జేఎన్‌యూలో విద్యార్థిని రోష్ని మీద జరిగిన దాడి విశ్వవిద్యాలయంలో సామాజిక చర్చకు తెరలేపింది.
న్యూఢిల్లీ: జేఎన్‌యూలో విద్యార్థిని రోష్ని మీద జరిగిన దాడి విశ్వవిద్యాలయంలో సామాజిక చర్చకు తెరలేపింది. విద్యార్థులు, బోధనా సిబ్బంది పాల్గొన్న ఈ సభలో జేఎన్‌యూ విద్యార్థి నేత వీ లెనిన్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఓ విద్యార్థి సహ విద్యార్థిని మీద చేసిన దాడి విద్యార్థి సమాజం వైఫల్యమే. ఇందుకు అందరం బాధ్యులమే’’ అని అన్నారు. విశ్వవిద్యాలయంలో రెండు రోజుల కిందట జరిగిన బహిరంగా సభలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఇలాంటి సంఘటనలను నివారించడానికి సీసీ కెమెరాల నిఘా సరిపోదని, హింసాత్మక దాడికి మూలమైన పితృస్వామ్య భావజాలాన్ని తుడిచిపెట్టడం ద్వారా మాత్రమే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడగలమన్నారు. అధ్యాపకురాలు అనురాధ చెనాయ్ మాట్లాడుతూ.. ‘‘పితృస్వామ్య పాలన మగవాళ్లకు మహిళ మీద సర్వాధిపత్యం ఉందని నూరిపోస్తోంది. ఇలాంటి అహంకారమే వీరితో డిసెంబర్ 16 సామూహిక అత్యాచారాన్ని సమర్థిస్తూ నిరసన ప్రదర్శన చేయించింది.
విశ్వవిద్యాలయంలో కాప్ పంచాయత్‌ల వాతావరణం నెలకొల్పాలని చూస్తున్నారు. మహిళల మీద సమాజంలో జరుగుతున ్న దాడులకు విశ్వవిద్యాలయం మినహాయింపు కాదు’’ అని పేర్కొన్నారు. ‘‘సమాజ ఆధిపత్య ధోరణిగా సాగుతున్న పితృస్వామ్య భావజాలం జేఎన్‌యూ విద్యార్థుల మీద కూడా ఉంటుంది. దీనికి వీరేమీ మినహాయింపు కాదు. ఒకవేళ అలా భావిస్తే మనల్ని మనం అపహాస్యం చేసుకున్నట్లే. రోష్ని మీద జరిగిన దాడి మనల్ని విచలితుల్ని చేస్తోంది. ఇది ఆధిపత్య భావజాలంలోభాగంగానే గుర్తించాల్సి ఉంటుంది’’ అని ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ జయతి ఘోష్ అన్నారు. ‘‘రోష్ని మీద జరిగిన దాడికి ఎవరి మీదో నిందలు వేయడం కంటే దీనికి అందరు నైతిక బాధ్యత వహించాలని స్పష్టం చేయడం. విద్యార్థి సమాజం మానసిక పరిణితికి గుర్తు’’ అని విశ్వవిద్యాలయం ఉపాధ్యాక్షుడు సుధీర్‌కుమార్ సొపొరీ అన్నారు. ‘‘అయితే ఇలాంటి సంఘటనల పట్ల విశ్వవిద్యాలయం దయగా వ్యవహరిస్తుందనే అర్థంలో తీసుకోవద్దు’ అని ఆయన హెచ్చరించారు.
సామాజికశాస్త్ర విభాగం ప్రొఫెసర్ ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ.. ‘‘విద్యార్థిని మీద అమానవీయ దాడితో అల్లాడిన విద్యార్థుల తల్లిదండ్రులు విశ్వవిద్యాలయంలో తమ కూతురు, కుమారుడు ఎలా ఉంటున్నారో అని పడిన ఆందోళనకు ఈ సభ గొప్ప ఊరడింపు. విద్యార్థులు, అధ్యాపకవర్గాలు కలిసి నిర్వహిస్తున్న ఈ సభ వారి తల్లిదండ్రుల ఆందోళనకు ఉపశమనం కలిగించింది. అయితే ఇంతటితో వదిలిపెట్టకుండా విద్యార్థుల కోసం 24 గంటల సహయ కేంద్రాన్ని ప్రారంభించాలి’’ అని సూచించారు. లింగ వివక్ష వ్యతిరేక అవగాహన కమిటీలో అధ్యాపక వర్గాల ప్రతినిధి అయేషా కిద్వాయ్ మాట్లాడుతూ.. ‘‘వే ధింపులు జరిగినా విద్యార్థినులు విశ్వవిద్యాలయ వర్గాలకు ఫిర్యాదు చేయరనే భరోసానే ఆకాశ్ దాడికి అవకాశం ఇచ్చింది. రోష్ని వేధింపులను సహించడం వల్లనే దాడి చేసేందుకు ధైర్యం చేయగలిగాడ’ని పేర్కొన్నారు.
ఐసీయూలోనే రోష్ని
ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవహర్‌లాల్ నెహ్రూ విద్యార్థి రోిష్ని ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోంది. గత నాలుగు రోజుల నుంచి అత్యవసర చికిత్స విభాగం(ఐసీయూ)లోనే ఉన్న ఆమె రోజు రోజుకు కోలుకుంటోందని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ బీడీ అథాని ఆదివారం విలేకరులకు తెలిపారు. ‘ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. రోజురోజుకు మెరుగవుతోంది. ఇప్పటికీ ఐసీయూలోనే చికిత్స పొందుతోంద’ని వివరించారు. తలపై తీవ్ర గాయాలవడంతో మెదడులో రక్తం గడ్డ కట్టిందని, అన్ని గాయాలకు డ్రెస్సింగ్ చేశామన్నారు. కుడి మణికట్టుకు కూడా తీవ్ర గాయమైందని తెలిపారు. అన్ని అవయవాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తనతో తరగతి నుంచి బయటకు రాలేదని ఆకాశ్ అనే విద్యార్థి గొడ్డలితో రోష్నిపై దాడి చేసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
బీహార్‌లోనే 12వ తరగతి వరకు చదివిన ముజాఫర్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారి చిన్న కుమార్తె రోష్ని ఉన్నత చదువుల కోసం ఢిల్లీకి వచ్చింది. అయితే అకాశ్‌తో తన సోదరికి ఎలాంటి సంబంధం లేదని, అతడు అనేకసార్లు ప్రేమిస్తున్నానని చెప్పినా తిరస్కరించిందని రోష్ని సోదరుడు సుధీర్ గుప్తా తెలిపారు. తన సోదరి చదువుల్లో ముందుంటుందన్నాడు. అయితే అకాశ్ రాసిన హిందీ, ఇంగ్లిష్‌లో ఉన్న నాలుగు పేజీల లేఖను పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి వివరించారు.