మార్కెట్లకు వచ్చే రైతులకు నో లాక్‌ డౌన్‌

No Lock Down For Farmers In Telangana - Sakshi

వ్యవసాయ ఉత్పత్తులను బజార్లకు తరలించేందుకు వెసులుబాటు

20, 21 తేదీల్లోని రేట్లను ప్రాతిపదికగా తీసుకొని విక్రయాలు జరపాలి

కూరగాయలు, పండ్లకు విపరీతమైన ధరలు పెంచితే ఊరుకోం..

ఉత్తర్వులు జారీ చేసిన వ్యవసాయ శాఖ 

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ ఉత్పత్తులను రైతు బజార్లకు, హోల్‌సేల్‌ మార్కెట్లకు తరలిస్తున్న రైతులకు లాక్‌డౌన్‌ ఉత్తర్వులు వర్తించ వని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 20, 21వ తేదీల్లో ఉన్న కూరగాయలు, పండ్లకు ఉన్న రేట్లను ప్రాతిపదికగా తీసుకుని విక్రయాలు జరపాలని ఆదేశించింది. కోవిడ్‌ మహ మ్మారి పేరుతో సంక్షోభాన్ని సృష్టించడం, దోపిడీ చేయడం, విపరీతమైన ధర పెంపు చేయరాదని తెలిపింది. జిల్లాల్లో కలెక్టర్లు ధర నిర్ణయించి, పర్యవేక్షణ చేస్తారని స్పష్టం చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి మార్కెటింగ్, ఉద్యాన శాఖలు తీసుకోవాల్సిన చర్యలు, ఎరువులు, విత్తనాల సరఫరాపై సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాయిదా వేసిన అమ్మకాల కోసం ఏ రైతు అయినా తన ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్‌ గోడౌన్లలో నిల్వ చేయాలనుకుంటే, అలాంటి రైతులను ఎటువంటి చార్జీలు లేకుండా అనుమతించాలన్నారు.

వారికి కూడా.. 
రాష్ట్రంలోని టోకు మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల్లో వ్యాపారం చేస్తున్న వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లకు, హమాలీలు, దడువాయిలకు కూడా లాక్‌డౌన్‌ నిబంధనలు వర్తించవని జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. అయితే కమీషన్‌ ఏజెంట్లు, వ్యాపారులు రోజూ తమ షాప్‌లలో పనిచేస్తున్న వారందరికీ చేతులు కడుక్కోవడానికి హ్యాండ్‌ శానిటైజర్లను అందించాలన్నారు. మార్కెట్‌ యార్డులు, రైతు బజార్లలో పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ఏదైనా నిర్లక్ష్యం చేస్తే రైతు బజార్, వ్యవసాయ మార్కెటింగ్‌ కార్యదర్శిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలుంటాయని హెచ్చరించారు. చెత్తను శుభ్రపరిచే కాంట్రాక్టర్లు ఉల్లంఘనలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేసే వాహనాలు రాష్ట్రంలో లాక్‌డౌన్‌లోనూ అనుమతించనున్నట్లు స్పష్టం చేశారు. 
►అంతరాష్ట్ర సరిహద్దులను పర్యవేక్షించే పోలీసులు, కూరగాయలు, పండ్లను టోకు మార్కెట్లకు ఎటువంటి ఆటంకాలు లేకుండా తరలించడానికి అనుమతిస్తారు. 
►వీలైనంతవరకూ రైతులకు చెల్లింపులతో సహా హోల్‌సేల్‌ ఏఎంసీలలోని అన్ని లావాదేవీలు ఆన్‌లైన్‌ మోడ్‌ ద్వారా మాత్రమే ఉండాలి. ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడితే తీవ్ర చర్యలుంటాయి.

