ఏపీ ‘హోదా’ కోసం రాజీలేని పోరు

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కొమ్మినేనితో కలసి ప్రవాసాంధ్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి - Sakshi


అవసరమైతే బ్రహ్మాస్త్రం

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన ప్రకటన

మా ఎంపీలతో రాజీనామాలు చేయిస్తాం

ప్రత్యేక హోదా కోసం దశలవారీ పోరాటం

తుదిదశలో రాజీనామా అస్త్రాన్నీ ప్రయోగిస్తాం

హోదా ఇచ్చే వారికే 2019లో కేంద్రంలో మద్దతు

కేసుల భయంతోనే హోదాకు చంద్రబాబు తూట్లు

దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి

ఉప ఎన్నికల ఫలితాలను రిఫరెండంగా భావిద్దాం

వ్యక్తిత్వాన్ని అమ్ముకోలేదు.. అమ్ముకోను కూడా..


 

సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటం సాగిస్తామని, అవసరమైతే ఎంపీల రాజీనామా అనే బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగిస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆదివారం ‘సాక్షి’ చానల్ ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం దశలవారీ పోరాటం సాగిస్తామని, అందులో భాగంగా తుదిదశలో అవసరమైతే ఎంపీల చేత రాజీనామాలు కూడా చేయిస్తామని ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం జరిగే పోరాటాలలో కలసివచ్చే అన్ని శక్తులను కలుపుకుని ముందుకు సాగుతామని, వామపక్షాలతో ఇప్పటికే కలసి పోరాడుతున్నామని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో కూడా ఎంపీలు పోరాడాల్సి ఉంది కాబట్టి అవసరమైతే చివరిదశలో వారి చేత కూడా రాజీనామాలు చేయించడానికి వెనుకాడబోమని ఆయన వెల్లడించారు.

ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు దమ్ముంటే తమ పార్టీ నుంచి ప్రలోభపెట్టి చేర్చుకున్న 20 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని జగన్ సవాల్ విసిరారు. ఆ 20 స్థానాలలో ఉప ఎన్నికలకు వెళ్దామని, వచ్చే ఫలితాలను రిఫరెండంగా భావిద్దామని పేర్కొన్నారు. 18 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరితే వారి చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లామని ఆయన గుర్తుచేశారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మోడరేటర్‌గా వ్యవహరించిన ఈ ముఖాముఖి కార్యక్రమంలో అమెరికా, బ్రిటన్, కెనడా, కువైట్, సింగపూర్‌ల నుంచి పలువురు ప్రవాసాంధ్రులు జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం అలుపెరుగకుండా పోరాడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వారు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ పోరాటానికి తాము మద్దతుగా ఉంటామని ముక్తకంఠంతో నినదించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాతో పాటు అనేక అంశాలపై జగన్‌మోహన్‌రెడ్డి తన అభిప్రాయాలను విస్పష్టంగా వెల్లడించారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారన్న ప్రచారంలోని మోసాన్ని వివరాలతో సహా ఏకరువుపెట్టారు. విభజన చట్టంలో తప్పనిసరిగా అమలు చేయాల్సిన అంశాలకు కొర్రీలు వేశారని, వాటినే ప్యాకేజీ అని ఘనంగా ప్రచారం చేస్తున్నారని, ఆ ప్యాకేజీ పేరుతో ప్రత్యేకహోదాకు మంగళం పాడేస్తున్నారని జగన్ వివరించారు.

 

 ప్రత్యేక హోదా ఎందుకంటే..

 ‘‘రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్‌ను కోల్పోయాం. హైదరాబాద్‌తో 98 శాతం ఐటీ ఉద్యోగాలు, 70 శాతం తయారీ రంగం ఉద్యోగాలు ముడిపడి ఉన్నాయి. చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం బెంగళూరు ఉన్న కర్ణాటకకో.. చెన్నై ఉన్న తమిళనాడుకో వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు రావాలంటే ప్రత్యేక హోదా చాలా అవసరం. హోదా కలిగిన రాష్ట్రాలకు ఆర్థిక రాయితీలు, ఆదాయపన్ను వంద శాతం మినహాయింపు, ఎక్సైజ్ డ్యూటీ, బీమా, రవాణా రంగాల్లోనూ భారీ ఎత్తున రాయితీలు ఉంటాయి. కొత్తగా వచ్చిన జీఎస్టీలోనూ రాయితీ నిబంధనలు చేర్చారు. ఇన్ని రాయితీలు ఉంటేనే ఇతర దేశాల్లో స్థిరపడిన మీలాంటి వాళ్లు ఎవరైనా పరిశ్రమ, హోటల్, ఆస్పత్రి వంటివి పెట్టడానికి ముందుకొస్తారు. తద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అప్పుడు ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుంది. చెనక్కాయలు, బెల్లం ఇచ్చినట్లు అరకొరగా రాయితీలు ఇస్తే దాన్నెలా ప్రత్యేక ప్యాకేజీ అంటారు. ఈ రాయితీల ద్వారా ఏవైనా పరిశ్రమలు వస్తాయా అని వెంకయ్యను ప్రశ్నిస్తున్నా. ఇలాగైతే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ ఎలా పోటీ పడగలుగుతుంది.?

 

 ఉప ఎన్నికలకు వెళ్దామా?

 అనేక ప్రలోభాలు పెట్టి వైఎస్సార్‌సీపీ నుంచి చేర్చుకున్న 20 మంది ఎమ్మెల్యేల చేత కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయిస్తే మేం ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ ఉప ఎన్నికల ఫలితాలను రిఫరెండంగా స్వీకరించడానికి తయారుగా ఉన్నాం. వారికి అధికారం ఉంది, పోలీసులు, డబ్బు అన్నీ ఉన్నాయి. అయినా కూడా చంద్రబాబుకు అవకాశం ఇస్తున్నా. ఉప ఎన్నికలకు వెళ్దాం. ఆ ఫలితాలను రిఫరెండంగా తీసుకుందాం. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకోవడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రాజకీయాలు నడపాలనుకోవడం మూర్ఖత్వమౌతుంది. తప్పులు చేస్తున్నపుడు ప్రశ్నిస్తారు. వాటిని స్వాగతించాలి. తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి. అసహనం కూడదు.

 

 హోదా ఇచ్చే పార్టీకే మద్దతు

 ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే రెండున్నరేళ్లుగా పోరాడుతున్నాం. దానిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. 2019 ఎన్నికల్లో ఏ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందో వారికే మద్దతుగా నిలుస్తాం. 2019 ఎన్నికల తరువాత కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉండబోదని భావిస్తున్నా.  కేంద్రంలో అస్పష్టమైన మెజారిటీ వచ్చి ఏపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున దేవుడు దయదలచి 22 లేదా 23 సీట్లు గెలిస్తే.. మన సీట్లే ఆక్సిజన్‌గా మనుగడ సాగించగలిగే ప్రభుత్వానికి మద్దతు నిస్తాం. ఆ ప్రభుత్వానికి తప్పకుండా ప్రత్యేక హోదా షరతును విధిస్తాం.  

 

 వాళ్లు ఇవ్వరు.. బాబు అడగరు...

 ఏపీ సీఎం చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా విషయంలో పూర్తిగా రాజీ పడిపోయారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారు. మేం మాత్రం హోదా కోసం పట్టువదలకుండా పోరాటం చేస్తాం. హోదా సాధించే వరకూ నిద్రపోయేది లేదు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి పోయి ఐదుకోట్ల మంది ప్రజల భవితవ్యాన్ని కేంద్రానికి పాదాక్రాంతం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీకి లేదు ... అడగాలని టీడీపీకి లేదు. అసలు చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. వారి మధ్య ఏం అవగాహన ఉందో కానీ ఇద్దరూ కలసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను దారుణంగా మోసం చేశారు. భవిష్యత్తులో నేనొక్కడినే కాదు, అందరూ ఈ పోరాటంలో కలసి రావాలి. ఉన్మాది అంటున్నారు.

 సైకో అంటున్నారు. ప్రజల కోసం పోరాడేవాడు ఉన్మాది, సైకో అవుతాడా! లేక ప్రజలను, చివరకు విద్యార్థులను కూడా అబద్ధాలతో మోసం చేస్తూ ఉన్మాదపూరితంగా వ్యవహరించేవాడు ఉన్మాది, సైకో అవుతాడా? హోదాపై మేం చేస్తున్న పోరాటాలకు వామపక్ష పార్టీలు మద్దతు నిస్తున్నాయి. ఢిల్లీలోనూ హోదా విషయమై విజ్ఞప్తి చేయడానికి వెళ్లినపుడు సీపీఎం, సీపీఐ జాతీయ నేతలను రెండుమార్లు కలిసి అభ్యర్థించాను. వారూ సంఘీభావం ప్రకటించారు. ప్రత్యేక హోదా రాదేమోనన్న నిస్పృహకు ప్రవాసాంధ్రులు గురి కానక్కరలేదు. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే పోరాడి సాధించుకున్నపుడు అంతకంటే తీవ్రత గల హోదాను సాధించుకోలేమా?

 

 నాపై కేసులు కుట్రపూరితం..

 రాష్ట్రంలో 5.50 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. దేవుడు చంద్రబాబుని సీఎంగానూ.. నన్ను ప్రతిపక్ష నేతగానూ చేశారు. దేవుడిచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితో వినియోగించుకోవాలి. అందుకే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నా. ఇప్పుడు హోదా పోరాటం చేయకపోతే భావితరాలు క్షమించవు. కేసులు అంటారా.. విధిరాత.. దేవుడు ఎలా పెట్టి ఉంటే అలా అవుతుంది. అయినా నాపై కేసులు పెట్టింది చంద్రబాబుకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నంత కాలం.. రాజశేఖరరెడ్డి మంచివాడు.. జగన్ మంచివాడు.. కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం జగన్ మంచివాడు.. ఎప్పుడైతే ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్‌ను వీడానో అప్పుడు కాంగ్రెస్, టీడీపీలు ఏకమై రాజకీయంగా నన్ను అణగదొక్కేందుకు కుట్రలు పన్నారు.

 

 రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన బాబు..

 చంద్రబాబు మాదిరి వ్యవస్థలను మేనేజ్ చేయడంలోనూ అబద్ధాలు చెప్పడంలోనూ దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎవరూ ఉండరు.. తెలంగాణలో నల్లధనంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఏసీబీ అధికారులకు ఆడియో, వీడియో టేపుల్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినా సీఎం పదవికి రాజీనామా చేయరు. అరెస్టు నుంచి తప్పించుకోవడం చంద్రబాబుకే చెల్లింది. వైఎస్సార్‌సీపీ ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20  కోట్ల నుంచి రూ. 30 కోట్ల చొప్పున నల్లధనం ఇచ్చి కొనుగోలు చేశారు. చంద్రబాబు చేస్తోన్న అవినీతి అంతాఇంతా కాదు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో ఈపీసీ పద్ధతిలో ధరల సర్దుబాటు కింద అదనపు నిధులు కాంట్రాక్టర్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ జీవో 22 ద్వారా కాంట్రాక్టర్లకు అదనపు నిధులు ఇచ్చేస్తారు. పట్టిసీమ నుంచి పోలవరం దాకా.. ఇసుక నుంచి బొగ్గు వరకూ.. బొగ్గు నుంచి జెన్‌కో వరకూ.. జెన్‌కో నుంచి గుడుల వరకూ.. గుడి నుంచి గుడిలో లింగాన్ని మింగే వరకూ బాబును మించిన వారు లేరు. దొంగ పట్టుబడినప్పుడు బతుకు తెలుస్తుంది. చంద్రబాబును దేవుడు మొట్టికాయలు వేసే రోజు ఎంతో దూరంలో లేదు.

 

 కమీషన్ల కోసమే ‘పోలవరం’ అడిగారు..

 రాష్ట్ర ప్రభుత్వం అడిగితే పోలవరం ప్రాజెక్టును అప్పగిస్తున్నట్లు కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టంగా ఉంది. రెండున్నర సంవత్సరాల్లో ఏం చేశారు.. కాంట్రాక్టర్ అనర్హుడని.. తొలగించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) పదే పదే చెప్పినా పట్టించుకున్న దాఖలాలు లేవు. కాంట్రాక్టర్‌ను రక్షించుకోవడం కోసం, కమీషన్లు కొట్టేసేందుకే పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని చంద్రబాబు పట్టుబట్టారు. పీపీఏ చెప్పిన తరహాలో కాంట్రాక్టర్‌ను తొలగించి, మళ్లీ టెండర్ పిలిచి ఉంటే మంచి కాంట్రాక్టర్ దొరికేవారు. అంతే కాదు.. 2013 నుంచి ఇప్పటితో పోల్చి చూస్తే ఇనుము, డీజిల్, ఇసుక, సిమెంటు వంటి ధరలు తగ్గాయి.

 

 ఆ మేరకు ప్రాజెక్టు అంచనా వ్యయం తగ్గేది. కేంద్రానికి ప్రాజెక్టును అప్పగించి ఉంటే నిధుల ఇబ్బంది ఉండదు. శరవేగంగా పూర్తయ్యే అవకాశం ఉండేది. సరిహద్దు రాష్ట్రాలు అభ్యంతరం పెట్టినా.. పనులపై పర్యావరణ నిషేధం వంటివి విధించినా ఆ బాధ్యత కేంద్రం చూసుకునేది. కానీ రాష్ట్రానికి ఆ ప్రాజెక్టును అప్పగించడం వల్ల ఇప్పుడు ఆ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వమే ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

 

 వ్యక్తిత్వాన్ని అమ్ముకునేవాణ్ణి కాదు

 అనేక దేశాల నుంచి తమ సమయాన్ని వెచ్చించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రత్యేక హోదాపై మనం పోరాడకపోతే ఎప్పటికీ రాదు. ఈ పోరాటంలో జగన్‌కు మీ అందరి మద్దతు కావాలి. మీరు లేకుండా నేను లేను. ఒకటి మాత్రం చెప్పగలను. మనస్ఫూర్తిగా పోరాడతాను. నా క్యారెక్టర్‌ను నేను ఎప్పుడూ అమ్ముకోలేదు. భవిష్యత్‌లో కూడా ఎప్పుడూ అమ్ముకోను. ఎన్ని కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా వ్యక్తిగత స్వార్థం కోసం ఎప్పుడూ రాజీ పడలేదు. పడబోను కూడా. అందరం పోరాటం చేస్తే కచ్చితంగా ఇది సాధ్యమవుతుంది.

