నగరంలో మాదకద్రవ్యాలకు బానిసలైన నిరాశ్రయుల కోసం డ్రగ్ డి-ఎడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం నగరంలో
న్యూఢిల్లీ: నగరంలో మాదకద్రవ్యాలకు బానిసలైన నిరాశ్రయుల కోసం డ్రగ్ డి-ఎడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం నగరంలో ఉన్న నైట్ షెల్టర్లలో కనీస సౌకర్యాల లేమిపై ఇప్పటికే ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డ్ (డీయూఎస్‌ఐబీ) అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే నైట్ షెల్టర్లలో ఆశ్రయం తీసుకుంటున్న చాలామంది ఆహార పదార్థాలను దుర్వినియోగం చేస్తున్నారని, అలాగే పలువురు నిరాశ్రయులు తాగి వచ్చి షెల్టర్లలో వాంతులు చేసుకుంటున్నారని, దాంతో అక్కడ అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయని డీయూఎస్‌ఐబీ డెరైక్టర్ (నైట్ షెల్టర్స్ ఆస్తుల నిర్వహణ) కమల్ మల్హోత్రా తెలిపారు. అలాగే షెల్టర్‌లో ఉండే ఇతరులతో గొడవలకు దిగుతుండటంతో భద్రతా సమస్యలు ఏర్పడుతున్నాయని ఆయన చెప్పారు.
ఈ నేపథ్యంలో డ్రగ్స్ బానిసలైన నిరాశ్రయుల నిమిత్తం 500 పడకల డ్రగ్ డి-ఎడిక్షన్ సెంటర్ ఏర్పాటు ఏర్పాటుచేసి, తగిన వైద్య సదుపాయాలు, మానసిక కౌన్సెలింగ్ ఇవ్వడానికి తగిన నిధులు సమకూర్చాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు ప్రతిపాదనలు పంపామన్నారు. నగరంలోని సెంట్రల్ ఢిల్లీ, కాశ్మీరీ గేట్ సమీపంలోని యమునా పుస్థా నైట్ షెల్టర్లలో తాగుబోతుల బెడద ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి అశ్విని కుమార్ మాట్లాడుతూ.. డ్రగ్ డి-ఎడిక్షన్ సెంటర్ ఆవశ్యకత ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. ఒక్కొక్కసారి రాత్రి వేళల్లో షెల్టర్లలో తాగుబోతులు, మాదకద్రవ్యాలు తీసుకుని వచ్చినవారు గందరగోళం సృష్టిస్తారన్నారు.
వారి వల్ల ఇతరులు చాలా ఇబ్బంది పడుతుంటారని, అయినా షెల్టర్ నిర్వాహకులు ఏం చేయలేని పరిస్థితులు ఉంటాయని తెలిపారు. కాగా, ప్రస్తుతం కోట్ల ముబారక్‌పూర్‌లో ఉన్న నైట్ షెల్టర్ ఆశ్రయుల కోసం 30 పడకల డి-ఎడిక్షన్ సెంటర్ నడుస్తోంది. నగరంలో మొత్తం 219 నైట్ షెల్టర్లు నడుస్తున్నాయి. సుమారు 15 వేల మంది ఆశ్రయం పొందుతున్నారు. ఆయా షెల్టర్లను డీయూఎస్‌ఐబీ అధికారులురోజూ పర్యవేక్షిస్తుంటారు.