ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు సొంత మంత్రివర్గం నుంచే వ్యతిరేకతవ్యక్తమవుతోంది.
ముంబై: ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు సొంత మంత్రివర్గం నుంచే వ్యతిరేకతవ్యక్తమవుతోంది. వివిధ కార్పొరేషన్స్‌లో, కమిటీల్లో ఖాళీగా ఉన్న పదవుల్లో సీనియర్ నాయకులను నామినేట్ చేయకుండా, క్షేత్రస్థాయిలో పనిచేసినవారిని స్పెష ల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్‌గా నియమించుకుండా ఎన్నో ఏళ్లుగా జాప్యం చేస్తున్నారంటూ మంత్రులు విమర్శిస్తున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు, అటవీ అభివృద్ధి సంస్థ, రాష్ట్ర ఖాదీ శాఖ, మహిలా ఆర్థిక్ వికాస్ మహామండల్, రాష్ట్ర గనుల శాఖ ఇలా 55 చట్టబద్ధమైన సంస్థలు, బోర్డులు ఉన్నాయని, వాటి లో ఐదారు మినహా మిగిలిన అన్నింటికి అధికారులే నేతృత్వం వహిస్తున్నారని సీనియర్ మంత్రి ఒకరు అన్నారు.
గత ఐదు నుంచి పదేళ్లుగా ఇది రాష్ట్ర వ్యవహారమని ఆయన మండిపడ్డారు. ఇలా రాష్ట్ర సారధ్యంలో నడిచే కార్పొరేషన్లు, బోర్డులకు మంత్రివర్గ హోదా ఉంటుందని, వీటిని సాధారణంగా రాజకీయ నాయకులు నేతృత్వం వహించాల్సి ఉండగా, అన్ని అధికారాలు అధికారులకే ఇచ్చారన్నారు. మాడాకు చివరి పొలిటికల్ ఛైర్మన్ మధు చవాన్ అని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మోహన్‌ప్రకాష్‌కి మధ్య ఉన్న విభేదాల వల్ల నియామకాల్లో జాప్యం జరుగుతోందని మంత్రి అన్నారు.
రాష్ట్ర, జిల్లా, మండలస్థాయి కమి టీ విభాగాలకు అధిపతులను ముఖ్యమంత్రి నియమించలేదు. పేదలు, బడుగు బలహీనవర్గాల ప్రజలకు నిధులు పంపిణీ చేయడం కోసం దాదాపు 120 కమిటీలున్నాయని, ఇవన్నీ ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్నాయని ఆయన తెలి పారు. సంబంధిత దస్తావేజులన్నింటినీ అప్పగించినా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్‌ను ముఖ్యమంత్రి నియమించలేకపోయారని ఆయన విమర్శించారు. ఎంపీఎస్‌సీ ఛైర్మన్ సుధీర ఠాక్రే మే 18న పదవీ విరమణ పొందారని, అయినా ఇప్పటివరకూ ఆ స్థానానికి కొత్తవారిని ఎంపిక చేయలేదన్నారు. మొత్తం ఐదుగురు సభ్యులు ఉండాల్సి ఉండగా, కేవలం ఒక్కరితోనే కమిషన్ నడుస్తోందని, దీని వల్ల పదివేల ఇంటర్వ్యూలు ఆగిపోయాయని మంత్రి తెలిపారు.