
రోడ్డుపై బైఠాయించిన విద్యార్థినులు
సాక్షి బెంగళూరు: వేలాది మంది విద్యార్థులు హావేరిలో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. గురువారం జాతీయ రహదారిపై వారద నదికి సమీపంలో 21 ఏళ్ల యువతి మృతదేహం లభించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన రేణుక పాటిల్ కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హావేరి పట్టణంలోని ప్రధాన సర్కిల్‌ను అడ్డగిస్తూ విద్యార్థులు మానవహారాన్ని నిర్వహించారు. హావేరి పట్టణానికి సరిగ్గా 14 కిలోమీటర్ల దూరంలోని మన్నూర్ గ్రామానికి చెందిన బసనగౌడ కుమార్తె రేణుక పాటిల్ (21) అనుమానస్పద రీతిలో కాలిన గాయాలతో మృతి చెందింది. కాగా, సోమవారం సాయంత్రం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకునేందుకు మిత్రులతో వెళ్లి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆ పార్టీలో మత్తుపదార్థాలు ఇచ్చి స్నేహితులే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి హత్య చేసి ఉంటారని అనుమానించారు. ఈ నేపథ్యంలో రేణుక విషయంలో సత్వర న్యాయం జరగాలని, నిందితులను కఠినంగా శిక్షించాని డిమాండ్ చేస్తూ హావేరి రోడ్డుపై విద్యార్థులు నిరసన చేపట్టారు. ఏబీవీపీ, ఎస్‌ఐఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు జరిగాయి. మరోవైపు పంచమసాలి పీఠాధిపతి బసవజయ మృత్యుంజయ శ్రీగళు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువతులపై వేధింపులు అధికమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేణుక పాటిల్ కేసుపై తక్షణమే ముఖ్యమంత్రి, హోం మంత్రి స్పందించాలన్నారు.