హరితహారంలో 1.97 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం 

6 Plants To Each Family - Sakshi

ప్రతి కుటుంబానికి  6 చొప్పున పంపిణీ

మహిళా సంఘాల సభ్యులకూ బాధ్యతలు

పకడ్బందీ ప్రణాళికలతో   అధికారులు సిద్ధం

సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఊళ్లను హరిత గ్రామాలుగా మార్చేందుకు ప్రభుత్వం పూనుకుంది. నాలుగో విడత హరితహారంలో భాగంగా ప్రతి ఇంట్లో పచ్చదనం కనిపించేలా ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటివరకు ప్రభుత్వ స్థలాలు, రహదారి పరిసరాల్లో మొక్కలు నాటేందుకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం.. ఈసారి ప్రతి గ్రామంలోనూ స్వయం సహాయక సంఘాల సహకారం తీసుకోనుంది. సంఘంలోని ప్రతి సభ్యురాలు తన ఇంటి ఆవరణలో ఆరు మొక్కలు నాటేలా ప్రోత్సహించడం ద్వారా క్షేత్రస్థాయిలో హరితహారం విజయవంతం చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.

ఈ విడతలో జిల్లావ్యాప్తంగా 1.97 కోట్ల మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కలెక్టర్‌ డీఎస్‌.లోకేష్‌కుమార్‌ హరితహారం కార్యక్రమంపై పలుమార్లు సమీక్షలు నిర్వహించి.. లక్ష్యం మేరకు అధికారులు విరివిగా మొక్కలు నాటించాలని దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో అధికారులు తమ శాఖల పరిధిలో మొక్కలు నాటించేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలోని పలు నర్సరీల్లో మొక్కలు ఏపుగా పెరగడంతో క్షేత్రస్థాయిలో మొక్కలు నాటేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించారు.

రాష్ట్రవ్యాప్తంగా లక్ష్యాన్ని చేరుకునే విధంగా ప్రభుత్వం చేస్తున్న సూచనలతోపాటు జిల్లా అధికారులు నూతన ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే కుటుంబానికి ఆరు మొక్కలు పంపిణీ చేసి నాటించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. జిల్లా అధికారులు ఒకడుగు ముందుకేసి ఇందులో మహిళలు పాలుపంచుకునే విధంగా చర్యలు చేపట్టారు. గత మూడు విడతల్లో నాటిన మొక్కలు కొన్ని చనిపోవడంతోపాటు సంరక్షణ లేక ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటనున్నారు. ఈసారి నాటిన మొక్కలు ఎండిపోకుండా.. వాటిని సంరక్షించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టనున్నారు.  

మహిళా సంఘాలకూ బాధ్యత.. 

హరితహారంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడం ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు అధికారులతోపాటు ప్రజలను కూడా ఇందులో భాగస్వాములను చేయడం ద్వారా విజయవంతం చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే మొక్కలు నాటడంతోనేతమ బాధ్యత తీరిందని ప్రజలు భావిస్తుండటంతో చాలా వరకు మొక్కలు ఎండిపోతున్నాయి.

అలా కాకుండా.. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చూడాలనే ఉద్దేశంతో ఈసారి హరితహారం కార్యక్రమంలో మహిళా సంఘాలు పాలుపంచుకునే విధంగా చేయాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 25,034 స్వయం సహాయక సంఘాలు ఉండగా.. వీటిలో 2,31,586 మంది సభ్యులున్నారు.

వీరిచేత సుమారు 13లక్షలకు పైగా మొక్కలు నాటించాలని ప్రయత్నిస్తున్నారు. మహిళా సంఘాల్లోని ఒక్కో సభ్యురాలికి ఆరు మొక్కలు ఇచ్చి.. వారి ఇంటి ఆవరణతోపాటు పరిసరాల్లో నాటించాలని సూచిస్తున్నారు. వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది. ఒకవేళ మొక్క ఏ కారణం చేతనైనా ఎండిపోయినా.. చనిపోయినా.. దాని స్థానంలో మరో మొక్కను వెంటనే నాటాల్సి ఉంటుంది.  

రైతులకూ మొక్కల పంపిణీ.. 

డీఆర్‌డీఏ ద్వారా రైతులకు కూడా మొక్కలు పంపిణీ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు మొక్కలను అందజేస్తారు. వీటి రవాణా, నాటేందుకు, నీళ్లు పోసేందుకు అయ్యే ఖర్చులను ఉపాధిహామీ పథకం ద్వారా ఆయా రైతులకు చెల్లిస్తారు. అలాగే పెద్ద రైతులకు కూడా గుంతలు తీసినందుకు, మొక్కలు నాటేందుకు అయ్యే ఖర్చును చెల్లించనున్నారు.

ఇక ప్రతి కుటుంబానికి 6 మొక్క లు పెంచుకునేందుకు ఉచితంగా ఇవ్వనున్నారు. వీటిని ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు. అలాగే 6 నుంచి 9వ తరగతి వరకు చదవుతు న్న ప్రతి విద్యార్థికి 6 మొక్కలు పంపిణీ చేయనున్నారు. వీరు కూడా తమ ఇంటి ఆవరణలో మొక్కలను పెంచాల్సి ఉంటుంది. ఇతర ప్రభుత్వ శాఖలైన విద్య, నీటిపారుదల, దేవాదాయ తదితర శాఖలు కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములవుతారు.   

ప్రభుత్వ శాఖల లక్ష్యం ఇలా.. 

జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 1.97 కోట్ల మొక్కలు నాటించాలని లక్ష్యంగా నిర్ణయించారు. వీటిలో డీఆర్‌డీఏ ద్వారా 66 లక్షల మొక్కలు, అటవీ, పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో 45 లక్షలు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 15 లక్షలు, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో 8 లక్షలు, సింగరేణి ద్వారా 5 లక్షలు, మున్సిపాలిటీల ద్వారా 8 లక్షలు, ఐటీసీ ద్వారా 50 లక్షల మొక్కలు నాటించేందుకు బాధ్యతలు అప్పగించారు. ఆయా శాఖల అధికారులు లక్ష్యాల మేరకు మొక్కలు నాటించేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top