గకుండా ఉంటుంది.

వర్షాకాలంలో బైక్‌లకుఎక్కువ ముప్పు
వర్షంలో సైతం రయ్‌మని దూసుకుపోతుంటారు. భారీగా నిలిచిన నీటిలో నుంచి కూడా బైక్‌లను నడిపేయడం వల్ల మునిగిపోయి ఇంజన్‌ సమస్యలు ఉత్పన్నమవుతాయి. సాధ్యమైనంతవరకు బైక్‌ మునిగిపోతుందనుకుంటే సైలెన్సర్‌ను మూసివేసి నడిపించుకుని వెళ్ళాలి. వర్షాకాలంలో ప్రధానంగా పవర్‌ ఫ్లగ్‌లు తరచూ మొరాయిస్తుంటాయి. ముందస్తుగా కొత్తది వేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. లేదంటే మార్గమధ్యంలో ఆగిపోతే ఇబ్బందులు పడాల్సివస్తుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే బైక్‌లను పదిలంగా ఉంచుకోవచ్చు.             – శ్రీను, బైక్‌ మెకానిక్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top