ఉద్యాన శాఖ చేయాల్సింది.. 
వ్యవసాయ మార్కెటింగ్‌ విభాగంతో సమన్వయం చేసుకుంటూ హైదరాబాద్‌ సహా జిల్లాలకు కూరగాయలు, పండ్ల సరఫరా, ధరలను పర్యవేక్షించడానికి ఉద్యాన శాఖ అంతర్గత పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తారు. జిల్లా పరిపాలన సమన్వయంతో స్థానిక మండీలు, రైతు బజార్లకు తాజా కూరగాయలు, సీజనల్‌ పండ్ల సరఫరాను కమిటీ నిర్ధారిస్తుంది. 
►ఉద్యాన శాఖ మున్సిపల్‌ ప్రాంతాల్లో కూరగాయల అవసరాన్ని రోజు వారీగా అంచనా వేయాలి. ప్రస్తుత పంటల వారీగా సాగు అంచనా, ఉత్పత్తి వివరాలు సేకరించాలి. 
►సంక్షోభాన్ని అధిగమించడానికి అవసరమైన పంటల కింద కూరగాయల విస్తీర్ణాన్ని పెంచే భవిష్యత్తు ప్రణాళికను రూపొందించాలి. 
►ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి కూరగాయలను రవాణా చేయకుండా ఉండటానికి ఎక్కడి వారి అవసరాలకు అక్కడే పండించుకునేలా భవిష్యత్‌ ప్రణాళికలు సిద్ధం చేయాలి.

విత్తనాలు, ఎరువులకు ఇలా.. 
►ఇక విత్తనాలను రైతుల పొలాల నుంచి ప్రాసెసింగ్‌ ప్లాంట్లకు, ఒక ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ నుంచి ఇతర ప్రాసెసింగ్‌ ప్లాంట్లకు, డిస్ట్రిబ్యూషన్‌ పాయింట్ల నుంచి రిటైలర్లకు తీసుకెళ్ళే వాహనాలు తగిన తనిఖీల తర్వాత ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అనుమతిస్తారు. విత్తన కంపెనీలు కచ్చితంగా సూచనలు పాటించాల్సిందే. 
►విత్తన డీలర్లు లాక్‌ డౌన్‌ కాలంలో పనిచేయాల్సిందే. అన్ని ఎరువుల డీలర్‌ దుకాణాలు తెరిచి ఉంటాయి. 
►ఎరువుల లోడ్, అన్‌లోడ్‌ చేయటంలో పాల్గొనే హమాలీ యూనియన్లు, లారీ రవాణా సంఘాలు, ఇతర సిబ్బంది, ఏజెంట్లు, స్థానిక కాంట్రాక్టర్లు కోవిడ్‌ భద్రతా చర్యలను అనుసరించి కార్యకలాపాలను కొనసాగించాలి.

మార్కెటింగ్‌ విభాగం చేయాల్సింది
►అగ్రికల్చరల్‌ మార్కెట్‌ కమిటీ మార్కె ట్‌ యార్డులు, రైతు బజార్లలోని అన్ని క్యాంటీన్లు, టాయిలెట్‌ బ్లాక్స్, వాటర్‌ పాయింట్స్‌ మొదలైన వాటిలో హ్యాండ్‌ శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. 
►ఉత్పత్తులతో పాటు మార్కెట్‌ యార్డ్‌లోకి ఒక వ్యక్తిని (రైతు) మాత్రమే అనుమతించాలి. 
►రైతు బజార్లలో కూరగాయలు, ఇతర వస్తువుల అమ్మకాలకు సంబంధించి, క్రమబద్ధమైన కొనుగోలు కోసం ఇద్దరు కస్టమర్ల మధ్య మీటర్‌ కంటే ఎక్కువ దూరం ఉండేలా చూడాలి. ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు కొనుగోళ్లు జరిపే సమయంలో స్థానిక పోలీసుల సాయం తీసుకోవాలి.  
►పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ ద్వారా కూరగాయల రేట్లను మార్కెటింగ్‌ అధికారులు నిరంతరం ప్రకటించాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top