మీలాంటి వాళ్లను క్రికెట్‌ ఆడకుండా చేసేవాడ్ని!

What Happens In Pakistan Cricket, Akhtar - Sakshi

కరాచీ: టెస్టు క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన పాకిస్తాన్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌పై ఆ దేశ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ నిప్పులు చెరిగాడు. టెస్టు ఫార్మాట్‌ను వదిలి, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే పరిమితం అవుతానంటూ ఆమిర్‌ పేర్కొనడం అక్తర్‌కు తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. అసలు మీలాంటి వాళ్లను ఏ ఫార్మాట్‌లోనూ క్రికెట్‌ ఆడకుండా  చేయాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఒకవేళ తానే సెలక్షన్‌ కమిటీలో ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకునే క్రికెటర్లను ఏ ఫార్మాట్‌లో ఎంపిక కాకుండా చేసేవాడినని అక్తర్‌ విమర్శించాడు. 27 ఏళ్లకే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడం అసలు న్యాయంగా అనిపిస్తోందా అంటూ మండిపడ్డాడు. (ఇక్కడ చదవండి: మహ్మద్‌ ఆమిర్‌ సంచలన నిర్ణయం)

‘నీకు ఇంకా బోలెడు క్రికెట్‌ ఉంది. ఈ సమయంలో టెస్టు క్రికెట్‌ నుంచి వైదొలుగుతావా. ఇప్పటికే పాకిస్తాన్‌ టెస్టు క్రికెట్‌ అంతంతమాత్రంగా ఉంది. అటువంటి తరుణంలో దేశానికి ఇచ్చేది ఇదేనా. నువ్వు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదంలో చిక్కుకున‍్నప్పుడు పాకిస్తాన్‌ క్రికెట్‌ చాలా ఖర్చు పెట్టింది. నీకు ఎన్నో చాన్స్‌లు ఇచ్చి రాటుదేలేలా చేసింది. ఫామ్‌లో ఉన్న సమయంలో టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకుంటావా. నీలాగే మిగతా క్రికెటర్లకు కూడా ఆలోచిస్తే పరిస్థితి ఏమవుతుంది. నీ తర్వాత హసన్‌ అలీ, వహాబ్‌ రియాజ్‌లు లైన్‌లో ఉన్నారా.  మేము మీలాగే క్రికెట్‌ ఆడామా. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ల్లో పాకిస్తాన్‌ సిరీస్‌లు గెలిచిన సమయంలో నేను గాయంతోనే బరిలోకి దిగా. అసలు పాక్‌ క్రికెట్‌లో ఏమి జరుగుతుంది. దీనిపై పీసీబీ సీరియస్‌గా దృష్టి సారించాలి. 27 ఏళ్లకే రిటైర్మెంట్‌ చెబితే, అది మిగతా ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక పాకిస్తాన్‌ క్రికెట్‌ను ప్రధాని ఇమ్రాన్‌ ఖానే బతికించాలి. పాక్‌ క్రికెట్‌లో పూర్వ వైభవం రావాలంటే గట్టి చర్యలకు శ్రీకారం చుట్టాలి’ అని అక్తర్‌ పేర్కొన్నాడు. శుక్రవారం ఆమిర్‌ టెస్టుల నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇది పాక్‌ క్రికెట్‌లో అలజడి రేపింది. ప్రధానంగా పాక్‌ మాజీ క్రికెటర్లు.. ఆమిర్‌ నిర్ణయంపై మండిపడుతున్నారు. ఇదొక బాధ్యతారాహిత్య నిర్ణయమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.( ఇక్కడ చదవండి: ఆమిర్‌ తొందరపడ్డాడు : వసీం అక్రం)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top