న్యూఢిల్లీలో దిగొచ్చిన ఉల్లి! | Onion price reduced | Sakshi
Sakshi News home page

న్యూఢిల్లీలో దిగొచ్చిన ఉల్లి!

Sep 24 2013 1:18 AM | Updated on Sep 1 2017 10:59 PM

ఉల్లి లేక వెలవెలబోయిన వంటిల్లు ఇక కళకళలాడనుంది. నగరంలోని హోల్‌సేల్ మార్కెట్లకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కొత్త ఉల్లి వస్తుండడంతో ఇన్నాళ్లూ ఎగబాకిన ఉల్లి ధర ఇక దిగిరానుంది.

న్యూఢిల్లీ: ఉల్లి లేక వెలవెలబోయిన వంటిల్లు ఇక కళకళలాడనుంది. నగరంలోని హోల్‌సేల్ మార్కెట్లకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కొత్త ఉల్లి వస్తుండడంతో ఇన్నాళ్లూ ఎగబాకిన ఉల్లి ధర ఇక దిగిరానుంది. కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి నగరానికి కొత్త ఉల్లి రావడంతోనే కిలోకు పది రూపాయల మేర దర తగ్గింది. ఇదీగాక వాఘా సరిహద్దు గుండా అఫ్ఘానిస్థాన్ నుంచి కూడా ఉల్లి వస్తుండడంతో రానున్న రోజుల్లో ధర మరింతగా తగ్గే అవకాశముందని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.60-70 మేర పలుకుతోందని, శని, ఆదివారాల్లో ఈ ధర రూ. 80కిపైగా పలికిందని చెప్పారు. 
 
 బెంగళూరు మండి నుంచి నగరంలోని అజాద్‌పూర్ మండికి కొత్త ఉల్లి భారీగా వస్తోందన్న సమాచారంతో ఉన్న సరుకు ధరను వ్యాపారులు కిలోకు పదిరూపాయల మేర తగ్గించి విక్రయించేస్తున్నారు. కొత్త ఉల్లి వస్తే కిలో ఉల్లి ధర రూ. 45-50 వరకు  ఉండే అవకాశం ఉందని ఉల్లి వ్యాపార సంఘం అధ్యక్షుడు సురేంద్ర బుధిరాజ్ చెప్పారు. నగరానికి వస్తున్న ఉల్లి గత వారంతో పోలిస్తే 30 శాతం మేర పెరిగిందని, సోమవారం ఒక్కరోజే దాదాపు 12,000 క్వింటాళ్ల ఉల్లి మార్కెట్‌కు వచ్చిందన్నారు. గత వారం కేవలం 9,000 క్వింటాళ్లు మాత్రమే వచ్చిందని చెప్పారు. 
 
 ధర తగ్గించనున్న మదర్ డెయిరీ అవుట్‌లెట్‌లు
 ఎనభై రూపాయల ధర పలికిన సందర్భంలో కూడా ఉల్లిని రూ. 62-64కు విక్రయించిన మదర్ డెయిరీ అవుట్‌లెట్‌లు తాజా పరిణామంతో తాము విక్రయిస్తున్న ఉల్లి ధరను మరింత తగ్గించి విక్రయించనున్నాయని సంబంధిత అధికారి ఒకరు ప్రకటించారు.  మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా, లాసల్గావ్ ఉల్లి మార్కెట్‌కు కూడా భారీగా కొత్త ఉల్లి తరలివస్తుండడంతో ధర మరింత తగ్గే అవకాశముందంటున్నారు. ప్రస్తుతం లాసల్గావ్‌లో కిలో ఉల్లి రూ.41కి విక్రయిస్తున్నారని, దీనితో పోలిస్తే దేశంలోని ఇతర మార్కెట్లలో ఐదారు రూపాయలు మాత్రమే ఎక్కువగా ఉండే అవకాశముంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కనీస ఎగుమతి ధరను 650 నుంచి 900 అమెరికన్ డాలర్లకు పెంచడంతో విదేశాల్లో మన ఉల్లికి డిమాండ్ చాలా తగ్గడం, ఫలితంగా దేశంలో ఉల్లి నిల్వలు పెరగడం కూడా ప్రస్తుతం ఉల్లి ధరలు తగ్గడానికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఉల్లి ధర తగ్గుముఖం పట్టడడంపై సామాన్యుడు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement