ఈ-పాస్‌ లేకపోవడంతో.. ఐసోలేషన్‌కి ప్రేమజంట  

Young Man Isolation Along With His Girlfriend In Chennai - Sakshi

సాక్షి, చెన్నై: ఈ–పాస్‌ లేకుండా ప్రియురాలిని వెతుక్కుంటూ చెన్నై నుంచి తిరువణ్ణామలైకు వచ్చిన యువకుడిని ప్రియురాలితో పాటు అధికారులు ఐసోలేషన్‌లో ఉంచారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు గత మార్చి 24వ తేదీ నుంచి కర్ఫ్యూ ఉత్తర్వులు అమలులో ఉన్న విషయం తెలిసిందే. జిల్లా నుంచి మరో జిల్లా వెళ్లేందుకు ఈ–పాస్‌ తప్పనిసరి. వివాహం, మరణం, అత్యవసర వైద్య చికిత్సలు వంటి కారణాలకు మాత్రమే ఈ–పాస్‌ అందజేస్తున్నారు. అనుమతి లేకుండా సరిహద్దులు దాటే వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఉండగా తన ప్రియురాలిని కలుసుకోలేక నాలుగు నెలలుగా అవస్థలు పడుతూ వచ్చిన చెన్నై యువకుడు ఈ–పాస్‌ లేకుండా చెక్‌పోస్టులను రహస్యంగా అధిగమించి తిరువణ్ణామలైకు చేరుకున్నాడు. ఆపై అధికారులకు పట్టుబడ్డాడు. ఇతన్ని ప్రియురాలితోపాటు ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు.

ప్రియురాలిని కలిసేందుకు చెన్నై నుంచి వచ్చిన యువకుడు రెండు రోజులుగా తిరువణ్ణామలైలోని వివిధ ప్రాంతాలకు, దుకాణాలకు వెళ్లి వస్తున్నట్లు కార్పొరేషన్‌ అధికారులకు సమాచారం అందింది. రెట్టైపిళ్లయార్‌ ఆలయం సమీపంలోని ఒక దుకాణంలో ప్రియురాలు, ప్రియుడు మాట్లాడుకోవడాన్ని అధికారులు కనుగొన్నారు. విచారణలో యువకుడు కన్యాకుమారికి చెందిన వాడని, చెన్నైలోని సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ప్రతినెలా తిరువణ్ణామలైకు గిరిప్రదక్షిణ కోసం రాగా ప్రేమ చిగురించినట్లు సమాచారం. నాలుగు నెలలుగా ప్రియురాలిని చూడకుండా అవస్థలు పడ్డాడు. చెక్‌పోస్టు అడ్డంకులను దాటుకుని వచ్చినట్లు యువకుడు తెలిపాడు. ఈ ప్రేమికులను తిరువణ్ణామలైలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. అక్కడ వారికి కరోనా పరీక్షలు జరిపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. చదవండి: ప్రియురాలి కోసం వెళ్లిన యువకుడిపై..

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top