వైరల్ : ఈ కుక్క మాములుది కాదండోయ్

చెన్నై : సాధారణంగా కుక్కలు విశ్వాసానికి మారుపేరుగా ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఒక కుక్క చెన్నైలోని పార్క్ టైన్ రైల్వే స్టేషన్‌లో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రయాణికులపై అరుస్తూ పోలీసులను అప్రమత్తం చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖ తమ ట్విటర్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్న ఈ కుక్క పోలీసులకు చెందిన జాగిలం అనుకుంటున్నారా.. కానీ అక్కడే ఉంది అసలు విషయం. అదేంటంటే.. దీనిని పెంచుకున్న యజయాని కొన్నిరోజులు క్రితం రైల్వే స్టేషన్‌లో వదిలివెళ్లారు. అప్పటినుంచి ఈ పెంపుడు కుక్క స్టేషన్‌లో ప్రయాణికులు పెట్టే ఆహారం తింటూ .. ప్రమాదాల బారీ నుంచి అప్రమత్తం చేస్తుంది. ' ఈ కుక్క చాలా తెలివైనది. రైలు వస్తుండగా ట్రాక్ దాటాలని ప్రయత్నిస్తున్న వారిపై, కదులుతున్న రైలు నుంచి దిగడం లేదా ఎక్కేవారిపై , ఫుట్‌బోర్డు మీద నిలబడి ప్రయాణం చేసేవారిపై అరుస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుందని ' ప్రయాణికుడొకరు తెలిపారు. ఇన్ని రోజలుగా రైల్వే స్టేషన్‌లో ఉంటున్నఈ పెంపుడు కుక్క ఎవరికి ఏ హానీ తలపెట్టలేదని రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ సిబ్బంది తెలిపింది. అయితే వీడియో చూసిన పలువురు నెటిజన్లు కుక్క చేస్తున్న పనికి మెచ్చుకుంటున్నారు. అయితే ప్రయాణికులను అప్రమత్తం చేయబోయి సదరు కుక్క ప్రమాదం బారీన పడుతుందేమోనని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి