‘చెత్త’ అంపైరింగ్‌ రికార్డు సమం | Wilson saved by technology in Challenging Test For The Umpire | Sakshi
Sakshi News home page

‘చెత్త’ అంపైరింగ్‌ రికార్డు సమం

Aug 6 2019 10:50 AM | Updated on Aug 6 2019 1:58 PM

Wilson saved by technology in Challenging Test For The Umpire - Sakshi

బర్మింగ్‌హామ్‌: ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ ఆరంభపు టెస్టులోనే ఫీల్డ్‌ అంపైరింగ్‌ చాలా దారుణంగా ఉందంటూ ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్‌ మొరపెట్టుకుంటూనే ఉన్నాడు. ఇదంతా తటస్థ అంపైరింగ్‌ వల్లే జరుగుతుందని ధ్వజమెత్తాడు. ఒక ప్రతిష్టాత్మక సిరీస్‌ మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు తటస్థ అంపైర్లను కాకుండా అత్యుత్తమ అంపైర్లను ఎంపిక చేయాలంటూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలికి సైతం విన్నవించాడు. పాంటింగ్‌ చేసిన వ్యాఖ్యలకు మరింత బలం చేకూరుస్తూ యాషెస్‌ తొలి టెస్టులోనే ఫీల్డ్‌ అంపైరింగ్‌ తప్పిదాలు కొట్టొచ్చినట్లు కనబడ్డాయి. జోయల్‌ విల్సన్‌, అలీమ్‌ దార్‌లు పదే పదే తప్పుడు నిర్ణయాలు ప్రకటించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇద్దరూ కలిసి ప్రకటించిన 15 నిర్ణయాలు తప్పుగా తేలాయి.

వెస్టిండీస్‌కు చెందిన జోయల్‌ విల్సన్‌ అయితే ఏకంగా తాను ప్రకటించిన ఎనిమిది నిర్ణయాలు తప్పుగా తేలడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. యాషెస్‌ తొలి టెస్టులో విల్సన్‌ ప్రకటించిన నిర్ణయాల్లో ఎనిమిది డీఆర్‌ఎస్‌లో తప్పని తేలాయి. ఫలితంగా ఒక చెత్త రికార్డు సమం చేశాడు జోయల్‌ విల్సన్‌. ఇలా ఒక టెస్టు మ్యాచ్‌లో ఎనిమిది నిర్ణయాలు తప్పుగా తేలడం డీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన తర్వాత ఇదే రెండోసారి మాత్రమే. దాదాపు 11 ఏళ్ల క్రితం డీఆర్‌ఎస్‌ను పరిచయం చేయగా, 2016లో ఇంగ్లండ్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య చిట్టగాంగ్‌లో జరిగిన టెస్టులో శ్రీలంక అంపైర్‌ ఇలా ఎనిమిది తప్పుడు నిర్ణయాలు ప్రకటించాడు. 

ఆ తర్వాత ఇంతకాలానికి అంతే సంఖ్యలో జోయల్‌ విల్సన్‌ తప్పుడు నిర్ణయాలు వెల్లడించడం అతను ఫీల్డ్‌ అంపైరింగ్‌కు సరిపోడనే వాదన వినిపిస్తోంది. ట్రినిడాడ్‌ అండ్‌ టోబాగో నుంచి వచ్చిన జోయల్‌ విల్సన్‌ ఒక బ్లైండ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ అంపైర్‌ అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. అన్ని ఫార్మాట్లకు అంపైర్‌గా వ్యవహరిస్తున్న విల్సన్‌.. అసలు ఫీల్డ్‌ అంపైర్‌గా చేసే అర్హత లేదంటూ మండిపడుతున్నారు. దాంతో వచ్చే వారం లార్డ్స్‌లో ఆరంభమయ్యే రెండో యాషెస్‌ టెస్టుకు విల్సన్‌ను టీవీ అంపైర్‌గా పరిమితం చేసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement