మా ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయండి

New Delhi DTC staff demand for permanent jobs - Sakshi

డీటీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర తాత్కాలిక ఉద్యోగుల నిరసన

ఉద్యోగభద్రత లేదని ఆవేదన

న్యూఢిల్లీ: తమ ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌లో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర తాత్కాలిక ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం న్యూఢిల్లీలోని ఐపీ ఎక్స్‌టెన్షన్‌ వద్ద వారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ డీటీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంవత్సరాలు తరబడి పనిచేస్తున్నా తమకు ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని, లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, డీటీసీ దివాలాస్థితిని వెల్లడిçంచిన సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ నివేదికతో కేజ్రీవాల్‌ సర్కారు విమర్శలపాలైంది.

గడిచిన ఐదేళ్లలో డీటీసీ ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిపోయిందని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ పరిశోధన నివేదిక వెల్లడించింది. గత ఐదేళ్లలో డీటీసీ ప్రయాణికులు 35 శాతం తగ్గారని ఈ పరిస్థితి కొనసాగితే 2025 నాటికి డీటీసీ ఖాళీ అవుతుందని నివేదిక హెచ్చరించింది. ఢిల్లీలో ప్రస్తుతం 11 వేల బస్సుల అవసరం ఉండగా దాదాపు ఐదు వేల బస్సులు మాత్రమే నడుస్తున్నాయని 2020 సంవత్సరం వరకు ఢిల్లీలో 15 వేల బస్సుల అవసరం ఉంటుందని నివేదిక తెలిపింది. ఈ నివేదిక వెలువడిన తరువాత ప్రతిపక్షాలు ఆప్‌ సర్కారుపై విమర్శలు తీవ్రం చేశాయి. కేజ్రీవాల్‌ సర్కారు తన మూడు సంవత్సరాల పదవీకాలంలో ఢిల్లీ వాసులకు డీటీసీ ద్వారా విశ్వసనీయమైన పటిష్టమైన ప్రజా రవాణ వ్యవస్థను అందించడంలో విఫలమైందని, 2011–12 తరువాత బస్సులు కొనలేదని ప్రతిపక్షనేత విజేంద్ర గుప్తా ఆరోపించారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top