గవర్నర్ వజుభాయ్ రుడా భాయ్‌వాలాను సీఎం సిద్ధరామయ్య, ప్రధాన విపక్ష బీజేపీ నాయకులు పోటీపోటీగా భేటీ అయ్యారు.
బెంగళూరు : గవర్నర్ వజుభాయ్ రుడా భాయ్‌వాలాను సీఎం సిద్ధరామయ్య, ప్రధాన విపక్ష బీజేపీ నాయకులు పోటీపోటీగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్ష నియామకం గురించి చర్చ జరిగినట్లు సమాచారం. ప్రధాన విపక్షం బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషితో పాటు ఆ పార్టీకి చెందిన నాయకులు యడ్యూరప్ప, శోభకరంద్లాజే తదితరలు శుక్రవారం సాయంత్రం గవర్నర్ వజుభాయ్‌ను రాజ్‌భవన్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అధ్యక్షుడిగా రాజకీయ మూలాలున్న సుదర్శన్ పేరును ప్రభుత్వం సిఫార్సు చేయడం నిబంధనలకు విరుద్ధమని, అందువల్ల ఆ నియామకానికి అంగీకరించకూడదని వారు ఒత్తిడి తీసుకువచ్చారు.
ఇదిలా ఉండగా బీజేపీ నాయకుల ‘భేటీ’ని ముందుగానే తెలుసుకున్న సీఎం సిద్ధరామయ్య వారి కంటే ముందుగానే గవర్నర్‌ను కలిసి సుదర్శన్ పేరును సూచించడానికి గల కారణాలను వివరించారు. ఇలా నిమిషాల వ్యవధిలో ఒకే విషయమై అటు ప్రభుత్వ, ఇటు విపక్ష నాయకులు గవర్నర్‌ను కలవడంతో మరో రెండు.. మూడు రోజుల్లో కేపీఎస్‌సీ అధ్యక్ష నియామకం పై స్పష్టత రానుంది.