
మాట ఘనం... ఆచరణ శూన్యం
ఆర్థిక శాఖ బాధ్యతలు సైతం నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తుతం బడ్జెట్ తయారీలో తలమునకలై ఉన్నారు.
సిద్ధు గత బడ్జెట్ మాయాజాలం
కేటాయింపుల్లో ఖర్చైనది 40-50శాతం మాత్రమే
అమల్లోకి రాని పథకాలు ఎన్నో
బెంగళూరు: ఆర్థిక శాఖ బాధ్యతలు సైతం నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తుతం బడ్జెట్ తయారీలో తలమునకలై ఉన్నారు. ఈనెల 13న పదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధరామయ్య సన్నద్ధమవుతున్నారు. మరి ఈ సందర్భంలో గత బడ్జెట్‌లో ప్రకటించిన కార్యక్రమాల అమలును ఓ సారి పరిశీలిస్తే ‘చెప్పింది చాలా....చేసింది డొల్ల’ అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2014-15 బడ్జెట్‌లో సిద్ధరామయ్య ప్రకటించిన వివిధ పథకాలు ఏడాది పూర్తవుతున్నా ఇప్పటికీ కనీసం ప్రారంభం కూడా కాలేదు. మరోవైపు వివిధ అభివృద్ధి పనులకు గాను ఆయా శాఖలకు కేటాయించిన నిధులు కూడా కేవలం 40 నుంచి 50శాతం మాత్రమే ఖర్చయ్యాయంటే పధకాల అమలు తీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పీయూసీ, విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం గత బడ్జెట్‌లో ఉచిత ల్యాప్‌టాప్‌లను అందజేసే పథకాన్ని ప్రకటించారు.
అయితే ఈ పథకం అమలుకు వేలాది కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అధికారులు తెలపడంతో ఇది కాస్తా కేవలం బడ్జెట్ కాగితాలకు మాత్రమే పరిమితమైంది. ఇక మలెనాడుతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని రైతులకు పంట నష్టం జరిగిన సందర్భాల్లో సరైన పరిహారాన్ని అందించేందుకు గాను ‘పునఃశ్చేతన’ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించిన సిద్దు సర్కారు అనంతరం ఆ వైపు దృష్టి సారించనే లేదు. అంతేకాదు విభిన్న ప్రతిభావంతులైన వారికి స్వయం ఉపాధిని కల్పించే ఆశాకిరణ వంటి అనేక కార్యక్రమాలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. కావేరి, కబని నదులకు అనుసంధానమైన కాలువల పునరుద్ధరణతో పాటు ఇతర నదీ కాలువల పునరుద్ధరణకు గాను కేటాయించిన నిధుల్లో ఇప్పటికీ 50వేల కోట్ల రూపాయలు ఖర్చుకాకుండానే మిగిలిపోయాయి.
నగర అభివృద్ధి సైతం శూన్యం....
ఇక 2014-15 బడ్జెట్‌లో బెంగళూరు అభివృద్ధికి గాను రూ.1,527 కోట్లను కేటాయించారు. నగరంలోని వివిధ రోడ్ల అభివృద్ధికి గాను రూ.300కోట్లు, స్కైవాకర్, ఫ్లైఓవర్,అండర్‌పాస్, ఫుట్‌పాత్‌లు, రైల్వే క్రాసింగ్‌ల నిర్మాణానికి రూ.300కోట్లు, చాళుక్య సర్కిల్ నుంచి హెబ్బాళ వరకు సిగ్నల్‌ఫ్రీ రోడ్ నిర్మాణానికి రూ.200కోట్లను కేటాయించారు. కానీ ఈ నిధుల్లో కేవలం 40శాతం మాత్రమే ఖర్చయి మిగతా 60శాతం నిధులు అలాగే మిగిలిపోయాయి. దీంతో నగర అభివృద్ధి సైతం అనుకున్న స్థాయిలో జరగలేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం కేటాయించిన నిధుల్లో కేవలం 40 నుంచి 50శాతం వరకు మాత్రమే ఖర్చయ్యాయని గణాంకాలే చెబుతున్నాయి. ఇక మిగిలిన నిధులు ఈనెల 31లోపు ఖర్చయ్యే అవకాశం లేకపోవడంతో మిగిలిన నిధులు తిరిగి రాష్ట్ర ఖజానాకే చేరనున్నాయి.