చరిత్రాత్మక పురానా ఖిల్లాలో తిరిగి సందడి నెలకొననుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఇక్కడ అక్టోబర్ రెండో తేదీ నుంచి ఆరో తేదీవరకు అనన్య వార్షిక నృత్యోత్సవాలను నిర్వహించనున్నారు.
పురానా ఖిలాకు ‘కళ’!
Sep 27 2013 12:22 AM | Updated on Sep 1 2017 11:04 PM
న్యూఢిల్లీ: చరిత్రాత్మక పురానా ఖిల్లాలో తిరిగి సందడి నెలకొననుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఇక్కడ అక్టోబర్ రెండో తేదీ నుంచి ఆరో తేదీవరకు అనన్య వార్షిక నృత్యోత్సవాలను నిర్వహించనున్నారు. దేశంలో పేరొందిన వివిధ సంప్రదాయ నృత్య రీతులను ఈ ఉత్సవాల్లో ప్రదర్శించనున్నారు. దూరదర్శన్‌తో కలసి కళ, సాంస్కృతిక భాషల విభాగం, సాహిత్య కళా పరిషత్, సెహర్‌లు ఐదు రోజులపాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నాయి.
ఈ ఏడాది మలబిక మిత్రా బృందం( కోల్‌కతా) కథక్ నృత్యం ప్రదర్శిస్తుండగా, కేరళకు చెందిన పల్లవీ కృష్ణన్ బృందం మోహినీహట్టాన్ని, భోపాల్‌కు చెందిన బిందు జునేజా బృందం ఒడిస్సీ, ఢిల్లీకి చెందిన మైత్రేయీ పహారీ బృందం కథక్, మయూర్‌భంజ్ చౌ నృత్యరీతులను ప్రదర్శించనున్నారు. అలాగే బెంగళూరుకు చెందిన కిరణ్ సుబ్రమణ్యం, సంధ్రా కిరణ్ బృందం భరతనాట్యం చేయనున్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ యువతలో భారతీయ సంప్రదాయ నృత్య రీతుల్లో ఆసక్తిని పెంపొందించడానికే ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను మన సంప్రదాయాలను కాపాడుకుంటూ, భవిష్యత్ తరాలకు వాటిని అందించాలని తాము ప్రయత్నిస్తున్నట్లు నిర్వాహకుల్లో ఒకరైన సెహర్ తెలిపారు.
ప్రదర్శనలతో పాటు అక్టోబర్ 3,4 తేదీల్లో వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తామన్నారు. ఆసక్తిగల విద్యార్థులు పగటి పూట కార్యక్రమం జరుగుతున్న ప్రదేశంలోనే నృత్య కళాకారులను కలసి మాట్లాడవచ్చని తెలిపారు. సంగీతం, నృత్యం, నటన, కళ తదితర సంబంధిత విద్యార్థులు భవిష్యత్తులో వాటిని ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలుగా ఎంచుకునేందుకు తగిన విధంగా వర్క్‌షాప్‌లను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వచ్చే నెల 5, 6 తేదీల్లో నృత్య కళాకారులు, ప్రేక్షకుల మధ్య ‘ప్రతిబింబ్’ పేరిట సుహృద్భావ సమావేశాలు ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. ఇందులో యువ నృత్యకళాకారులు, స్కాలర్స్, విద్యార్థులు, నృత్య ఔత్సాహికులు పాల్గొనేలా చూసి, వారిలో నూతనత్వాన్ని గుర్తించడం ధ్యేయమన్నారు. ఈ సందర్భంగా అనన్యా నృత్యోత్సవం ముఖ్య ప్రతినిధి మన్జాట్ చావ్లా మాట్లాడుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ప్రత్యేక చొరవతో అనన్య నృత్యోత్సవాలు 2002 నుంచి నగరంలో జరుగుతున్న అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమాల్లో ఒకటిగా నిలుస్తోందని కొనియాడారు. ‘ప్రతి యేడాది వందలాదిమంది సంప్రదాయ నృత్య ఔత్సాహిక కళాకారులు చారిత్రక పురానా ఖిల్లాలో తమ కళను ప్రదర్శిస్తూ ఎంతో గుర్తింపు పొందుతున్నారు. ఢిల్లీలోని పలు పాఠశాలల విద్యార్థులు అనన్య వర్క్‌షాపులను వినియోగించుకుంటున్నారు..’ అని చావ్లా తెలిపారు.
ఇదిలా ఉండగా అనన్య వార్షిక నృత్యోత్సవాల్లో పురాతన కథావచన్‌కు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అనువదించిన కథక్ నృత్య ప్రదర్శనను మలబికా మిత్రా ప్రదర్శించనున్నారు. హిందీ కృతి అయిన కింగ్ స్వాతి తిరునాళ్‌పై పల్లవి ఏక కళాకారిణిగా నృత్య ప్రదర్శన ఇస్తారు. బిందు జునేజా తన ఇద్దరు విద్యార్థులతో కలసి ఒడిస్సీ నృత్యాన్ని చేస్తారు. శరత్ పూర్ణిమ నాడు ఢిల్లీవాసులైన మైత్రేయి పహరీ బృందం ‘మహరాస్’ను ప్రదర్శించనుంది. బెంగళూరుకు చెందిన కిరణ్ సుబ్రమణ్యం, సంధ్యా కిరణ్ బృందం చేసే భరతనాట్య ప్రదర్శనతో ఈ నృత్యోత్సవం ముగుస్తుంది.
Advertisement
Advertisement