రాష్ట్రీయ బాల స్వస్థకు వైద్యుల నియామకం | doctors appointed for state bala swasta in srikakulam | Sakshi
Sakshi News home page

రాష్ట్రీయ బాల స్వస్థకు వైద్యుల నియామకం

Sep 29 2016 10:59 AM | Updated on Sep 2 2018 4:52 PM

రాష్ట్రీయ బాల స్వస్థకు 54 మంది వైద్యులతో పాటు 36 వైద్య బృందాలను నియమించారు.

► జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి 
డాక్టర్‌ సనపల తిరుపతిరావు వెల్లడి

శ్రీకాకుళం: రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం కోసం జిల్లాలో 54 మంది వైద్యులతో పాటు 36 వైద్య బృందాలను నియమించినట్టు జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సనపల తిరుపతిరావు అన్నారు. లావేరు మండలంలోని మురపాక, లావేరు గ్రామాల్లోని పీహెచ్‌సీలు ఆయన బుధవారం సందర్శించారు. వైద్యుల హాజరు పట్టికలను, మందుల నిల్వ రికార్డులను పరిశీలించారు. 
 
వైద్యసేవలపై వైద్యాధికారి మంజీర, ఫార్మాసిస్టు అలివేణిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బాల స్వస్థకు నియమించిన ఒక్కో బృందంలో వైద్యుడు, ఏఎన్‌ఎం, ఫార్మాసిస్టులు ఉంటారన్నారు. వారికి కేటాయించిన మండలాల్లో వారు పర్యటించి పాఠశాల విద్యార్థులకు వైద్యపరీక్షలు చేస్తారని చెప్పారు. జిల్లాలోని రేగిడి మండలంలోని బూరాడ, రణస్థలం మండలంలోని రావాడ, జలుమూరు మండలంలోని సవిరిగాం, సంతకవిటి మండలంలోని మండాకురిటి, జి.సిగడాం మండలంలోని బాతువ గ్రామాలకు కొత్తగా పీహెచ్‌సీలు మంజూరయ్యాయన్నారు. బాతువ, భూరాడ, రావాడ పీహెచ్‌సీ భవనాల పనులు ప్రారంభమయ్యాయన్నారు. 
 
ఈ పీహెచ్‌సీలకు ఒక మహిళ, ఒక పురుష వైద్యాధికారులతో పాటు ఒక ఫార్మాసిస్టు, ల్యాబ్‌ టెక్నీషీయన్, ముగ్గురు స్టాఫ్‌ నర్సుల చొప్పున నియామకానికి నోటిఫికేషన్‌ ఇచ్చామన్నారు. జిల్లాలో 17 డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వెల్లడించారు. జిల్లాలో ఈ ఏడాది 61 డెంగీ కేసులు, 539 మలేరియా కేసులు నమోదయ్యాయన్నారు. ఆయన వెంట మురపాక పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్‌ మంజీర, ఈవో సోమేశ్వరరావు, లావేరు పీహెచ్‌సీ ల్యాబ్‌ టెక్నీషియన్‌ అమరావతి, ఫార్మాసిస్టు అలివేణి, స్టాఫ్‌నర్సు ఆశ్విని తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement