మెట్రో భద్రత ఢిల్లీ పోలీసుల చేతుల్లోకి!? | Delhi Police may handle Metro security | Sakshi
Sakshi News home page

మెట్రో భద్రత ఢిల్లీ పోలీసుల చేతుల్లోకి!?

Apr 16 2014 11:33 PM | Updated on Oct 16 2018 5:04 PM

దేశరాజధానిలోని మెట్రో రైల్వే వ్యవస్థ భద్రత బాధ్యత ఢిల్లీ పోలీసుల చేతుల్లోకి పోనుందా? తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది.

న్యూఢిల్లీ: దేశరాజధానిలోని మెట్రో రైల్వే వ్యవస్థ భద్రత బాధ్యత ఢిల్లీ పోలీసుల చేతుల్లోకి పోనుందా? తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. పారామిలటరీ దళమైన సీఐఎస్‌ఎఫ్ బలగాల కంటే ఎక్కువ యంత్రాంగమున్న సిటీ పోలీసులే ఢిల్లీ మెట్రోకు సరైన భద్రత ఇవ్వగలరని పట్టణాభివృద్ధి శాఖ చెప్పినట్టు అధికారి ఒకరు తెలిపారు. శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి.. సమగ్రత, సమన్వయం, రద్దీ నిర్వహణ, శాంతిభద్రతల అంశాల దృష్ట్యా భద్రతా విధులను స్థానిక పోలీసులకు కేటాయించడమే మంచిదని పట్టణాభివృద్ధి శాఖ హోంశాఖకు తెలిపింది. నగరంలోని 129 మెట్రో స్టేషన్లలో భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) పర్యవేక్షిస్తోంది. ఐదు వేలమంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది మెట్రో స్టేషన్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే మెట్రో రైళ్లు, స్టేషన్ల చుట్టుపక్కల ఆవరణలో జరిగిన నేరాలకు సంబంధించిన కేసులను ఢిల్లీ పోలీసులే పర్యవేక్షిస్తున్నారు.
 
 అయితే ఈ కేసులను విచారణ చేయడానికి మెట్రోల్లో ఢిల్లీ పోలీసు సిబ్బంది సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. మెట్రో భద్రత ఢిల్లీ పోలీసుల చేతుల్లోకి వెళ్లినట్లయితే తక్షణ చర్యలకు అవకాశముందని పట్టణాభివృద్ధి శాఖ భావిస్తోంది. మెట్రో మాత్రం పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఉండగా.. ఆయా స్టేషన్స్‌లో మోహరించిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి వేతనాలిస్తున్నది హోంశాఖ. ‘ఒక్క వేతనాల విషయమే కాదు... ఏదేనా నేరం జరిగినప్పుడు విచారణ జరిపే అధికారం సీఐఎస్‌ఎఫ్‌కు లేదు. చిన్నస్థాయి నేరాలనుంచి ఉగ్రవాదుల బెదిరింపుల వరకు అవగతం చేసుకునే విషయంలో కూడా సీఐఎస్‌ఎఫ్ బలహీనంగా ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులకు మెట్రో బాధ్యతలివ్వడం మంచిది. మొత్తం భద్రత ఢిల్లీపోలీసుల చేతుల్లోకి రావడంవల్ల మరింత ప్రభావముంటుందంటున్నారు ఢిల్లీ పోలీసు మాజీ కమిషనర్ బి.కె.గుప్తా.
 ఢిల్లీ పోలీసుల ప్రమేయం లేకుండా మెట్రో స్టేషన్లలో చోటు చేసుకునే నేరాలపై చర్యలు తీసుకోవడం మరింత జాప్యానికి కారణమవుతోందని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ‘ఈ ఏడాది మొదటినుంచి ఏప్రిల్ 10వరకు ఢిల్లీ మెట్రోలో 806 కేసులు నమోదయ్యాయి.
 
 గతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. రైల్లో ప్రయాణిస్తుండగా ఏదైనా నేరం జరిగితే... మెట్రోస్టాఫ్‌కు లేదా 100 డయల్ చేసి కంట్రోల్ రూమ్‌లో ఫిర్యాదు చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. తరువాతి స్టేషన్‌లో రైలు ఆగినప్పుడు మెట్రో సిబ్బందిని కలిసి బాధితులు ఫిర్యాదు చేస్తే ... దాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లకు తెలియచేస్తోంది మెట్రో. ఇదంతా చాలా ఆలస్యానికి కారణమవుతోంది’ అంటున్నారాయన. పట్టణాభివృద్ధిశాఖ సూచనలను హోంశాఖ ఆమోదించి... అంతా అనుకున్నట్టుగా జరిగితే మెట్రోలో నేరాలకు చెక్ పడటమే కాదు... ఫిర్యాదులపై వెంటనే స్పందించి సత్వర చర్యలు తీసుకునే అవకాశముందంటున్నారు ప్రజలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement