ప్రచారంలో బీజేపీ హైటెక్ హంగులు | Delhi launch 3-D video campaign for assembly elections | Sakshi
Sakshi News home page

ప్రచారంలో బీజేపీ హైటెక్ హంగులు

Nov 12 2013 12:04 AM | Updated on Mar 29 2019 9:18 PM

విధానసభ ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రచారాన్ని ముమ్మరం చేసింది బీజేపీ. వీలైనంత తక్కువ కాలంలో ఎక్కువ మంది ఓటర్లను చేరుకోవడంతోపాటు

 సాక్షి, న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రచారాన్ని ముమ్మరం చేసింది బీజేపీ. వీలైనంత తక్కువ కాలంలో ఎక్కువ మంది ఓటర్లను చేరుకోవడంతోపాటు వారిని ఆకట్టుకునేలా త్రీడీ వాహనాన్ని సిద్ధం చేశారు. ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో సోమవారం ఉదయం ఈ వాహనాన్ని బీజేపీ నగర అధ్యక్షుడు విజయ్‌గోయల్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ సీఎం అభ్యర్థి డా.హర్షవర్ధన్, విధానసభ ప్రతిపక్ష నాయకుడు విజయ్‌కుమార్ మల్హోత్రా తదితరులు పాల్గొన్నారు.
 
 మోడీని చేరువ చేసేందుకు:
 బీజేపీ నాయకులు ప్రారంభించిన త్రీడీ వాహనంలోని స్క్రీన్లపై బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ప్రసంగాలను ప్రసారం చేయాలని స్థానిక బీజేపీ నాయకులు భావిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో నరేంద్రమోడీ ప్రత్యేక ఆకర్షణగా నిర్వహించిన విశాల్ ర్యాలీకి ఢిల్లీలోని వివిధ వర్గాలతోపాటు యువత నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. విశాల్ ర్యాలీ సమయంలోనూ నగరవ్యాప్తంగా ఎల్‌సీడీ స్క్రీన్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరోమారు ఇదే విధానాన్ని బీజేపీ నాయకులు ఎంచుకున్నారు. పదేపదే నమో ప్రసంగాలు ప్రసారం చేయడంతో యువతను తమవైపు తిప్పుకోవడానికి త్రీడీ ప్రచార రథం ఎంతో ఉపయోగపడుతుందని బీజేపీ సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
 
 గ్రామీణ ప్రాంతాలపై నిర్లక్ష్యం:
 త్రీడీ వాహనాన్ని ఆవిష్కరించిన అనంతరం విజయ్‌గోయల్ పత్రికా విలేకరులతో మాట్లాడారు. పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలనలో ఢిల్లీలోని గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా పాలకుల నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాదిమంది ప్రజలు నేటికీ కనీస సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు, తాగునీరు, విద్యుత్ సరఫరా తదితర సదుపాయాలు ఏవీ అభివృద్ధి చేయలేదన్నారు. కొన్ని ప్రాంతాల్లో కనీసం మరుగుదొడ్డి సదుపాయలూ లేవన్నారు. రైతులకు వాగ్ధానాలు చేసినట్టు భూములు పంచడంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసగించిందన్నారు.
 
 రైతుల భూములను లాక్కున్న డీడీఏ వారికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి సహాయం ఇవ్వలేద ని ఆరోపించారు. ఎన్నికల అనంతరం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన వెంటనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఢిల్లీ సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని పేర్కొన్నారు. బీడు భూములపై రైతులకు హక్కులు కల్పిస్తామన్నారు. ల్యాండ్ రిఫార్మ్స్ చట్టాలు 33, 81ల్లో అవసరమైన సవరణలు చేస్తామన్నారు. దీంతో రైతులకు సరైన నష్టపరిహారంతోపాటు భూములను అమ్మే, కొనే హక్కు లభిస్తుందన్నారు. 15 ఏళ్లలో ఢిల్లీ పరిసరాల్లోని గ్రామాలు ఎంతో వెనుకబడ్డాయని గోయల్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని గ్రామీణ ప్రాంతవాసులకు పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement