అన్నాడీఎంకేను సాగనంపండి: కరుణ


చెన్నై: రైతుల జీవితాలు బాగుపడాలంటే అన్నాడీఎంకే సర్కారును ఇంటికి సాగనంపాలని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అందులోని వివరాలు ఇలావున్నాయి. అన్నాడీఎంకే పాలనలో గత ఐదేళ్లుగా రైతులు అనుభవిస్తున్న వెతలకు, కష్టాలకు కొదువలేదని, రైతులు తీసుకున్న ఏడు వేల కోట్ల రూపాయల సహకార వ్యవసాయ రుణాలన్నీ 2006 డీఎంకే రాష్ట్రంలో అధికారం చేపట్టినపుడు మాఫీ చేసేందుకు జీవో జారీ చేశామని, ఆ కారణంగా రాష్ట్రంలో వున్న 22 లక్షల 40 వేల 739 మంది రైతు కుటుంబాలు లబ్ధిపొందాయన్నారు.


రైతుల పంట రుణాల వడ్డీ  అన్నాడీఎంకే పాలనలో 2005-06లో తొమ్మిది శాతం ఉండగా రైతుల శ్రేయస్సు కోసం 2006-07లో డీఎంకే పాలనలో ఏడు శాతంగా తగ్గించబడిందన్నారు. గత కొన్ని రోజుల క్రితం తంజావూరు జిల్లాలో అధిరామపట్టణంకు చెందిన బాలన్ అనే రైతు  ట్రాక్టర్ వాయిదా సొమ్మును బాకీ వున్నట్లు తెలిపి పోలీసులు, గూండాల ద్వారా తీవ్రంగా దాడికి గురయినట్లు పేర్కొన్నారు. అదే విధంగా అరియలూరు సమీపాన అళగర్ అనే రైతు పంట రుణాన్ని చెల్లించలేని స్థితిలో క్రిమిసంహారక మందును సేవించి మృతిచెందాడనే వార్త వెలువడగానే 13మార్చి 2016లో తాను విడుదల చేసిన ప్రకటనలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడకూడదని, త్వరలో అధికారం మార్పు తథ్యమని, రైతుల శ్రేయస్సును కోరే ప్రభుత్వం  ఏర్పడుతుందని తెలిపినట్లు పేర్కొన్నారు.


గత 2011 అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతుల ఆదాయం మూడింతలుగా పెరుగుతుందని అన్నాడీఎంకే తెలిపిందని, అయితే రైతుల రుణాలే మూడింతలుగా పెరిగాయని తెలిపారు. ఐదేళ్ల అన్నాడీఎంకే పాలనలో 2,423 మంది రైతులు  ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలిపారు. ఈ స్థితిలో ఏప్రిల్ ఐదవ తేదీన రాష్ట్రస్థాయిలో రైలు రోకో ఆందోళన జరుపనున్నట్లు తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే పార్టీ విజయం సాధించేందుకు అందరూ కృషిచేయాలని కోరారు. దీంతో రైతుల శ్రమలు తొలగిపోయి, జీవితాల్లో సంతోషం వెల్లివిరుస్తుందని పేర్కొన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top