దీపావళి సంబరాలు.. కేసులే కేసులు

Many Cases Registered For bursting Crackers In Tamil Nadu - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో దీపావళి సంబరాలు మిన్నంటాయి. టపాసుల కాల్పుల మోతలు హోరెత్తాయి. వరుసగా 5 రోజులు సెలవులు రావడంతో చెన్నై వంటి నగరాల్లో ఉద్యోగరీత్యా, వివిధ పనుల నిమిత్తం ఉన్న వాళ్లంతా తమ స్వగ్రామాలకు రావడంతో గ్రామాల్లో మరింత పండుగ వాతావరణం నెలకొంది. ఇళ్ల వద్ద బాణాసంచా పేల్చుతూ ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు బాణాసంచా పేల్చేందుకు అనుమతి ఇచ్చారు. అయితే కొన్ని చోట్ల యువత నిబంధనలను ఉల్లంఘించింది.

దీంతో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికిపైగా కేసులు నమోదు చేశారు. సొంత పూచికత్తుపై 400 మందిని విడుదల చేశారు. 200 మందిని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. కోయంబత్తూరులో 30 మంది, తిరుప్పూర్‌లో 42 మంది, విల్లుపురంలో 30 మంది, చెన్నైలో 10 మంది, తిరునల్వేలిలో ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. ఈ అరెస్టుల కారణంగా ఆయా ప్రాంతాల్లో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో వారిని బుజ్జగించడం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. చాలా మందిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి హెచ్చరించి వదిలేశారు.

బాలుడు మృతి.. తండ్రిపై కేసు
నమక్కల్‌ జిల్లాలో టపాసుల కారణంగా 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. బాణాసంచా పేలడంతో బాలుడికి ఛాతి దగ్గర గాయమైందని, ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు ప్రాణాలు కోల్పోయాడని వివరించారు. బాలుడి తండ్రి దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. బాలుడి ఇద్దరు మిత్రులు కూడా గాయపడ్డారని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లఘించి బాణాసంచ కాల్చినందుకు బాలుడి తండ్రిపై కూడా కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

‘మోత’ తగ్గింది!
నిర్ణీత సమయంలోనే బాణసంచా కాల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఈ ఏడాది పటాకుల కాల్పుల మోత తగ్గిందని పర్యావరణవేత్త శ్వేత నారాయణ్‌ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి చాలా మంది టపాసులు కాల్పుస్తున్నారని తెలిపారు. దీని గురించి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో రెండు ఫిర్యాదులు చేసినట్టు చెప్పారు. రోజులో ఎప్పుడు బయటకు వెళ్లినా పటాసుల కా‍ల్పుల మోత తప్పడం లేదన్నారు. పోలీసులు కూడా నియంత్రించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కాలుష్య నియంత్రణ మండలి కూడా పర్యావరణ మార్పులను అంచనా వేసేందుకు కసరత్తు చేస్తోంది.

సుప్రీంకోర్టు తీర్పులో ముఖ్యాంశాలివీ..
దీపావళికి ఏడు రోజుల ముందు, ఆ తరవాత గాలి నాణ్యత ఎలా ఉందో కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు పరిశీలించాలి.
దీపావళి రోజు దేశవ్యాప్తంగా రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే టపాసులు కాల్చాలి.
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సమయంలో రాత్రి 11.55 నుంచి 12.30 వరకు (35 నిమిషాలు) మాత్రమే టపాసులు కాల్చాలి.
ఇతర పండుగలకు, వేడుకలకు కూడా ఇవే షరతులు వర్తిస్తాయి.
తక్కువ పొగ వచ్చే బాణసంచా తయారీకి మాత్రమే అనుమతివ్వాలి.
బాణసంచా వల్ల ఏర్పడే కాలుష్యంపై ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలి.  
నిషేధిత టపాసులు అమ్మడం, కాల్చడంపై పోలీసు శాఖ నిఘా పెట్టాలి.
టపాసులు పేల్చడం వల్ల తలెత్తే కాలుష్యంపై పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top