
చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది.
సాక్షి, చెన్నై: చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఈ విశ్వవిద్యాలయంలో బీటెక్ మూడో సంవత్సరం చదుతున్న సాయినాథ్ మంగళవారం కాలేజ్ హాస్టల్ భవనం మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయినాథ్ స్వస్థలం విజయవాడలోని నారాయణలింగాపురం. కాలేజ్ యాజమాన్యం రూ.10 వేల ఫైన్ విధించారని.. దీంతో మనస్థాపం చెందిన సాయినాథ్ ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. విద్యార్థి ఆత్మహత్యపై సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థిలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా రెండు నెలల క్రితం సత్యభామ యూనివర్సిటీలో చదవుతున్న రాధ మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన మౌనిక ఇంటర్నల్ ఎగ్జామ్ సందర్భంగా కాపీ కొట్టిందని.. ఆమెను ఎగ్జామ్ హాల్ నుంచి అధ్యాపకులు బయటకు పంపించి వేశారు. తదుపరి పరీక్షలకు కూడా అనుమతించలేదు. దీంతో అందరిలో అవమానంగా భావించిన మౌనిక హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.