 

 సాధ్యం కాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే వాళ్ళు తెచ్చుకోగలిగినప్పుడు... పార్లమెంట్ సాక్షిగా సాక్షాత్తూ ప్రధానమంత్రి ఇచ్చిన మాట అది. మనం ప్రయత్నం చేస్తే కచ్చితంగా ప్రత్యేకహోదా వస్తుందనే నమ్మకం నాకు ఉంది. పోరాటం చేస్తే కచ్చితంగా సాధ్యమవుతుంది. ఈ పోరాటాన్ని ఇంత వరకూ రెండున్నరేళ్ళు కొనసాగించాం. ఇంకా రెండున్నర సంవత్సరాలు కూడా దశలవారీగా పోరాటాన్ని ముందుకు తీసుకుని పోతాం.

 

 ప్రశ్నిస్తే అభివృద్ధి నిరోధకులమా?

అవినీతిని ప్రశ్నిస్తే అడ్డుతగులుతున్నారని అంటున్నారు. రాజధానిలో అనేక అవినీతి ఉన్నాయి.  ఇన్‌సైడర్ ట్రేడింగ్, తనకు సంబంధించిన బినామీలు భూములకు జోనింగ్‌లో మేలు చే యడమే బాబు లక్ష్యం. స్విస్‌చాలెంజ్‌లో ఆయన ఒక పద్ధతి ప్రకారం తనకు కావలసిన వారికి, ప్రయివేటు కంపెనీలకు భూములు ధారాదత్తం చేయడం, దానికోసం ప్రభుత్వం చేత డబ్బులు ఖరుచ పెట్టించడం చేస్తున్నారు.  దానివల్ల వేలకోట్ల రూపాయాలు వారి బినామీలకు మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టారు. దాన్ని ప్రశ్నిస్తే వారికి నచ్చదు. పట్టిసీమలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తే అభివృద్ధి నిరోధకులంటూ మాపై  బండ వేస్తున్నారు. ధవళేశ్వరం నుంచి రోజుకు 3 లక్షలనుంచి 4 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి పోతోంది.

 

 మరోపక్క ప్రకాశం బ్యారేజీ నుంచి 1.30 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి పోతోంది. మేము ఆరోజు చెప్పింది అదే కదా? పట్టిసీమ అంటూ గోదావరి నుంచి నీళ్లు తెచ్చి ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి కలుపుతున్నారు. గోదావరి, కృష్ణా నదులు రెండింటికీ ఇంచుమించుగా ఒకే టైమ్‌లో వరదలు వస్తాయి. వరద వచ్చినప్పుడు దాన్ని నిల్వచేయడానికి కావలసింది స్టోరేజీ. ఆ వ రదను నిల్వచేసి వర్షాలు పడనప్పుడు ఆ స్టోరేజీ నుంచి నీళ్లు ఇవ్వవచ్చు. పోలవరం అన్నదే ఆస్టోరేజీ. అది కట్టడు. పట్టిసీమను నది అంటాడు. చంద్రబాబుకు మెగలో మేనియా ఉందన్న మాట నిజమనిపిస్తోంది. తానేమి చెప్పినా ప్రజలు నమ్మేస్తారన్న భ్రమల్లో చంద్రబాబు ఉన్నాడు.

 

 ఆ ఇద్దరూ మాటమార్చారు

 రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక హోదానే సంజీవని అని రాష్ట్ర విభజన సమయంలోనూ, తర్వాత ఎన్నికల సమయంలోనూ వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడులే అన్నారు. ఒకరు అయిదేళ్లు కాదు పదేళ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. ఇంకొకరేమో పదేళ్లు చాలదు పదిహేనేళ్లు  ప్రత్యేక హోదా కావాలన్నారు. ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు  ఏమేం మాట్లాడారు? ఎలా ప్లేటు ఫిరాయించారు? అనే అంశాలను ఈనెల 22న ఏలూరులో జరిగిన యువభేరిలో నేను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చూపించాను. బీజేపీ వాళ్లు ప్రత్యేక హోదా ఇవ్వదల్చుకోలేదు. ఈయన (చంద్రబాబు) వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినందుకు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు అలాగే బీజేపీకీ, టీడీపీకి కూడా బుద్ధి చెబుతారు. వెంకయ్య, చంద్రబాబు మధ్య ఏముందో? మొత్తం మీద ఐదు కోట్ల మంది ప్రజలను మాత్రం మోసం చేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top