ఆమిర్‌ తొందరపడ్డాడు : వసీం అక్రం

Wasim Akram Says Bit Surprising Mohammad Amir Decision to Retire from Test Cricket - Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం తనని ఆశ్చర్యానికి గురిచేసిందని ఆ దేశ మాజీ క్రికెటర్‌ వసీం అక్రమ్‌ తెలిపాడు. టెస్టు ఫార్మాట్‌లో పాక్‌ జట్టుకు ఆమిర్‌ అవసరం చాలా ఉందన్నాడు. ‘మహ్మద్‌ ఆమిర్‌ టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే 28 ఏళ్ల వయసులోనే క్రికెట్‌లో గొప్ప ఫార్మాట్‌ అయిన టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పడం. పైగా పాకిస్తాన్‌ జట్టుకు అతని అవసరం ఎంతో ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలోని రెండు టెస్ట్‌లు, ఇంగ్లండ్‌లో మూడు టెస్ట్‌లకు జట్టులో అతను ఉండటం ముఖ్యం’ అని వసీం ట్వీట్‌ చేశాడు. ఇక షోయబ్‌ అక్తర్‌ సైతం ