ఇద్దరు లష్కరే ఉగ్రవాదులపై నేడు చార్జిషీట్ | Will Charge Sheet LeT Men Tomorrow: Cop to Court | Sakshi
Sakshi News home page

ఇద్దరు లష్కరే ఉగ్రవాదులపై నేడు చార్జిషీట్

May 7 2014 10:48 PM | Updated on Sep 2 2017 7:03 AM

దేశ రాజధానిలో జరిగిన పలు పేలుళ్లు, దాడులతో సంబంధమున్న ఇద్దరు ఉగ్రవాదులపై గురువారం చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కోర్టుకు తెలిపారు.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరిగిన పలు పేలుళ్లు, దాడులతో సంబంధమున్న ఇద్దరు ఉగ్రవాదులపై గురువారం చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కోర్టుకు తెలిపారు. లష్కరే తోయిబాకు చెందినవారుగా భావిస్తున్న వీరిని పోలీసులు గత ఏడాది అరెస్టు చేశారు. మహ్మద్ రషీద్, మహ్మద్ షాహిద్ అనే ఇద్దరు నిందితుల జ్యుడీషియల్ కస్టడీని గురువారం వరకు పొడిగించారు. తమపై చార్జిషీట్ దాఖలు చేయనందున బెయిల్‌పై విడుదల చేయాలంటూ ఇద్దరూ చేసిన విజ్ఞప్తిని అడిషనల్ సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది. గురువారం వరకూ జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించి, విచారణ కొనసాగించాలని ఆదేశించింది.
 
 తప్పించుకున్న నిందితుడు, పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది జావేద్ బలూచీతో సంబంధమున్న అబ్దుల్ సుభాన్‌ను పట్టుకోవడానికి కొంత సమయం కావాలని కోరిన పోలీసులు, ఈ ఇద్దరిపై చార్జిషీట్ సిద్ధంగా ఉందని, గురువారం కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. ఇద్దరు నిందితులను గత ఏడాది డిసెంబర్‌లో హర్యానాలోని మేవత్ ప్రాంతం లో అరెస్టు చేశారు. తద్వారా దేశంలో లష్కరే తోయిబా తలపెట్టిన భారీ దాడి కుట్రకు తెరదించారు. దేశంలో పెద్ద పెద్ద దాడులకు లష్కరే తోయిబా ప్రణాళికలు రూపొందించినట్టు తన పాకిస్థాన్ మొబైల్ నంబర్‌నుంచి రాజ స్థాన్‌లో బలూచీకి కొనసాగించిన సంభాషణల ద్వారా వెల్లడైందన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ అల్లర్ల తరువాత ఇద్దరు వ్యక్తులను కలిసినట్లు రషీద్, షాహిద్ చెప్పారని పోలీసులు వివరించారు.
 
 విచారణ నుంచి తప్పుకున్న జడ్జి
 న్యూఢిల్లీ: నితీష్ కతారా హత్య కేసు నిందితుల్లో ఒకరైన విశాల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై విచారణనుంచి మరో ఢిల్లీ హైకోర్టు జడ్జి తప్పుకున్నాడు. ఈకేసులో మొదటి జడ్జి జస్టిస్ వీణా బీర్బల్ తప్పుకోవడంతో విశాల్ పెరోల్ అభ్యర్థనను ఎస్‌పీ గార్గ్‌కు అప్పగించారు. తమ్ముడి పెళ్లి బాధ్యతలు చూసుకోవడానికి మగవాళ్లెవరూ లేనందున తన హాజరు తప్పనిసరి అని, అందువల్ల పెరోల్ ఇవ్వాలని విశాల్ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిదిన్నరేళ్లు శిక్ష అనుభవించిన విశాల్ గతంలో ఇచ్చిన బెయిల్‌ను దుర్వినియోగం చేయలేదని న్యాయవాది తెలిపారు. ఇటీవల జస్టిస్ గీతా మిట్టల్, జే ఆర్ మిధాలతో కూడిన ట్రయల్ కోర్టు ధర్మాసనం కిడ్నాప్, హత్య కేసులో విశాల్‌తోపాటు అతని కజిన్స్ వికాస్, సుఖ్‌దేవ్ పెహల్వాన్‌లకు శిక్ష విధించింది. నేరాన్ని పరువు హత్యగా పరిగణించిప కోర్టు... శిక్షాకాలంపై మే 16న వాదనలు విననుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement