అదనపు సొబగులు | Chennai airport level raised | Sakshi
Sakshi News home page

అదనపు సొబగులు

Aug 28 2015 2:49 AM | Updated on Oct 22 2018 8:31 PM

భారతదేశంలోనే ప్రముఖమైనదిగా పేరుగాంచిన చెన్నై విమానాశ్రయం తన స్థాయిని మరింతగా పెంచుకోనుంది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశం

 చెన్నై ఎయిర్‌పోర్టు స్థాయిపెంపు
 రూ.2,300 కోట్లు మంజూరు
 విమానాశ్రయంలో
 సౌర విద్యుత్ ప్లాంట్

 
 భారతదేశంలోనే ప్రముఖమైనదిగా పేరుగాంచిన చెన్నై విమానాశ్రయం తన స్థాయిని మరింతగా పెంచుకోనుంది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశం సందర్భంగా అదనపు సొబగులు అద్దుకోనుంది. విమానాశ్రయ స్థాయి పెంపునకు కేంద్రం రూ.2,300 కోట్లు మంజూరు చేసింది.
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి : ప్రస్తుతం చెన్నై విమానాశ్రయం ఏడాదికి 1.4 కోట్ల ప్రయాణికుల సేవలందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిని 3 కోట్లకు పెంచాలని మూడేళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడి విమానాశ్రయాన్ని ప్రయివేటీకరణ చేయాలని ఇండియన్ ఎయిర్‌లైన్స్ అథారిటీ భావిస్తున్న తరుణంలో ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టేశారు. అయితే ఇప్పట్లో ప్రయివేటీకరణకు అవకాశం లేకపోవడంతో మూడేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయం మళ్లీ తెరపైకి వచ్చింది. విమానాశ్రయ స్థాయి పెంపు పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,300 కోట్లు మంజూరు చేసింది. తొలి విడతగా రూ.1000 కోట్లను విడుదల చేసింది.
 
  ఈ పనులపై అంతర్జాతీయస్థాయిలో టెండర్లను పిలవాలని, రెండు లేదా మూడు నెలల్లోగా పనులు ప్రారంభించాలని ఉన్నతాధికారులు ఎయిర్ ఇండియా అథారిటీ తీర్మానించింది. విమానాశ్రయ స్థాయిపెంపు పనులు మూడేళ్లలోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.అంతర్జాతీయ పెట్టుబడుల సమావేశం: చెన్నైలో వచ్చేనెల అంతర్జాతీయ పెట్టుబడుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రపంచం నలుమూలల నుండి నాలుగువేల మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
 
  రాష్ట్ర ప్రభుత్వ చొరవతో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు విమానాశ్రయంలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు అందాయి. ప్రతినిధులను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించేందుకు వీలుగా విమానాశ్రయంలో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. విమానాశ్రయ ముఖద్వారాన్ని అత్యాధునిక పద్ధతిలో మెరుగులుదిద్ది రెండేళ్ల క్రితం ప్రారంభించారు. అయితే ఇక్కడి సీలింగ్‌లోని అద్దాలు తరచూ పడటం వంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సంఘటనలు పునరావృతం కాకూడదని అధికారులు ఆదేశించారు.
 
 దేశంలో 19 వ స్థానం
 ప్రపంచంలో 59 పేరొందిన విమానాశ్రయాలు ఉండగా, చెన్నై విమానాశ్రయానికి 19వ స్థానం దక్కింది. స్థాయి పెంపుపనులతో విమానాశ్రయ ప్రస్తుత రూపురేఖలు దెబ్బతినకుండా అదనపు సొబగులు అద్దనున్నారు. తమిళ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిభింబించేలా రాష్ట్ర పర్యాటకశాఖ నేతృత్వంలో తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, విమానాశ్రయంలోని పైకప్పు భాగాన్ని సౌరశక్తి ఉత్పత్తికి వినియోగించనున్నట్లు విమానాశ్రయ జనరల్ మేనేజర్ రాజు తెలిపారు. సౌరశక్తి పనులు వచ్చే ఏడాది జూలైలోగా ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే నేలపై కూడా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement