breaking news
-
ముగ్గురు ‘పెద్దలు’ ఎవరో!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ రెండో తేదీన ఖాళీ అయ్యే మూడు రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించిన ద్వైవార్షిక ఎన్నిక షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. బీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్‌కుమార్‌ల పదవీ కాలం పూర్తి కానుండటంతో, ఆ స్థానాల భర్తీకి ఈ ఎన్నిక జరుగుతోంది. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ జారీ కానుండగా, 27న ఎన్నిక జరగనుంది. అయితే 15వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. దీంతో రాష్ట్ర అసెంబ్లీలో సంఖ్యాపరంగా ఎక్కువ సంఖ్యలో ఓట్లు కలిగి ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ల్లో సందడి మొదలైంది. పలువురు నేతలు పెద్దల సభలో ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతుండగా, ఎవరికి చాన్స్ దక్కుతుందనే చర్చ రెండు పార్టీల్లో జరుగుతోంది. ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో.. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్‌కు రెండు, బీఆర్ఎస్కు ఒక స్థానం చొప్పున దక్కే అవకాశం ఉంది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో విప్ వర్తించదనే నిబంధనను ఆసరాగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ మూడో అభ్యర్థిని కూడా బరిలోకి దించే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవలి కాలంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ను కలవడం, ఇటీవలి దావోస్ పర్యటన అనంతరం లండన్‌లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో ముఖ్యమంత్రి భేటీ, తదితర పరిణామాలను ప్రస్తావిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం మిత్రపక్షం ఎంఐఎం సహకారంతో ఒక సభ్యుడిని సునాయాసంగా గెలిపించుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తోంది. ఒకటి ఢిల్లీకి, మరొకటి స్థానికులకు రెండు రాజ్యసభ స్థానాలు ఖచ్చితంగా దక్కనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని ఢిల్లీ కోటాలో అధిష్టానం చెప్పిన వారి కోసం రిజర్వు చేయాలని భావిస్తోంది. పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాం«దీని రాష్ట్రం నుంచి లోక్‌సభకు పోటీ చేయాల్సిందిగా కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ ఇప్పటికే తీర్మానం ఆమోదించింది. అలా వీలు కాని పక్షంలో కనీసం ఇక్కడ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించాలని పార్టీ నేతలు కోరుతున్నారు. ఇందుకు కూడా సోనియా మొగ్గు చూపని పక్షంలో ఇతర రాష్ట్రాలకు చెందిన జాతీయ స్థాయి నేతల్లో పార్టీ ఎంపిక చేసే ఒకరిని తెలంగాణ నుంచి పెద్దల సభకు పంపాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. నేడు టీపీసీసీ పీఏసీ భేటీలో చర్చ! మరో సీటుపై పార్టీ నేతలు పలువురు ఆశలు పెట్టుకున్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో సామాజికవర్గ సమీకరణలు కీలకం కావడంతో ఎస్సీ మాదిగ లేదా రెడ్డి లేదా బీసీలకు చాన్స్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. గాంధీభవన్‌లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలతో పాటు రాజ్యసభకు కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన చర్చ కూడా జరిగే అవకాశముందని చెబుతున్నారు. అరడజనుకు పైగానే ఆశావహులు రాష్ట్రం నుంచి రాజ్యసభలో అడుగు పెట్టడంపై కాంగ్రెస్ నుంచి పలువురు సీనియర్ నేతలు ఆసక్తి చూపుతున్నారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, మాజీ కేంద్ర మంత్రులు బలరామ్ నాయక్, రేణుకా చౌదరి, సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్ కుమార్, వి.హనుమంతరావు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. బీఆర్ఎస్ తరఫున ఎవరో? రాష్ట్రం నుంచి ఏడుగురు సభ్యులు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తుండగా అందరూ బీఆర్ఎస్కు చెందిన వారే కావడం గమనార్హం. ప్రస్తుతం ముగ్గురు రిటైర్ కానుండగా ఒక సీటు మాత్రం తిరిగి పార్టీకి దక్కనుంది. ఈ స్థానంలో తనకు మరోమారు అవకాశం ఇవ్వాల్సిందిగా వద్దిరాజు రవిచంద్ర కోరుతున్నారు. 2018 ఏప్రిల్ 13న రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన బండా ప్రకాశ్ తన ఆరేళ్ల పదవీకాలం పూర్తి కాకుండానే 2022 మే 30న తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన ప్రకాశ్ ప్రస్తుతం మండలి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు బీఆర్ఎస్ తరఫున వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనకు సుమారు రెండేళ్ల పాటు మాత్రమే రాజ్యసభ ఎంపీగా అవకాశం దక్కినందున మరోమారు చాన్స్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అయితే సామాజికవర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని బీసీ వర్గానికి చెందిన వారికి బీఆర్ఎస్ అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున డాక్టర్ కె.కేశవరావు (మున్నూరు కాపు), దామోదర్ రావు (వెలమ), పార్థసారథి రెడ్డి (రెడ్డి), కేఆర్ సురేశ్‌రెడ్డి (రెడ్డి) ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్నూరుకాపు, ముదిరాజ్, యాదవ లేదా గౌడ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని కేసీఆర్ ఎంపిక చేస్తారననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో పాటు మరికొన్ని పేర్లు కూడా పరిశీలనకు వచ్చే అవకాశముందని అంటున్నారు. -
మంత్రి, జెడ్పీ చైర్మన్ మధ్య మాటల యుద్ధం
బీబీనగర్: గ్రామ పంచాయతీ భవన ప్రారంభో త్సవం సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి జెడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డిల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. సోమ వారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు గ్రామపంచా యతీ భవన ప్రారంబోత్సవ అనంతరం నిర్వ హించిన సమావేశంలో సందీప్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వారంలోపే రైతు భరోసాతో పాటు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఇవ్వలేదని, రైతుబంధు రాలేదని ఎవరైనా అడిగితే చెప్పుతో కొడ తాం అనడం సరికాదని, రైతుబంధు ఇచ్చింది మేమే అని అనడంతో వెంటనే కాంగ్రెస్ నాయకులు జెడ్పీ చైర్మన్‌తో వాగ్వాదం చేశారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసుకొని.. సందీప్‌రెడ్డి చిన్న పిల్లగాడు, అతనికి ఏమీ తెలియదని, తెలియక మాట్లాడుతున్నాడని అనడంతో సందీప్‌రెడ్డి జోక్యం చేసుకొని.. తాను అన్నీ తెలిసే మాట్లాడుతున్నానని అనడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన మంత్రి.. ‘వీన్ని ఎత్తి బయటపడేయండి’అని అనడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజీ మీదకు దూసుకొచ్చారు. సందీన్రెడ్డి డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సందీప్‌రెడ్డిని స్టేజీపై నుంచి వెళ్లిపోవాలని డీసీపీ, ఏసీపీ చెప్పగా తాను ఎందుకు వెళ్లాలి అంటూ జెడ్పీ చైర్మన్ పోలీసులను ప్రశ్నించారు. దీంతో మంత్రి మరింత ఆగ్రహంతో ‘వార్డు మెంబర్‌గా కూడా గెలవలేవు.. ఏదో నీ తండ్రి మాధవరెడ్డి పేరుతో పదవి వచ్చింది తప్ప నీలో ఏమీలేదు. నీ సొంత గ్రామానికి రోడ్డు వేయించలేకపోయావు బచ్చా’అని అన్నారు. పోలీసులు సందీప్‌రెడ్డిని స్టేజీ కిందకు తీసుకుపోతున్న సమయంలో ఒకరిద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు వెనుక నుంచి ఆయనను పిడుగుద్దులు గుద్దారు. సభాస్థలి నుంచి కొద్ది దూరం వెళ్లిన తర్వాత సందీప్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పలేక మంత్రి కోమటిరెడ్డి తనపై దాడి చేయించారని చెప్పారు. -
