భద్రతా సవాళ్లు మరింత సంక్లిష్టం

India National Security Challenges Becoming Complex: Rajnath - Sakshi

ప్రపంచ రాజకీయ ముఖచిత్రం మారుతోంది

అఫ్గాన్‌లో తాలిబన్ల ఆధిపత్యం నేపథ్యంలో రాజ్‌నాథ్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: మతచాంధస, ఉగ్రమూలాలున్న తాలిబన్లు అఫ్గాన్‌ను హస్తగతం చేసుకోవడంతో ప్రపంచ ‘రాజకీయ’ స్వరూపం మారుతోందని, దీంతో దేశ భద్రతా సవాళ్లు మరింత సంక్షిష్టమవుతున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. సవాళ్లకు ధీటుగా నిలబడాలంటే సొంత రక్షణ రంగ వ్యవస్థను మరింత పటిష్టంచేయాల్సిన సమయం ఆసన్నమైందని రాజ్‌నాథ్‌ పునరుద్ఘాటించారు. రక్షణరంగంలో వినూత్న ఆవిష్కరణలకు ఉద్దేశించిన ‘డిఫెన్స్‌ ఇండియా స్టార్టప్‌ ఛాలెంజ్‌ 5.0’ను గురువారం ఢిల్లీలో ప్రారంభించిన సందర్భంగా రాజ్‌నాథ్‌ ఉపన్యసించారు. రక్షణరంగానికి సంబంధించిన నూతన సాంకేతికతను ప్రోత్సహించడానికి ‘ఇన్నోవేషన్స్‌ ఫర్‌ డిఫెన్స్‌ ఎక్స్‌లెన్స్‌(ఐడెక్స్‌) పేరిట ఒక కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

‘ ప్రపంచవ్యాప్తంగా దేశ భద్రతపరంగా మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. వాటికి అనుగుణంగా మారడంతోపాటు, సాయుధదళాల పూర్తి అవసరాలు తీర్చే స్థాయిలో,  వేరే దేశాలపై ఆధారపడకుండా, రక్షణ రంగంలో ఆయుధాలు, తదితర సైనిక ఉపకరణాల ఉత్పత్తిలో భారత్‌ మరింత స్వావలంభన సాధించాలి’ అని రాజ్‌నాథ్‌ అభిలషించారు. భారత రక్షణ ఉత్పత్తి రంగాన్ని మరింతగా పరిపుష్టంచేయడంలో ప్రైవేట్‌ రంగం సైతం తమ వంత భాగస్వామ్యపాత్ర తప్పక పోషించాలని ఆయన సూచించారు. ‘భారత్‌లో ప్రతిభావంతులకు కొదవ లేదు. అలాగే ప్రతిభావంతులకు మంచి డిమాండ్‌ ఉంది. అయితే, ఈ ప్రతిభావంతులను, ‘డిమాండ్‌’ను ఒకే తాటి మీదకు తెచ్చే సరైన వేదికే లేదు. ఐడెక్స్‌ ఇందుకు చక్కని పరిష్కారం’ అని రాజ్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. 

మారుతున్న రక్షణ విధానం
రక్షణ ఉత్పత్తుల హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దేందుకు గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టింది. దేశీయ రక్షణ ఉత్పత్తి రంగంలో అవకాశాలు పెంచేందుకు పలు ఉత్పత్తుల దిగుమతుల విధానానికి వచ్చే మూడేళ్లలోగా స్వస్తిపలకాలని గట్టి నిర్ణయం తీసుకుంది. రవాణా విమానం, తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు, జలాంతర్గాములు, క్రూయిజ్‌ క్షిపణులు, సోనార్‌ వ్యవస్థ ఇలా 101 రకాల ఉత్పత్తులను 2024 ఏడాది తర్వాత భారత్‌ దిగుమతి చేసుకోబోదు. ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలు, చిన్న యుద్ధనౌకలు, వాయుమార్గంలో హెచ్చరిక వ్యవస్థలు, ట్యాంక్‌ ఇంజన్లు, రాడార్లు తదితర 108 రకాల ఉత్పత్తుల దిగుమతులపై నిషేధాన్ని అమల్లోకి తేనుంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top