నాగపూర్‌లో మెట్రో రైలు పట్టాలెక్కడం ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి ఆర్థిక వనరుల సమీకరణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
నాగపూర్ : నాగపూర్‌లో మెట్రో రైలు పట్టాలెక్కడం ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి ఆర్థిక వనరుల సమీకరణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెట్రో రైల్వే మనుగడకు అంతర్గత ఆర్థిక రేటు వసూలు (ఎఫ్‌ఐఐఆర్) ఎనిమిది శాతం ఉండగా, ప్రస్తుతం 0.47 శాతం మాత్రమే ఉంది. దీంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమీక్షించేందుకు, అలాగే ఈ సమస్యను ఎలా అధిగమించాలనే విషయాన్ని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ)ను అడిగి తెలుసుకోవాలని నాగపూర్ అభివృద్ధి సంస్థ (ఎన్‌ఐటీ) కు కేంద్ర పట్టణాభివృద్ధి విభాగం (యూడీడీ) సూచించింది. యూడీ డీ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ ప్రాజెక్టు 2014లో ప్రారంభించి 2019లో పూర్తిచేయడం కష్టంగానే కనిపిస్తోంది. ప్రాజెక్టు నివేదిక పునఃసమీక్షకు మరో రెండు, నెలల సమయం పట్టే అవకాశముంది. అలా గే కేంద్ర పట్టణాభివృద్ధి విభాగం చూపిన పరిష్కార మార్గం ఈ ప్రాజెక్టుపై తీవ్ర ప్రభావం చూపనుంది. వాస్తవానికి సమగ్ర సర్వే తర్వాతనే డీఎంఆర్‌సీ నివేదికను తయారుచేసింది.
అయితే ఇప్పుడు ఈ సమగ్ర ప్రాజెక్టు నివేదికను తిరస్కరించడం ప్రశ్నార్థకంగా మారింది. ఆర్థిక పరిస్థితిపై అనుమానాల నేపథ్యంలోనే నాగపూర్ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్ర పట్టణాభివృద్ధి విభాగం తిరిగి సమగ్ర ప్రాజెక్టు నివేదికను కోరింది. కొద్ది నెలల్లోనే మెట్రో మోడల్‌లో లొసుగులు బయటపడ్డాయి. ఈ సందర్భంగా ఎన్‌ఐటీ అధికారులతో శనివారం ప్రజా రవాణా వ్యవస్థ ప్రత్యేక అధికారి (ఓఎస్‌డీ) ఎస్‌కే లోహియా మాట్లాడుతూ ప్రాజెక్టు సామర్థ్యం పెంచుకోవాలంటే అదనపు ఆదాయాన్ని సమీకరించుకోవాల్సి ఉంటుందన్నారు.ఆదాయాన్ని పెంచుకునేందుకు తగిన మార్గాలను అన్వేషిస్తున్నామన్నా రు. తన గమ్యాన్ని చేరుకునేం దుకు మెట్రో వినియోగదారుడు బస్సుపై అయితే ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించనవసరం లేకుండా చూడాలన్నారు. ఈ విషయమైఎన్‌ఐటీ అధికారులు మాట్లాడుతూ దీనిపై రవాణా సంబంధిత అభివృద్ధి(టీవోడీ) పథకాన్ని రూపొందించామన్నారు. ఈ విషయమై ఎంపీ విలాస్ ముత్తెంవార్ మాట్లాడుతూ ప్రాజెక్టుపై యూడీడీ అనుమానాలను పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నారు. ఢిల్లీ మెట్రోను కూడా మొదటి మూడు నెలల్లో ప్రయాణికులు వినియోగించుకోలేదన్నారు. ప్రస్తుతం ఆ మెట్రోకు స్పందన బాగా పెరిగిందన్నారు.