విద్యుత్ వినియోగదారులకు ఊరట


న్యూఢిల్లీ: సర్దుబాటు చార్జీల పేరుతో నగరవాసులపై భారం మోపేందుకు ప్రయత్నించిన డిస్కంలకు చుక్కెదురైంది. మరో రెండు నెలలపాటు ప్రస్తుతం కొనసాగిస్తున్న విధంగానే చార్జీలు వసూలు చేయాలని ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి(డీఈఆర్‌సీ)ఆదేశించింది. జూలైలో వార్షిక టారిఫ్ విధానాన్ని మరోసారి సమీక్షిస్తామని చెప్పింది. ప్రస్తుతం సర్దుబాటు చార్జీల పేరుతో బీఎస్‌ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్ 6 శాతం, టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 7 శాతం, బీఎస్‌ఈఎస్ యమున పవర్ లిమిటెడ్ 8 శాతం వసూలు చేస్తున్నాయి. మరో రెండు నెలలపాటు కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని డిస్కంలను డీఈఆర్‌సీ ఆదేశించింది. గత మూడు నెలలుగా ఇవే చార్జీలను వసూలు చేస్తున్నామని, టారిఫ్‌ను 14 నుంచి 15 శాతం పెంచాలని డిస్కంలు డీఈఆర్‌సీని కోరడంతో అందుకు తిరస్కరిస్తూ మరో రెండు నెలల తర్వాత వార్షిక టారిఫ్ విధానాన్ని సమీక్షిస్తామని తెలిపింది.

 

 రూ. 2.95 పెరిగిన సీఎన్జీ

 నగరంలో సీఎన్జీ ధర రూ. 2.95 పెరిగింది. ప్రస్తుతం కిలో సీఎన్జీ ధర రూ.35.20 ఉండగా  నేటి నుంచి రూ. 38.15 వెచ్చించి కొనాల్సి ఉంటుంది.  పీఎన్జీ ధర కూడా యూనిట్‌కు రూపాయి చొప్పన పెరిగింది. ఉత్తరప్రదేశ్‌లో పన్నుల విధానమే వీటి ధర పెరగడానికి కారణమని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. విద్యుత్ బిల్లులు పెరగవంటూ డీఈఆర్‌సీ ప్రకటించిన విషయంపై సంతోష పడేలోపే ఇలా సీఎన్జీ, పీఎన్జీ భారం పడడంపై నగరవాసుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీఎన్జీ ధరలను తగ్గించాలని పలు ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top