ఇంటికెళ్తారు జాగ్రత్త! | cm siddaramaiah warns to officers | Sakshi
Sakshi News home page

ఇంటికెళ్తారు జాగ్రత్త!

Jun 15 2016 11:26 AM | Updated on Sep 4 2017 2:33 AM

ఇంటికెళ్తారు జాగ్రత్త!

ఇంటికెళ్తారు జాగ్రత్త!

అభివృద్ధి పనులు నత్తనడకన సాగడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అధికారులపై మండిపడ్డారు.

  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
  అధికారులపై సీఎం  సిద్ధరామయ్య గరం గరం
  పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు


బెంగళూరు: అభివృద్ధి పనులు నత్తనడకన సాగడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అధికారులపై మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇంటికి పంపుతామని ఘాటుగా హెచ్చరించారు. వర్షాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నగరంలో రోడ్లు, డ్రెయినేజీ ఇతర సౌకర్యాలను మెరుగుపరిచే చర్యలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంగళవారం సీఎం నగరంలో విస్తృతంగా పర్యటించారు. వివిధ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలించారు. 

క్యాంపు కార్యాలయం కృష్ణా నుంచి బయల్దేరిన ఆయన తొలుత మైసూరు రోడ్డులోని బాలగంగాధర నాథస్వామి ఫ్లైఓవర్ ద్వారా విక్టోరియా ఆస్పత్రికి వెళ్లేందుకు ఆంబులెన్స్‌ల కోసం చేపట్టిన ప్రత్యేక రహదారి పనులను పరిశీలించారు. అనంతరం మైసూరు రోడ్డులోని  42 కిలోమీటర్ల పొడవునా ఉన్న రాజకాలువలో పూడికను తీయడం, ప్రహరీ గోడ నిర్మాణం పనుల వివరాలను మేయర్ మంజునాథ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.  గాలి ఆంజనేయ స్వామి ఆలయంలోకి వర్షపు నీరు ప్రవేశించకుండా రూ.5కోట్లతో చేపట్టిన పనులను పరిశీలించారు. ఇదే సందర్భంలో గాలి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాయండనహళ్లి జంక్షన్, హెణ్ణూరులోని ట్రీ పార్క్, కె.ఆర్.పురం ప్రాంతాల్లో పర్యటించారు. 

హెణ్ణూరు జంక్షన్‌లో చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘గత నెలలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు పనులు ఎలా ఉన్నాయో, ఇప్పుడు కూడా అదే దశలో ఉన్నాయి, ఎందుకు పనులు వేగవంతంగా సాగడం లేదు? భూ స్వాధీన ప్రక్రియ ఎందుకు ఇంత ఆలస్యంగా సాగుతోంది’ అంటూ బీడీఏ భూస్వాధీన అధికారి వసంతకుమార్‌పై సిద్ధరామయ్య మండిపడ్డారు.  పనులకు అవసరమైన భూ స్వాధీన ప్రక్రియను మరో నెల రోజుల్లోగా పూర్తి చేయకపోతే అధికారిని విధుల నుండి తప్పించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే 13 మంది నుంచి భూమిని సేకరించామని, మరికొంత మంది మాత్రం తమ భూమిని ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదని వసంత్‌కుమార్ సమాధానమిచ్చారు. కాగా, సీఎం నగర పర్యటన కారణంగా మంగళవారం ఉదయం వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement