ప్రైవేటు వ్యవసాయ కళాశాలలు!

Agriculture Department Planning For Agriculture Colleges In Telangana - Sakshi

కీలక నిర్ణయం దిశగా వ్యవసాయశాఖ కసరత్తు

కోర్సులకు డిమాండ్‌ నేపథ్యంలో ఏర్పాటుకు సిద్ధమైన కొందరు..

విధాన నిర్ణయం తీసుకోనందున వినతిని తోసిపుచ్చిన సర్కారు

త్వరలో ఈ అంశాన్ని సీఎం కేసీఆర్‌కు నివేదించనున్న అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రైవేటు వ్యవసాయ కళాశాలలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ యోచిస్తోంది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ కూడా దీనిపై కసరత్తు చేస్తోంది. వ్యవసాయశాఖ ఇటీవల నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశాల్లోనూ ప్రైవేటు వ్యవసాయ కళాశాలల ఏర్పాటు అంశం చర్చకు వచ్చింది. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కూడా ప్రైవేటు అగ్రి కళాశాలల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారని, ఈ నేపథ్యంలో కసరత్తు చేస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ‘వ్యవసాయ, ఉద్యాన తదితర అనుబంధ రంగాల కోర్సులకు భారీ డిమాండ్‌ ఉంది.

ఈ కోర్సులు చేసిన వారికి ఉద్యోగావకాశాలు బాగున్నాయి. ప్రభుత్వ అగ్రి కాలేజీల్లో సీట్లు పరిమితంగా ఉండటంతో మహారాష్ట్ర సహా ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుతున్నారు. దీంతో రాష్ట్రంలోనే ఆ కళాశాలలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది’అని వ్యవసాయశాఖ భావిస్తోంది. త్వరలో సీఎం కేసీఆర్‌ వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే కొందరు ప్రైవేటు వ్యవసాయ కాలేజీల ఏర్పా టుకు ముందుకు వచ్చారు. కానీ వాటి ఏర్పాటుపై విధానపర నిర్ణయం తీసుకోనందున వారి విన్న పాన్ని తిరస్కరించామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

సీట్లు తక్కువ... డిమాండ్‌ ఎక్కువ 
ఇంటర్‌ బైపీసీ పూర్తయిన విద్యార్థులకు ఎంసెట్‌ ఆధారంగా వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, ఫిషరీస్‌ సైన్స్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ పరిధిలోని 6 వ్యవసాయ కళాశాలల్లో బీఎస్సీ ఆనర్స్‌ అగ్రికల్చర్‌లో 432 సాధారణ సీట్లు, 75 పేమెంట్‌ సీట్లు, కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన వర్సిటీ పరిధిలోని 2 కళాశాలల్లో బీఎస్సీ ఆనర్స్‌ హార్టీకల్చర్‌లో 130 సాధారణ సీట్లు, 20 పేమెంట్‌ సీట్లు ఉన్నాయి. అలాగే పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విద్యాలయం పరిధిలోని 3 కళాశాలల్లో బీవీఎస్‌సీ అండ్‌ యానిమల్‌ హజ్బెండరీలో 158 సీట్లు, వనపర్తి జిల్లా పెబ్బేరు, ఏపీలోని నెల్లూరు జిల్లా ముత్తుకూర్లలోని ఫిషరీస్‌ సైన్స్‌ కళాశాలల్లోని బీఎఫ్‌ఎస్‌సీలో (తెలంగాణ కోటా) 36 సీట్లలో ప్రవేశానికి అవకాశముంది.

ఈ ఏడాది బీఎస్సీ ఆనర్స్‌ అగ్రికల్చర్‌లో 25 సీట్లు ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్‌ కోటా కింద భర్తీకి అవకాశం కల్పించారు. ఎన్‌ఆర్‌ఐ కోటా సీటుకు ఫీజు రూ. 34 లక్షలు, పేమెంట్‌ సీట్లకు రూ. 14 లక్షల చొప్పున వసూలు చేయాలని వర్సిటీ ఈ ఏడాది నిర్ణయించింది. తెలంగాణలో ఈ ఏడాది బైపీసీ వార్షిక పరీక్షలో పాసైనవారు 62వేల మంది ఉన్నారు. వారు కాకుండా గతంలో ఫెయిలై తిరిగి పరీక్ష రాసిన వారు, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రాసినవారు మరో 40 వేల మంది ఉన్నారు. అంటే లక్ష మందికిపైగా బైపీసీ పూర్తి చేశారు. వారిలో చాలామంది సాధారణ బీఎస్సీ డిగ్రీకి బదులు ఎంబీబీఎస్, బీడీఎస్‌ తదితర మెడికల్‌ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

కానీ ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌లో 4,670 సీట్లు, డెంటల్‌లో 1,140 సీట్లు, ఆయుర్వేద, హోమియో, యునాని కోర్సుల్లో 655 సీట్లున్నాయి. అన్ని మెడికల్‌ సీట్ల సంఖ్య 6,465 ఉన్నాయి. ఈ ఏడాది నీట్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన వారు ఏకంగా 37 వేల మంది ఉన్నారని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. దీంతో మెడికల్‌లో సీట్లు రాని వారిలో వేలాది మంది వ్యవసాయ కోర్సులు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా సీట్లు రాని వారంతా ఇతర రాష్ట్రాల్లో ప్రైవేటు వ్యవసాయ కోర్సులు చదువుతున్నారు.

పరిశీలనలో ఉంది.. 
ప్రైవేటు వ్యవసాయ కాలేజీల ఏర్పాటు అంశం జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశీలనలో ఉంది. దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం జరగలేదు. – వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

కొందరు సంప్రదించారు... 
ప్రైవేటు కాలేజీల ఏర్పాటు కోసం కొందరు సంప్రదించిన మాట వాస్తవమే. అయితే ప్రైవేటు వ్యవసాయ కళాశాలల ఏర్పాటుపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోనందున ఆయా విన్నపాలను తిరస్కరించాం. 
– పార్థసారధి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top