
సాక్షి, చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై అనుమానపు నీడలు కమ్ముకున్న నేపథ్యంలో రోజుకో విషయం బయటకు పొక్కుతోంది. తొలుత సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తమే ఆస్పత్రిలో జయలలిత చేరారని చెప్పినప్పటికీ తాజాగా ఓ షాకింగ్ విషయం తెలిసింది. జయలలితను ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు అసలు శ్వాసలేకుండా ఉన్నారని, పూర్తి మగతలో ఉన్నారని ఆమె తొలి మెడికల్ నివేదిక ద్వారా తెలిసింది.
2016 సెప్టెంబర్ 22న ఆస్పత్రిలో చేరిన రోజు ఆమె తీవ్ర ఇన్‌ఫెక్షన్‌తోపాటు డీహైడ్రేషన్ సమస్యతో ఉన్నారని, శ్వాస సంబంధమైన ఒత్తిడితో ఉన్నారని కూడా ఆ నివేదిక వెల్లడించింది. ఆ సమయంలో ఆమె షుగర్ లెవల్స్ 508 ఉందని, ఆక్సిజన్ లెవల్ 45శాతం ఉందని పేర్కొంది. పోయేస్ గార్డెన్‌లో ఆమెను ఎవరైనా కిందికి తోశారేమోనని అనుమానాలు వచ్చిన నేపథ్యంలో ఆమెకు అసలు ఎలాంటి గాయాలు లేవని కూడా రిపోర్టులో వివరించారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ పీఎహెచ్ పాండియన్ జయలలిత మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆమెను పోయెస్ గార్డెన్‌లో ఎవరో తోసి వేసుంటారని ఆరోపించిన నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.