నిధుల దాతల వివరాలు వెల్లడించాలి


 న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీకి నిధులు అందజేసే దాతల వివరాలు వెల్లడిస్తామని, భారతీయ జనతా పార్టీ కూడా ఆ పార్టీకి నిధులు అందజేసే దాతల వివరాల జాబితాను వెల్లడించాలని ఆమ్‌ఆద్మీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఎన్‌జీవోస్ నిధులను ఆప్ నాయకులకు మళ్లిస్తున్నారని బీజేపీ చేసిన ఆరోపణలపై ఆప్‌నేతకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బీజేపీపై పరువు నష్టం కేసు పెట్టినట్లు అరవింద్ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆప్ నిధుల విషయమై బీజేపీ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలకు మీడియా అధిక ప్రాధాన్యతను ఇస్తోందని అన్నారు. పార్టీకి నిధులు అందజేసే దాతల వివరాలను పారదర్శకంగా వెల్లడించిన మొదటి రాజకీయ పార్టీ ఆప్ అని, ఈ విషయానికి   మీడియా ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.

 

 బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా నిధుల అందజేసే దాతల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ‘ తమ దాతలను రెచ్చగొట్టేందు బీజేపీ ప్రయత్నిస్తోంద’ని ఆప్ నేత ట్విట్టర్‌లో అభిప్రాయపడ్డారు. ‘ఆప్‌నేతతో కలిసి వ్యాపారుల భోజనం’ అనే కార్యక్రమానికి హాజరైన సభ్యులు ఒకొక్కరు ప్రవేశ రుసుం కింద రూ.20,000ల అందజేశారని, మొత్తంగా 50 లక్షలు ఈ కార్యక్రమానికి వచ్చాయని చెప్పారు. అదే విధంగా ఇటీవల ముంబైలో కూడా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రూ. 91 లక్షలు అందాయని, రెండు కార్యక్రమాలకు గాను రూ. 1.41 కోట్ల నిధులు సేకరించామని చెప్పారు. ఎన్‌జీవో నిధులను ఆప్ నాయకులకు మళ్లిస్తున్నట్లు బీజేపీ ఆరోపిస్తూ, నిధుల సేకరణకు నిర్వహించిన కార్యక్రమాలపై దర్యాప్తు చేయించాలని ఇటీవల డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top