పోయే నేతలను బతిమాలొద్దు
చేవెళ్ల, వికారాబాద్: ‘ఒకరిద్దరు నాయకులు పార్టీ నుంచి పోయినంత మాత్రాన బాధ పడేది ఏమీ లేదు.. మీరు అండగా ఉండండి చాలు.. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల్లో చాకుల్లాంటి కొత్త నాయకులను తయారు చేసుకుందాం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో సోమవారం కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’’ప్రజలు పదేళ్లు మనకు అధికారం ఇచ్చారు. వంద స్పీడ్‌తో కారు పాలన జోరుగా సాగింది. కారు ఇప్పుడు సర్వీసింగ్‌కు వెళ్లింది అంతే.. బాధపడాల్సిన పనిలేదు. గ్రామాల్లో కారు ఓవర్ లోడ్ అయిన మాట వాస్తవమే. అందుకే దిగిపోయే ముగ్గురు, నలుగురు నాయకులను వెళ్లిపోనిద్దాం,. పోయే వాళ్లను బతిమిలాడాల్సిన పని లేదు’’అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గైర్హాజరు.. చేవెళ్లలో నిర్వహించిన సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య గైర్హాజరయ్యారు. ఆదివారం రాత్రి ఇంట్లో మెట్లపై కాలుజారి పడటంతో గాయమైందని అందుకే ఆయన సమావేశానికి రాలేకపోయారని కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నేవీ రాడార్ ఏర్పాటు ప్రమాదకరం! ’’వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తామంటున్న వెరీలో ఫ్రీక్వెన్వీ రాడార్ స్టేషన్ ప్రజలకు, వన్య ప్రాణులకు ఎంతో ప్రమాదకరం.. దీని నుంచి వెలువడే రేడియేషన్ ఈ ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే మేము అధికారంలో ఉన్న పదేళ్ల పాటు నేవీ రాడార్ ఏర్పాటును అడ్డుకున్నాం’ అని కేటీఆర్ తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూడు వేల ఎకరాల భూమి తీసుకుని.. 12 లక్షల చెట్లు నరికేసి ఇక్కడ ఏర్పాటు చేసే నేవీ రాడార్ స్టేషన్‌తో ఈ ప్రాంతానికి ఒరిగేదేమిటని ప్రశ్నించారు. ఈసీ, మూసీ నదులకు జన్మస్థానమైన ఈ ప్రదేశంలో ఇలాంటి రాడార్ స్టేషన్ ఏర్పాటు తగదని సూచించారు. అలాగైతే కవితపై అసలు కేసే పెట్టేవారు కాదు.. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని అందుకే కవితను అరెస్టు చేయలేదని కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారని, బీజేపీతో తాము జతకలిస్తే అసలు కవితపై కేసే పెట్టి ఉండేవారు కాదని కేటీఆర్ పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తీస్మార్ఖాన్లు.. ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, బండి సంజయ్, రఘునందన్ పోటీ చేసిన చోట కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను నిలబెడితే.. వారిని ఓడించింది బీఆర్ఎస్ కాదా..? అని ప్రశ్నించారు. హామీలపై కాంగ్రెస్‌ను వదిలేది లేదు.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వదిలిపేట్టేది లేదు.. బట్టలు ఊడదీసి చేవెళ్ల గడ్డపైనే నిలబెడుదాం అని కేటీఆర్ అన్నారు. గడిచిన యాభై రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ కావాల్సినంత వ్యతిరేకతను మూటకట్టుకుందని తెలిపారు. మార్పు కావాలనుకున్న ప్రజలే ఇప్పుడు బాధపడుతున్నారని, రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టాలన్న ప్రభుత్వం వచ్చిందని ఆవేదన చెందుతున్నారని చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సాధారణ కార్యకర్త కన్నా అధ్వానంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మన నాయకుడు కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వస్తారని కేటీఆర్ వివరించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే సాక్షి, హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డిపై అకారణంగా నోరు పారేసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెంటనే ఆయనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. సందీప్‌రెడ్డితో కేటీఆర్ సోమవారం సాయంత్రం ఫోన్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలను అడ్డుకుంటామనీ, బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ భరోసానిచ్చారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కోమటిరెడ్డి ప్రతి ఒక్కరిపైన నోరు పారేసుకుంటున్నారని ఆరోపించారు. రైతుబంధు అడిగితే రైతులను చెప్పుతో కొట్టమని తన అహంకారాన్ని బయట పెట్టుకున్న మంత్రి తాజాగా జెడ్పీ చైర్మన్‌పై అదే నోటి దురుసు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తీరును ప్రజలు గమనిస్తున్నారనీ, ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. -
TS: కాంగ్రెస్సోళ్లు ఐదేళ్లుంటరా.. చూస్తాం: కేటీఆర్
సాక్షి, వికారాబాద్: కారు కేవలం సర్వీసింగ్‌కు పోయిందని, మళ్లీ వంద స్పీడుతో దూసుకొస్తదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం వికారాబాద్‌లో జరిగిన పరిగి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. మార్పు కావాలి అనోళ్లంతా నెత్తినోరు కొట్టుకుంటున్నరని చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పిన రెండు లక్షల రుణమాఫీ ఏదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదు...420 హామీలని గుర్తు చేశారు. ‘ఉచిత బస్సు తో మహిళలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఓ గల్లీ కాంగ్రెస్ కార్యకర్త మాట్లడినట్టు ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని బట్టలిప్పి చౌరస్తాలో నిలబెడతాం. బీజేపీ పెద్ద నేతలను ఓడగొట్టింది బీఆర్ఎస్ కాదా బీజేపీ బీఆర్ఎస్కు పొత్తు ఉంటే మా ఆడ బిడ్డపై కేసు ఉంటుండెనా పూడూరులో నేవీ రాడార్ స్టేషన్ వస్తే పర్యావరణం దెబ్బ తింటుందని స్థానికులు చెబుతున్నారు. అది మాకు తెలిసే ఆ ప్రాజెక్టు పదేళ్ళుగా ఆపుతూ వస్తున్నాం. పన్నెండు లక్షల చెట్లు నరికే ప్రయత్నం చేస్తే పర్యావరణ వేత్తలు ఎక్కడపోయిండ్రు. చెట్లు నరికితే వర్షాలు పడతాయా? ప్రజాభిప్రాయ సేకరణ చేయరా..? అవగాహనా సదస్సులు పెట్టరా... ఉన్న అడవి పోతది..పర్యావరణం దెబ్బతింటుంది.. మన ప్రాంతానికి ఏం రాందు రాడార్ స్టేషన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది. యాభై రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. రానున్న రోజుల్లో ఇంకా చాలా చూస్తాం. కాంగగ్రెస్సోళ్లు ఐదేళ్లు ఉంటారా.. మధ్యలో పోతారా చూస్తాం. మూడు అడుగులు లేనోడు బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల లోతులో పెడ్తడంటా.. అందరూ కలిసి కట్టుగా పనిచేయాలే.. పార్లమెంటులో తెలంగాణ గొంతు వినిపించాలె. వరుసగా ఎన్నికలొస్తున్నయ్..అందరూ అప్రమత్తంగా ఉండాలె. కష్టపడి పార్టీ గెలుపునకు కృషి చేయాలె 12 మంది ఎంపీలు గెలిస్తే జాతీయ పార్టీలకు వణుకు పుడుతది. శ్రీ రాముని పేరిట అక్షింతలు పంచి సెంటిమెంట్ రగిలించి ఓట్లు వేయించుకునే ప్రయత్నం బీజేపీది. పప్పు, ఉప్పు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన మోదీని దేవుడు అంటడు బండి సంజయ్. పార్లమెంట్ ఎన్నకల కోసం సిద్దం కావాలె.. చేవెళ్ల ఎంపీగా రంజిత్ రెడ్డిని గెలిపించుకోవాలె’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇదీ చదవండి.. కేటీఆర్‌కు కోదండరాం కౌంటర్ -
కేటీఆర్‌కు కోదండరాం కౌంటర్
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి తారకరామారావుకు ప్రొఫెసర్ కోదండరాం కౌంటర్ ఇచ్చారు. తనకు ఎమ్మెల్సీ దక్కడంపై కేటీఆర్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై కోదండరాం తాజాగా మరోసారి స్పందించారు. ప్రజలకు అన్నీ తెలుసని.. తన ఎంపికపై అనవసరంగా వివాదం చేయడం సరికాదని అన్నారాయన. ‘‘రాజ్యాంగంలో షరతులు అర్థమైతే చర్చ ఉండదు. జాగ్రత్తగా రాజ్యాంగం చదివితే వివాదం ఉండదు. రాజ్యాంగ పరంగా సేవ చేసిన వాళ్లకు అవకాశం ఇస్తారు. నేను సుదీర్ఘకాలం సేవ చేశా. అనవసరంగా నా ఎంపికను వివాదం చేయడం తగదు. ప్రజలకు అన్నీ తెలుసు వారే అంచనా వేసుకుంటారు’’ అని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ శ్రవణ్ కరెక్ట్ కాదా? కానీ ప్రొఫెసర్ కోదండరాం కరెక్టా? అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీసిన సంగతి తెలిసిందే. ఎదురుచూపులు.. ఇదిలా ఉంటే.. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అమెర్ అలీఖాన్ ఇవాళ ప్రమాణం చేయాలనుకున్నారు. అయితే శాసన మండలికి వెళ్లిన వాళ్లకు నిరాశ ఎదురైంది. రెండు గంటలపాటు కౌన్సిల్ హాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోసం వాళ్లు ఎదురు చూశారు. అయితే అయినప్పటికీ ఆయన రాలేదు. దీంతో బీఆర్ఎస్ నేతల ఒత్తిడి వల్లే గుత్తా రావడం లేదని కాంగ్రెస్ నేతలు చర్చించుకున్నారు. కాసేపయ్యాక.. రేపు మండలి చైర్మన్ అందుబాటులో ఉంటారనే సమాచారం వాళ్లకు అందడంతో వెనుదిరిగారు. రేపు ఉదయం 9గం.30 ని. ఈ ఇద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయనున్నారు. అందుకే రాలేకపోయా తన గైర్హాజరుపై వస్తున్న విమర్శలపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ స్పందించారు. ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లే తాను ఏ కార్యక్రమానికి హాజరు కావడం లేదని వెల్లడించారాయన. మండలి స్పీకర్ పదవిని తాను సక్రమంగా నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు. -
కేటీఆర్ తన భాష మార్చుకోవాలి: కోమటిరెడ్డి
యాదాద్రి భువనగిరి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోడని ఎలా అంటావంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లడుతూ.. కాలి గోటికి సరిపోనివాడే మిమ్మల్ని( కేసీఆర్) ఫామ్ హౌలో పెట్టాడా అని విమర్శించారు. కేటీఆర్ తన భాష మార్చుకోవాలని హితవు పలికారు. కాలిగోటికి సరిపోని రేవంత్ రెడ్డే మిమ్మల్ని తొక్కితే ఒక్కొక్కరు 50-60 వేల ఓట్లతో ఓడిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేసేదే చెప్తది మీలాగా పూటకో మాట చెప్పదని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ నుంచి ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్సీగా గెలిచి అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి అయ్యాడని తెలిపారు.కేసీఆర్ యాదాద్రి నుంచి తన ఫామ్ హౌస్‌కు పోతుంటే వాసాలమర్రిలో శ్మశానాలు అడ్డంగా ఉన్నావని గ్రామాన్ని దత్త తీసుకొని వదిలేశాడని మండిపడ్డారు. చదవండి: 24 మంది ఎమ్మెల్యేల ఎన్నికపై పిటిషన్లు.. కేటీఆర్, హరీశ్ విజయంపై కూడా -
బీజేపీ, కాంగ్రెస్ ఒకటేనంటూ దుష్ప్రచారం
సాక్షి, హైదరాబాద్: అధికారం కోల్పోవడంతో మతిభ్రమించిన మాజీ మంత్రి కేటీఆర్... బీజేపీ, కాంగ్రెస్ ఒకటేనంటూ దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ మండిపడ్డారు. ఓటమి కుంగుబాటులో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, అహంకారం కారణంగా ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించారే తప్ప, అది కాంగ్రెస్ విజయం కాదన్నారు. ఎన్నికల్లో ఉచితాలు, గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ధ్వజమె త్తారు. రైతుబంధు ఇవ్వకుండా రైతులను, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఆదివారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి జనసేనతో పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేసి పది సీట్లు సాధిస్తామనే ధీమా వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ జరిపించి, అవినీతి సొమ్మును కక్కించి ప్రజలకు పంచుతామన్న కాంగ్రెస్ నాయకుల గొంతులు మూగబోయాయని విమర్శించారు. అవినీతి ఆరోపణలున్న అధికారుల తోనే కాంగ్రెస్ మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. బీఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీలు రెండూ తోడుదొంగల వంటివని పేర్కొన్నారు. రాష్ట్రంలో కులగణన చేపట్టాలని కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతి స్తున్నామని లక్ష్మణ్ తెలిపారు. -
రేవంత్‌రెడ్డికి సీఎం పదవి.. కేసీఆర్ భిక్షే
మెదక్: రేవంత్‌రెడ్డి అనుభవిస్తున్న సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్షేనని, ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష చేసి, చావునోట్లో తలపెట్టి తెలంగాణ తేవటంతోనే ఇవాళ రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 420 అబద్ధపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందన్నారు. వాటిని నెరవేర్చకుంటే మెడలు వంచుతామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై గ్రామీణ ప్రాంతాల్లో, సోషల్ మీడియాలో సైతం విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను నెరవేరుస్తామన్నా రని, ఇప్పటికే 60 రోజులు గడిచాయని గుర్తు చేశారు. దళితుల అభివృద్ధి కోసం బ్యాంకుల్లో దళితబంధు పథకం డబ్బులు వేస్తే, వాటిని ఫ్రీజింగ్లో పెట్టారన్నారు. రైతుబంధు డబ్బులను నేటికీ అన్నదాతలకు జమ చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని తెలిపారు. అలాగే డీడీలు కట్టిన గొల్లకురుమలు గొర్రెల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల రైతురుణ మాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పటికీ అమలు చేయలేక పోయారని మండిపడ్డారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 1.52 కోట్ల మంది ఉన్నారని, వారికి రూ. 2,500 చొప్పున ఎప్పుడు వేస్తున్నారో చెప్పాలని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజలు తిరగబడతారన్నారు. బడ్జెట్ లేదని తెలిసి కూడా అధికారం చేజిక్కించుకునేందుకు నోటికొచ్చిన హామీలన్ని ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.4 వేల పింఛన్‌ను ఎప్పటి నుంచి ఇస్తారో తెలపాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. వ్యవసాయానికి కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో 24 గంటలు వ్యవసాయానికి కరెంటిస్తే.. ప్రస్తుతం 14–16 గంటలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. పదవులు వస్తే బాధ్యత పెరగాలే తప్ప, ప్రతిపక్షాలను కించపరిచేలా మాట్లాడొద్దని ఒక మంత్రికి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు బీసీ కుల గణన చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లలో అంతర్భాగంగా ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా కల్పించాలని, కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ దతియా జిల్లా కేంద్రం నుంచి ఓబీసీ హక్కుల ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్ సింగ్ యాదవ్ తలపెట్టిన ‘పీడిత్ అధికార్ యాత్ర’ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓబీసీల అనైక్యతను ఆసరాగా చేసుకుని ప్రభుత్వాలు వారికి దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఓబీసీలకు న్యాయం చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు ఓబీసీలకు న్యాయం చేయని కాంగ్రెస్ ఇప్పుడు ఓబీసీ న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉండటాన్ని ప్రశ్నిస్తోందని కవిత ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో ఓబీసీల సంఖ్య తక్కువగా ఉండటాన్ని ప్రశ్నించారు. దామోదర్ సింగ్ యాదవ్ ప్రారంభించిన పీడిత్ అధికార్ యాత్ర దేశవ్యాప్తంగా విస్తరిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలు అందరికీ స్పూర్తిదాయకమని, కేసీఆర్ స్పూర్తితో ఓబీసీ హక్కుల సాధన ఉద్యమం ముందుకుసాగాలని కవిత పిలుపునిచ్చారు. కేసీఆర్ స్పూర్తితోనే ఉద్యమాన్ని మొదలు పెట్టినట్లు ఓబీసీ ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్ యాదవ్ తెలిపారు. -
బీఆర్ఎస్లో ‘భేటీ’ల కలకలం!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు వరుసగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశం అవుతుండటం కల కలం రేపుతోంది. కాంగ్రెస్ స్వల్ప మెజారిటీతో అధికారం చేపట్టిన నేపథ్యంలో విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రయత్నం చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఈనెల 24న ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి మాణిక్‌రావు తదిత రులు సీఎం రేవంత్‌ను కలిశారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా రెండు రోజుల కింద సీఎంతో భేటీ అయ్యారు. తాజాగా ప్రకాశ్‌గౌడ్ కూడా కలిశారు. గతంలో టీడీపీ నుంచి వెళ్లిన నేపథ్యంలో.. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఆయన సన్నిహి తుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తదితరులు గతంలో టీడీపీలో పనిచేసినవారే కావడంతో ఈ భేటీలకు ప్రాధా న్యత ఏర్పడింది. గతంలో టీడీపీలో పనిచేసి ప్రస్తుతం బీఆర్ఎస్, ఇతర పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలతో రేవంత్‌రెడ్డి సన్నిహితులు మంతనాలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతాయనే అంచనాల నేపథ్యంలో.. ఆలోగా చేరికల వ్యూహాన్ని అమలు చేయాలని రేవంత్ భావిస్తున్నట్టు చెప్తున్నారు. ఈ పరిణామాలతో అప్రమత్తమైన బీఆర్ఎస్ పెద్దలు.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఇతర కీలక నేతల కదలికలపై కన్నేసినట్టు సమాచారం. -
కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై దాడి చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫామ్‌హౌస్‌పై దాడి చేస్తామని కాంగ్రెస్ మాజీఎంపీ మధుయాíష్కీగౌడ్ అన్నారు. కేసీఆర్ ఫాంహౌస్‌పై దాడి చేస్తే వందల కోట్ల రూపాయలు బయటపడతాయని, అక్కడ ఆయన నోట్ల కట్టలపైనే పడుకుంటారని, అక్కడి ఏ గోడను తొలిచినా నోట్ల కట్టలు, వజ్ర వైఢూర్యాలు బయటకొస్తాయని ఆరోపించారు. దానిపై ఏ వి«ధంగా దాడి చేయాలనే విషయమై తమ ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆదివారం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి బాధ్యతలు తీసుకున్న అనంతరం మధుయాష్కి మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే వీరి అవినీతి బయటకు వస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క అవినీతి అధికారినీ, కల్వకుంట్ల కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ప్రభుత్వం వదిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య తెరవెనుక ఉన్న వ్యాపారం, అవినీతి బంధాన్ని బయటకు తీయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, హైదరాబాద్ చుట్టూవున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మాజీమంత్రి కేటీఆర్ కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకుని అమెరికా, దుబాయ్‌లో పెట్టారని ఆరోపించారు. కల్ల»ొల్లి మాటలు, అహంకారంతో మాట్లాడుతున్న కేటీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. రాష్ట్రంలో కనీసం 14 సీట్లలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నదని తెలిపారు. -
సీఎం రేవంత్‌తో ప్రకాశ్‌గౌడ్ భేటీ
సాక్షి, హైదరాబాద్/మణికొండ: బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఆదివారం ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కలిశారు. జూబ్లీహి ల్స్లోని సీఎం నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. రేవంత్ సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. దీనితో ప్రకాశ్‌గౌడ్ బీఆర్ఎస్ను వీడి, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. దీనిని ప్రకాశ్‌గౌడ్ ఖండించారు. మర్యాదపూర్వకంగానే కలిశా: ప్రకాశ్‌గౌడ్ తాను మర్యాదపూర్వకంగానే సీఎం రేవంత్‌తో భేటీ అయ్యానని ప్రకాశ్‌గౌడ్ పేర్కొన్నారు. తాను ప్రాతి నిధ్యం వహిస్తున్న రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ, బహ దూర్‌గూడ, ఘాన్సిమియాగూడ గ్రామాల్లో భూసంబంధ సమస్యల పరిష్కారం కోసమే సీఎంను కలి శానని ఓ ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గ అభి వృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని తాను కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. -
కేసీఆర్ కాలిగోటికి కూడా రేవంత్ సరిపోడు
సిరిసిల్ల: ‘‘మూడు ఫీట్లు లేనోడు కూడా కేసీఆర్‌ను వంద మీటర్ల లోతుకు తొక్కుతాడట.. ఈ బుడ్డర ఖాన్‌తో ఏమీ కాదు’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు సీఎం ఎ.రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణభవ న్లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కాలిగోటికి కూడా రేవంత్‌రెడ్డి సరిపోడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ మేనేజ్మెంట్ కోటాలో సీఎం సీటును కొన్నాడని ఎద్దేవా చేశారు. అలవికాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం 420 హామీలు ఇచ్చిందని వాటిని అమలు చేయడం చేతకాక కేసీఆర్ అప్పులు చేశారంటూ తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో 1.8 శాతం స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యామనీ, పోయింది అధికారమేననీ.. పోరాట పటిమ కాదన్నారు. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదనే మాజీ సీఎం కేసీఆర్ మాటలను కాంగ్రెస్ సర్కారు నిజం చేస్తోందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కారుకు ఇది ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, మళ్లీ వంద కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సగం సీట్లు గెలిచినా హంగ్ వచ్చేది ఎన్నికల్లో 14 చోట్ల కేవలం ఐదువేల ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓడిపోయిందని, అందులో సగం సీట్లు గెలిచినా.. హంగ్ సర్కారు వచ్చేదని కేటీఆర్ విశ్లేషించారు. మార్పు కావాలే అన్నోళ్లు ఇప్పుడు నెత్తినోరు కొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సచివాల యంలో లంకెబిందెలు ఉన్నాయని వస్తే.. ఉత్తబిందెలు కూడా లేవని రేవంత్‌రెడ్డి మాట్లాడడం విడ్డూ రంగా ఉందన్నారు. మంత్రిగా చేసిన అనుభవం లేనోడు ముఖ్యమంత్రి అయితే గిట్లనే ఉంటదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలను వేర్వేరుగా పెట్టడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే నని తేలిపోయిందన్నారు. ధర్మం కోసం పని చేస్తే మఠం పెట్టుకోండి ఐదేళ్లలో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ చేసింది ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ అడిగితే ఇవ్వలేదని, నవోదయ పాఠశాలలు తేలేదని నిందించారు. ధర్మం కోసం పనిచేస్తే.. రాజకీయాలు మానేసి మఠం పెట్టుకోవాలని హితవు పలికారు. మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ అరుణ, టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ రణభేరి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే టీపీసీసీ చీఫ్‌గా వచ్చే పార్లమెంటు ఎన్నికలకు రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ఒకవైపు ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల అమలుకు కృషి చేస్తూనే, మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో 12 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. వారంలో మూడు రోజుల పాటు పార్టీ కోసం సమయం కేటాయిస్తానని చెప్పిన రేవంత్.. ఫిబ్రవరి 2న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభతో ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నాలుగు అసెంబ్లీ సీట్లను సాధించినప్పటికీ, లోక్‌సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క ఖానాపూర్‌లోనే విజయం సాధించింది. మిగతా ఆరింటిలో నాలుగు చోట్ల బీజేపీ విజయం సాధించింది. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూరులలో బీజేపీ గెలుపొందగా, బీఆర్ఎస్ బోథ్, ఆసిఫాబాద్‌లలో విజయం సాధించింది. కాగా ఖానాపూర్‌లో వెడ్మ బొజ్జు అనూహ్య విజయాన్ని రేవంత్ అన్ని సభల్లో చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచే పార్లమెంటు ఎన్నికల రణభేరి మోగించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రి సీతక్కతో హైదరాబాద్‌లో ఆయన సమావేశం కానున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను ఈ భేటీకి ఆహ్వానించారు. ఇంద్రవెల్లి సభ తర్వాత కూడా లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహించడం ద్వారా పార్టీ యంత్రాంగాన్ని చురుగ్గా ఉంచాలని సీఎం నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి, చివరలో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ జరపాలని కూడా భావిస్తున్నట్లు తెలిసింది. ఓటర్లను ఆకర్షించేలా మరో రెండు పథకాలు! ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే అమలవుతున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి మంచి స్పందన లభించిందని కాంగ్రెస్ భావిస్తోంది. రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిమితి పెంపును కూడా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే క్రమంలో పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్ల దృష్టిని ఆకర్షించేలా మరో రెండు గ్యారంటీల అమలుకు మార్గదర్శకాలను సిద్ధం చేయాలని ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. అందులో ఒకటి రూ.500కే గ్యాస్ సిలిండర్ కాగా, మరొకటి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. అయితే సబ్సిడీపై సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే అధికారులు ఓ రోడ్‌మ్యాప్ తయారు చేసినట్లు సమాచారం. కాగా రూ.500కే సిలిండర్‌ను నేరుగా తెచ్చినప్పుడే ఇచ్చే విధంగా విధి విధానాలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. దీనివల్ల రూ.500కే గ్యాస్ వచ్చిన భావన మహిళలకు కలుగుతుందని, ఇది ఎన్నికల్లో ఉపకరిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి ఇప్పటికే ఇది అమలవుతున్న కర్ణాటకలో అధికారులు పరిశీలించినట్లు తెలిసింది. -
మీరు తిడితే.. మేము పడుతుంటామా?: రేవంత్‌పై కడియం ఫైర్
సాక్షి, జనగామ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటికి హద్దు, అదుపు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, సీనియర్ నేత కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కడియం శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సీఎంకు ఉండవలసిన హుందాతనం రేవంత్‌రెడ్డిలో లోపిస్తుందని ఎద్దేవా చేశారు. మీరు తిడుతుంటే.. మేము పడుతూ ఉంటామా? అని మండిపడ్డారు. తమకు కూడా చీము, నెత్తురు ఉన్నది.. తాము కూడా ఎదో ఒక భాషలో తిట్టేలాగా? చేస్తున్నారని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ను చార్లెస్ శోభరాజ్, కేటీఆర్, హరీష్ రావులను బిల్లా-రంగా అని విమర్శించడం విడ్డూరమని అన్నారు. చార్లెస్ శోభరాజ్, బిల్లా- రంగా కంటే పెద్ద చరిత్ర రేవంత్ రెడ్డిది అని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి చరిత్ర తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. బీఆర్ఎస్ను బోందపెట్టేవాడు.. ముక్కలు చేసేవాడు ఇంకా పుట్టలేదని అన్నారు. బీఆర్ఎస్ను పాతిపెట్టడం ఎవరితో కాదు.. నీ అయ్యతో కూడా కాదని తీవ్రంగా విమర్శించారు. చదవండి: సీఎం రేవంత్‌తో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ.. ఏం జరుగుతోంది? -
సీఎం రేవంత్‌తో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ.. ఏం జరుగుతోంది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయంగా రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రంలో పొలిటికల్ సమీకరణాలు మారుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. దీంతో, రాజకీయంగా చర్చ మొదలైంది. కాగా, తాజాగా రంగారెడ్డి జిల్లా పాలిటిక్స్ హాట్ టాపిక్‌గా మారాయి. నేడు సీఎం రేవంత్ రెడ్డిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిశారు. ఈ క్రమంలో ప్రకాష్ గౌడ్‌కు కాంగ్రెస్ కండువా కప్పి ప్రభుత్వ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఆహ్వానించారు. ఇక, సీఎం రేవంత్‌తో ప్రకాష్ దాదాపు గంట పాటు చర్చించారు. దీంతో, రాష్ట్రంలో రాజకీయం మరోసారి హీటెక్కింది. ఇదిలా ఉండగా.. శనివారం కూడా సీఎం రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కలిశారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్‌తో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక, ఇటీవలే మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రేవంత్‌ను కలిశారు. వీరి భేటీపై పెద్ద చర్చ జరగడంతో నలుగురు ఎమ్మెల్యేలు ప్రెస్‌మీట్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కేవలం అభివృద్ధిపై చర్చించేందుకే సీఎం రేవంత్‌ను కలిసినట్టు క్లారిటీ ఇచ్చారు. అయితే, బీఆర్ఎస్ నేతలు వరుస పెట్టి సీఎం రేవంత్‌ను కలుస్తున్న నేపథ్యంలో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల నాటికి రాష్ట్రంలో మరిన్ని వలసలు ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అనేక మంది విపక్ష ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు బీఆర్ఎస్ను టెన్షన్ పెడుతున్నట్టు సమాచారం. -
కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణ చేపడతాం: మధుయాష్కీ
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. త్వరలోనే కేసీఆర్ ఫామ్ హౌస్‌పై విచారణ చేసి అవినీతిని వెలికితీస్తామని హెచ్చరిక చేశారు. దీంతో, తెలంగాణలో రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. కాగా, మధు యాష్కీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీఆర్ఎస్ నేతలు గుంట నక్కలా వేచి చూస్తున్నారు. కానీ, మా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు. అనేక మంది విపక్ష ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. నేను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. పార్టీ గెలుపు కోసం పనిచేస్తాను. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష పదవి ప్రస్తుతం ఖాళీగా లేదు. అధిష్టానం బాధ్యతలు ఇస్తే నిర్వహిస్తాను’ అని స్పష్టం చేశారు. -
TS: ఖమ్మంలో బీఆర్ఎస్ ‘ఉనికి’ పాట్లు !
సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ పార్టీకి గుదిబండగా మారిందా? గడచిన మూడు ఎన్నికల్లోనూ ఒక్కో సీటు మాత్రమే ఇక్కడ గెలవడానికి కారణం ఏంటి? జిల్లా ప్రజల్ని, నాయకుల్ని అంచనా వేయడంలో గులాబీ బాస్ ఫెయిల్ అయ్యారా? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ను సమూలంగా ప్రక్షాళన చేయడం సాధ్యమేనా? జిల్లాలో కొత్త నాయకత్వం తయారవుతుందా? పార్టీకి వైభవం వస్తుందా? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రమే అని రాజకీయాలు తెలిసిన ఎవరైనా చెబుతారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈ జిల్లాలో వచ్చే ఫలితాలు గులాబీ పార్టీని నిరాశకు గురిచేస్తున్నాయి. జిల్లాలో పది అసెంబ్లీ సీట్లు ఉంటే...ప్రతిసారి ఒక్క సీటు మాత్రమే గులాబీ పార్టీకి దక్కుతోంది. దీంతో ఇతర పార్టీల తరపున గెలిచినవారిని చేర్చుకుని బలపడ్డామని గులాబీ పార్టీ నాయకత్వం ఇప్పటివరకు భావిస్తూ వచ్చింది. అయితే ఈసారి పరిస్థితి రివర్స్ అయింది. రాష్ట్రంలో అధికారం కూడా పోయింది. బీఆర్ఎస్లో బలమైన నేతలు కొందరు వెళ్లి కాంగ్రెస్‌లో చేరిపోవడంతో పార్టీ జిల్లాలో మరింత బలహీనంగా మారింది. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలో ఒక్కో సీటే వచ్చినా రాష్ట్రంలో అధికారం బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. సింగిల్ సీటు రావడం..అదొక సెంటిమెంట్ అనుకున్నారు గులాబీ నేతలు. ఈసారి ఆ సెంటిమెంట్ పనిచేయలేదు. తాజా పరిణామాలతో ఈ జిల్లాలో బీఆర్ఎస్ని పూర్తిస్తాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటున్నారు ఆ పార్టీ పెద్దలు. ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా తయారైంది. ప్రస్తుతం జిల్లాకు చెందినవారే రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలం పెంచుకోవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో పార్టీని, నాయకత్వాన్ని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్ ఖమ్మంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని అక్కడి నేతలు చెబుతున్నారు. ఇలానే వదిలిస్తే జిల్లాలో గులాబీ పార్టీ మరింత వీక్ అవ్వడం ఖాయం అంటున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ పార్టీకి కొరుకుడు పడటంలేదనే చెప్పాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చినా పరిస్థితిలో ఏమాత్రం మార్పురాలేదు. అందుకే కేసీఆర్, కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి కష్టపడితేనే జిల్లాలో బీఆర్ఎస్ ఉనికి చాటుకోగలదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి పార్లమెంట్ ఎన్నికల నాటికి పార్టీ గాడిన పెడతారో లేదో కాలమే నిర్ణయిస్తుంది. ఇదీచదవండి.. క్యాబినెట్ విస్తరణకు మహూర్తం ఫిక్స్..! -
TS: క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందా? విస్తరణ ఇప్పటికే ఆలస్యం అయిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా? మంత్రివర్గంలో కొత్తగా ఎవరికి పదవులు ఇవ్వాలో కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేసేసిందా? ఇంతకీ ఎవరెవరికి రేవంత్ క్యాబినెట్లో బెర్త్‌లు కన్ఫాం అయ్యాయి? పదవుల కోసం పైరవీలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి? అతి త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకునేలా, ఈ నెలాఖరులోగా క్యాబినెట్ విస్తరణ జరగబోతోంది. ఇప్పటికే సామాజిక సమీకరణాలపై కసరత్తు చేసిన కాంగ్రెస్ అదిష్టానం సీఎం రేవంత్‌రెడ్డితో మరోసారి చర్చించి నిర్ణయం తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత క్యాబినెట్ లో నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. విస్తరణలో ఆ నాలుగు జిల్లాలకు కచ్చితంగా చోటు కల్పించాల్సి ఉంటుంది. ప్రస్తుత క్యాబినెట్ లో రెడ్డి సామాజిక వర్గం నుంచి నలుగురు, బీసీ, ఎస్సీ సామాజికవర్గాల నుంచి ఇద్దరు చొప్పున, ఎస్టీ, కమ్మ, వెలమ సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు క్యాబినెట్ విస్తరణలో ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్‌రావు బెర్త్ ఆశిస్తున్నారు. ఇప్పటికే మాల సామాజిక వర్గం నుంచి భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం, గడ్డం ప్రసాద్ కు స్పీకర్ పదవి వచ్చారు. అందువల్ల మాల కమ్యూనిటీకే చెందిన వివేక్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించడం పట్ల కాంగ్రెస్ నేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వెలమ వర్గానికి చెందిన ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి ఆశిస్తున్నా.. ఆయనకు పోటీగా ఉమ్మడి నిజామాబాద్ నుంచి మదన్ మోహన్ రావు కూడా పోటీ పడుతున్నారు. అయితే ఇప్పటికే వెలమ సామాజిక వర్గం నుంచి జూపల్లి కృష్ణారావుకు మంత్రి వర్గంలో చోటు కల్పించడంతో ఈ ఇద్దరిలో ఒకరికైనా అవకాశం ఇస్తారో లేదో చూడాలి. ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి రేసులో ఉండగా..ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే రేవంత్‌రెడ్డి క్యాబినెట్లో ఇప్పటికే సీఎంతో కలుపుకుని నలుగురు రెడ్డి వర్గం మంత్రులున్నారు. రెడ్డి వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇస్తారని భావిస్తున్నా..సుదర్శన్‌రెడ్డి.. మల్‌రెడ్డిలో ఎవరికి ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత క్యాబినెట్లో బీసీ సామాజికవర్గాల్లో మున్నూరు కాపు, గౌడ్లకు ప్రాతినిధ్యం కల్పించారు. అందువల్ల ఇతర బీసీ వర్గాల్లో ప్రాబల్యం ఉన్న మరో కులానికి చెందిన నేతకు విస్తరణలో మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆరుగురు బీసీ ఎమ్మెల్యేల్లో ఇద్దరు మంత్రులు, ఇద్దరు విప్‌లుగా పదవులు పొందారు. మరో ఇద్దరు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్.. రజకవర్గానికి చెందిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ల్లో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఆదివాసీల నుంచి సీతక్కకు ఇప్పటికే మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. విస్తరణలో ఎస్టీ లంబాడ నుంచి ఒకరికి అవకాశం దక్కబోతోంది. అందులో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కు ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఒక మైనారిటీకి కచ్చితంగా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. కానీ ప్రస్తుతం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గాని ఎమ్మెల్సీగా గాని ఒక్క మైనారిటీ నేత కూడా లేరు. దీంతో పలువురు మైనారిటీ నేతల పేర్లను కాంగ్రెస్ అదిష్టానం పరిశీలిస్తోంది. దీనికి తోడు గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు లేరు. ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరినైనా ఆకర్షించి మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక మాదిగ సామాజిక వర్గ నేతలు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. మాదిగ వర్గం నేతకు పదవి ఇవ్వడం ద్వారా ఎస్సీ వర్గీకరణతో మాదిగ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీని కౌంటర్ చేయొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా తన క్యాబినెట్లో సామాజిక న్యాయం పాటించేలా క్యాబినెట్ విస్తరణ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ఆలోచన ఎంత మేరకు అమలవుతుందో చూడాలి. ఇదీచదవండి.. పార్లమెంట్ సన్నాహాలతో బీఆర్ఎస్ శ్రేణుల చైతన్యం -
‘పార్లమెంట్’ సన్నాహాలతో..బీఆర్ఎస్ శ్రేణుల్లో చైతన్యం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ శ్రేణులు విచిత్ర పరిస్థితుల్లో ఉన్నాయి. గ్రేటర్‌లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 16 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులే గెలిచినా, అంతటా ఉన్నది తమ ఎమ్మెల్యేలే అయినా రాజకీయంగా ఊపు లేక ఉనికిపైనే అనుమానాలు నెలకొనే పరిస్థితులేర్పడ్డాయి. అందుకు కారణం నగరంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారీ మెజారీ్టలతో గెలిచినప్పటికీ పార్టీ అధికారంలోకి రాకపోవడమే. పార్టీ అధికారంలోకి వస్తే తమకు నామినేటెడ్ పోస్టులు దక్కగలవని ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూసిన వారు డీలా పడ్డారు. గ్రేటర్ నగరంలో ఎమ్మెల్యేలతో పాటు దాదాపు 60 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ వారే అయినా పార్టీ శ్రేణుల్లో గెలుపు ఉత్సాహమే కనిపించలేదు. మరోవైపు ఎంతమంది కార్పొరేటర్లు ఇతర పారీ్టల్లోకి వెళ్తారోననే చర్చలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక చర్యల్లో భాగంగా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. జిల్లాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ చాలా ప్రాంతాల్లో స్వల్ప మెజారిటీతో మాత్రమే గెలిచిందని, గ్రేటర్లో గెలిచిన మన ఎమ్మెల్యేలు భారీ మెజారీ్టతో గెలిచారంటూ వారికంటే మన బలమే ఎక్కువన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో మన పార్టీ అభ్యరి్థని భారీ మెజారీ్టతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అలా జరిగితేనే మనమంటే కాంగ్రెస్‌కు భయం ఉంటుందని, మన బలం తగ్గలేదని తెలుస్తుందని అన్నారు. మనకు అధికారం లేకపోవడం తాత్కాలిక బ్రేక్ మాత్రమేనని, ప్రజాభిమానం మనకే మెండుగా ఉందని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో కార్యకర్తల్లో కొంత ఊపు కనిపించింది. జీహెచ్ఎంసీలో ఏం జరగనుంది? ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీలో పరిస్థితులు ఎలా మారనున్నాయో అంతుపట్టడం లేదు. పోటీ చేసినప్పుడు అధికార పార్టీ అభ్యర్థులుగా గెలిచారు. ఇప్పుడు బీఆర్ఎస్ రాష్ట్రంలో ప్రతిపక్షంగా మారింది. మూడు నెలలకోమారు జరగాల్సిన సర్వసభ్య సమావేశాలు ఆగస్టు తర్వాత ఇంతవరకు తిరిగి జరగలేదు. అంతేకాదు, పదవీకాలం ముగిసిపోయిన స్టాండింగ్ కమిటీకి సైతం కొత్త కమిటీ ఎన్నిక కాలేదు. కొత్త ఆరి్థక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ తొలుత స్టాండింగ్ కమిటీ సమావేశంలో, తర్వాత సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొందాక ప్రభుత్వానికి పంపించాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఏ సమావేశమూ జరగలేదు. సంప్రదాయానికి భిన్నంగా జీహెచ్ఎంసీ పాలకమండలి ఆమోదం పొందకుండానే అధికారులే నేరుగా ప్రభుత్వానికి పంపిస్తారా ?అనే అనుమానాలు సైతం నెలకొన్నాయి. ఏం చేయనున్నారనేదానిపై అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. మొత్తానికి ప్రభుత్వమార్పుతో జీహెచ్ఎంసీలోనూ విచిత్ర పరిస్థితులేర్పడ్డాయి. -
అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు
సిద్దిపేటజోన్: అనేక అబద్ధాలు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సిద్దిపేట బీఆర్ ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు అన్నారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే నాయకులు సహనం కోల్పోయి దుర్భాషలాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. శనివారం ఆయన సిద్దిపేటలో నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణుల కృతజ్ఞత సభలో మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్న వారు ఓపిక, సహనంతో ఉండాలని, ప్రజలు, ప్రతిపక్షాలు అడిగే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల గురించి ప్రశ్నిస్తే కాంగ్రెస్ పాలకులు సహనం కోల్పో తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో నిరుద్యోగ భృతి గురించి అడిగితే తాము ఆ మాట చెప్పలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బదులు ఇవ్వడం విడ్డురంగా ఉందన్నారు. ఒకప్పుడు దావోస్ పర్యటన దండగ అన్న కాంగ్రెస్.. ఇప్పుడు సీఎం, మరో మంత్రి పోటీలుపడి వెళితే ఏం సమాధానం చెపుతుందని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని గతంలో కాంగ్రెస్ నాయకులు తమపై ఆరోపణలు చేశారని, మరి ఇటీవల రంగనాయక సాగర్ ద్వారా నీటిని విడుదల చేసిన మంత్రి కొండా సురేఖ.. లక్షా 10 వేల ఎకరాలకు నీరు ఇస్తున్నట్టు ప్రకటించారని, దీనికి కాంగ్రెస్ నాయకులు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా కేవలం 14 నుంచి 16 గంటలు మాత్రమే ఉంటోందని హరీశ్‌రావు విమర్శించారు. తప్పించుకునేందుకు కుట్ర.. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు హామీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుకునే ప్రయత్నంలో ఉందని హరీశ్‌రావు విమర్శించారు. ‘లంకె బిందెలు దొరకలేదు, ఖజానా ఖాళీ అయింది’అనే సాకులతో వాయిదాల పేరిట ఆరు గ్యారంటీల నుంచి తప్పించుకునేందుకు పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలలోపు ఒకటో రెండో అమలు చేసి తర్వాత చేతులు ఎత్తేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఈ నెలలో రైతుబంధు డబ్బులు, చేయూత ద్వారా రూ 4 వేల పింఛన్, మహిళలకు 2,500 చొప్పున డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను, సీఎం రేవంత్, మంత్రుల వ్యాఖ్యలను క్లిప్పింగ్స్ రూపంలో ఆయన భారీ స్క్రీన్ ద్వారా పార్టీ శ్రేణులకు వివరించారు. -
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులు
వెంగళరావునగర్, సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను బరిలోకి దించనున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు ఆరోపించారు. బీజేపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పరోక్షంగా పని చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే అది బీజేపీకి వేసినట్టేనన్నారు. యూసుఫ్‌గూడలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలది విడదీయలేని ఫెవికాల్ బంధమని ధ్వజమెత్తారు. రాహుల్ భారత్ జోడో యాత్ర అని తిరుగుతుంటే కాంగ్రెస్ మిత్రపక్షాలు మాత్రం రాహుల్ చోడో అని వదిలి పోతున్నాయని, చివరకు ఆ కూటమిలో మిగిలేది రాహుల్ ఒక్కడేనని ఎద్దేవా చేశారు. దేశంలోనే అట్టర్ ఫ్లాప్ మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని, కనీసంగా కూడా ఏమీ చేయని ఆయనకు ఈసారి ఓటు అడిగే నైతిక హక్కు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలోనే అట్టర్ ఫ్లాప్ కేంద్రమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కిషన్‌రెడ్డి మాత్రమేనన్నారు. నగరంలో అతి పెద్ద గుడి కట్టింది పీజేఆర్ కుటుంబమని, అయినప్పటికీ ఆయన కుమారుడు ఏనాడూ ఓట్ల కోసం దానిని వాడుకోలేదని, కానీ బీజేపీ దేవుడి పేరు చెప్పి డ్రామాలు చేస్తోందని విమర్శించారు. మైనారిటీలపై కాంగ్రెస్ పగబట్టింది ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగిన సీఎం రేవంత్‌రెడ్డి మైనారిటీలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినందునే మైనారిటీలపై కాంగ్రెస్ పగబట్టిందని, రాష్ట్ర కేబినెట్లో మైనారిటీలకు స్థానం కల్పించకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. తెలంగాణ భవన్లో శనివారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగం సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. రేవంత్ మంత్రివర్గంలో మైనారిటీలకు ప్రాతినిథ్యం లేదని, 1953 తర్వాత కేబినెట్లో మైనారిటీలకు చోటు లేకపోవడం ఇదే తొలిసారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలుగా మైనారిటీలు ఎవరూ లేరనే సాకుతో కాంగ్రెస్ తప్పించుకోలేదని, మంత్రివర్గంలో చోటు కల్పించి ఆ తర్వాత శాసనమండలికి ఎన్నికయ్యేలా చూసుకునే అవకాశముందన్నారు. మైనారిటీ సెంటిమెంటును రెచ్చగొట్టేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో షబ్బీర్ అలీ పేరును వాడుకున్న రేవంత్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సలహదారు పదవితో సరిపెట్టారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ఈనెల 22న నల్లగొండ, సంగారెడ్డి తది తర ప్రాంతాల్లో చోటు చేసుకున్న మత ఘర్షణలకు హోం శాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్ బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆటోలో బీఆర్ఎస్ భవన్‌కు కేటీఆర్ యూసుఫ్‌గూడలోని ఫంక్షన్ హాల్లో విస్తృత స్థాయి సమావేశం అనంతరం బయటకు రాగా నే ఆటో కార్మికులు కేటీఆర్‌ను చుట్టుముట్టారు. తమ సమస్యలను ఆయనకు విన్నవించుకు న్నారు. దీనికి స్పందించిన కేటీఆర్ ఓ ఆటోలో ఎక్కి వారితో మాట్లాడారు. అదే ఆటోలో బీఆర్ఎస్ భవనానికి చేరుకున్నారు. దారిలో వారి సమస్యలను సావధానంగా విన్న కేటీఆర్ ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ నిచ్చారు. ఆటోలో ఆయన వెంట ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా ఉన్నారు. -
మొండి చేయి ‘గ్యారంటీ’
గచ్చిబౌలి (హైదరాబాద్): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని, పార్లమెంట్ ఎన్నికల అనంతరం మొండి చెయ్యి చూపడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లా డుతూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని బీజేపీ అభ్యర్థులకు దాదాపు మూడున్నర లక్షల ఓట్లు వచ్చాయని, పార్టీకి ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేస్తే బూడిదలో పోసిన పన్నీరుగా మారుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి విజన్, కార్యాచరణ లేదని, ఇచ్చిన హమీలు అమలు చేయలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలోనే ప్రతి నెలా ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఇప్పుడు అదనంగా ఆరు గ్యారంటీలు చెప్పిన కాంగ్రెస్ వాటిని ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను అడుగడుగునా ఎదుర్కోవాలని, బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథ కాలను ప్రజలకు వివరింరాలని పార్టీ కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడు తూ బూత్‌స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలలో తక్కువ ఓట్లు వచ్చిన బూత్‌లపై సమీక్ష చేసుకోవా లన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ మల్లారెడ్డి, ఇన్చార్జి ఏవీఎన్ రెడ్డి, నాయ కులు వీరేందర్‌గౌడ్, సునీతారెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీలుగా కోదండరాం,ఆమేర్ అలీఖాన్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామారెడ్డి (కోదండరాం), ఆమేర్ అలీఖాన్‌లను నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా గతంలో నియమితులైన డి.రాజేశ్వర్‌రావు, ఫారూక్ హుస్సేన్‌ల పదవీకాలం 2023 ఏప్రిల్ 27తో ముగిసిపోగా, అప్పటి నుంచి ఈ రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రెండు స్థానాల్లో దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను నియమించాలని ప్రతిపాదించగా, నిబంధనల ప్రకారం వీరికి అర్హతలు లేవని గవర్నర్ తమిళిసై అప్పట్లో తిరస్కరించారు. ఈ అభ్యర్థులిద్దరూ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరామారెడ్డి, ఆమేర్ అలీఖాన్‌ల పేర్లను ప్రతిపాదించగా, గవర్నర్ తమిళిసై సత్వరమే ఆమోదించారు. తెలంగాణ ఉద్యమంలో టీజేఏసీ చైర్మన్‌గా ప్రొఫెసర్ కోదండరాం కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన తెలంగాణ జన సమితి (టీజేఎస్) పేరుతో పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇక ఆమేర్ అలీఖాన్ ఉర్దూ దినపత్రిక సియాసత్‌కి న్యూస్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. -
ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: బీ ఆర్ఎస్ అధ్యక్షుడు, మా జీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫిబ్రవరి ఒకటో తేదీన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్ర శాసనసభకు గత ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరగ్గా డిసెంబర్ 3న ఫలితాలు వెలువడ్డాయి. డిసెంబర్ 9న అసెంబ్లీ ప్రొటెమ్ స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్త గా ఎన్నికైన వారిలో చాలా మంది ఎమ్మె ల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే డిసెంబర్ 8న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బాత్రూంలో కేసీఆర్ జారి పడగా తుంటి ఎముకకు గాయమైంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కేసీఆర్‌కు శస్త్ర చికిత్స జరిగింది. నాటి నుంచి కేసీఆర్ వైద్యుల సూ చన మేరకు విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నారు. త్వరలో రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి క్రియాశీలం కాబోతున్న కేసీఆర్ ఫిబ్రవరి 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేస్తారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం నేప థ్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి తరలిరానుండటంతో అసెంబ్లీ వర్గాలు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించాయి.