రేషన్‌కు ఆధార్ అనుసంధానం | Aadhaar linked resan | Sakshi
Sakshi News home page

రేషన్‌కు ఆధార్ అనుసంధానం

Sep 20 2013 3:49 AM | Updated on Sep 1 2017 10:51 PM

చౌకధరల దుకాణాల ద్వారా అర్హులకు మాత్రమే వస్తువులు అందజేయాలనే ఉద్దేశంతో రేషన్ కార్డుకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయనున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్‌గుండూరావ్ వెల్లడించారు.

సాక్షి, బెంగళూరు : చౌకధరల దుకాణాల ద్వారా అర్హులకు మాత్రమే వస్తువులు అందజేయాలనే ఉద్దేశంతో రేషన్ కార్డుకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయనున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్‌గుండూరావ్ వెల్లడించారు. రాష్ట్రంలో పెలైట్ ప్రతిపాదికన కొన్ని చోట్ల ఇప్పటికే రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారితో ఆధార్ సంఖ్యను కూడా సేకరిస్తున్నామన్నారు.  

ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఇప్పటికే రేషన్‌కార్డు పొందిన వారి వివరాలను ‘ఆధార్’కు అనుసంధానం చేయడాన్ని దశలవారీగా చేపడుతామని మంత్రి వివరించారు. విధానసౌధలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీపీఎల్ కార్డుదారులకు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న కిరోసిన్ బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా ఉండేందుకు నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. పెలైట్ ప్రాజెక్ట్ కింద మైసూరు, తుమకూరు, దార్వాడ జిల్లాల్లో ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

పథకం అమల్లోకి వచ్చినప్పుడు నిర్ణీత మార్కెట్ ధర ప్రకారం కిరోసిన్‌ను లబ్ధిదారులు కొనుగోలు చేయాల్సి ఉంటుందని, కిరోసిన్‌కు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమచేయనున్నామన్నారు. బెంగళూరులో కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా కిరోసిన్ ఫ్రీ నగరంగా చేయనున్నామని మంత్రి దినేష్‌గుండూరావ్ పునరుద్ఘాటించారు.

వచ్చేనెల నుంచి రేషన్‌షాపుల ద్వారా బీపీఎల్ కార్డుదారులకు కిలో చక్కెర రూ.13.50 చొప్పున వితరణ చేయడానికి నేడు (శుక్రవారం) జరిగే కేబినెట్ కమిటీ నుంచి అనుమతి లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా జొన్న, రాగులకు కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1,800ను కూడా మంత్రి మండలి ఆమోదిస్తుందని దినేష్‌గుండూరావ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని కొన్ని చోట్ల రేషన్‌షాపుల్లో ప్రస్తుతం ఉపయోగిస్తున్న బయోమెట్రిక్ సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేకపోయామన్నారు. ఈ విధానంపై మరింత అధ్యయం చేయాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement