మా నీళ్లను దొంగలించారు సారూ!

Man Alleges Water Theft From Home In Manmad - Sakshi

కరువు నేపథ్యంలో మన్మాడ్‌లో వింతపోకడ

సాక్షి ముంబై: మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి, కరువు కారణంగా నీటి దొంగలు కూడా తయారయ్యారు. నాసిక్‌జిల్లా మన్మాడ్‌లో 300 లీటర్ల నీటిని దుండగులు దొంగిలించారు. మన్మాడ్‌లోని శ్రావస్తినగర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మరికొందరి ఇళ్లలో కూడా ఇలాగే జరిగిందని తెలుస్తోంది. మన్మాడ్‌కు నీటి సరఫరా చేసే జలాశయాల్లో అడుగంటిపోయాయి. దీంతో మన్మాడ్‌లో తీవ్ర నీటి ఎద్దడి సమస్య ఉండటంతో నీటి సరఫరా సుమారు 20 రోజులకు ఒకసారి అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో అనేక మంది డ్రమ్ములతోపాటు ట్యాంకులు కొనుగోలు చేసి నీటిని నిల్వ చేసుకుంటున్నారు. శ్రావస్థినగర్‌లో నివసించే విలాస్‌ ఆహిరే కూడా అందరి మాదిరిగానే ఓ 500 లీటర్ల ట్యాంకు బంగ్లాపై ఉంచి నీటిని నిల్వచేసుకుని వినియోగించుకోసాగారు. అయితే మన్మాడ్‌ మున్సిపాలిటీ కుళాయిలో నీటి సరఫరా చేయడంతో ఆ ట్యాంకును పూర్తిగా నింపుకుని నీటిని నిల్వచేసుకున్నాడు. కానీ,  ఊహించని విధంగా మరుసటి రోజు ఉదయం పరిశీలిస్తే ట్యాంకులోని నీరు దొంగతతనానికి గురైందని తెలిసింది. ఈ ట్యాంకులో నుంచి సుమారు 300 లీటర్లకుపైగా నీటిని ఎవరో దొంగిలించుకుపోయారు. ఈ  విషయంపై మన్మాడ్‌ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆయన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. సదరు నీటి దొంగలను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని విలాస్‌ ఆహిర్‌ కోరారు.  

తీవ్ర కరువు సమీపిస్తోంది!
రాష్ట్రంలో రోజురోజుకి నీటి సమస్య జఠిలమవుతోంది. మరాఠ్వాడా, విదర్బ, పశ్చిమ మహారాష్ట్రతోపాటు అనేక ప్రాంతాల్లో గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. దీంతో అనేక ప్రాంతాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో కరువు తాండవిస్తోంది. మరోవైపు జలాశయాలు, బావులు అడుగంటిపోతున్నాయి. ఊష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో జలాశయాల్లోని నీరు త్వరగా తగ్గుతోంది. పరిణామంగా అనేక ప్రాంతాల్లో సాగునీటితోపాటు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనేక గ్రామాల్లో వివాహాలతోపాటు ఇతర ఏదైనా కార్యాలు చేయాలంటే ప్రజలు భయపడుతున్నారు. నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో అనేక మంది పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకుంటున్నట్టు తెలిసింది. దీన్నిబట్టి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందనేది మనకు స్పష్టం అవుతుంది.  

లాతూరులో సర్పంచిని చితకబాదిన గ్రామస్థులు..
లాతూరు జిల్లాలోని ఓ గ్రామంలో నీటి సమస్య పరిష్కారంపై నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామ సర్పంచిని స్థానిక ప్రజలు చితక బాదారు. ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. లాతూరు జిల్లా హాలసీ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.  మరాఠ్వాడాలోని లాతూర్‌ జిల్లాల్లో నీటి ఎద్దడి సమస్య తీవ్రంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఉన్న నీటి వనరులను కాపాడునేందుకు గ్రామస్థులు, ప్రభుత్వం, అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగానే హాలసీ గ్రామంలో బావుల కోసం ప్రజలందరు కలిసి డబ్బులు జమచేశారు. అయితే ఎన్నికల నియమావలి ఉందంటూ జాప్యం చేస్తూ వచ్చిన హాలసీ గ్రామ సర్పంచిని గ్రామస్థులు వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. అయితే ఏవో సాకులు చెబుతుండటంతో కోపోద్రిక్తులైన గ్రామస్థులు సర్పంచిని చితక బాదారు. ఈ సంఘటన తీవ్ర కలకలంతోపాటు భయాందోళనలను రేకేత్తించింది. నీటి కోసం ఇలా గోడవలు జరగడం ఆందోళన కలిగించే విషయమని పలువురు పేర్కొంటున్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top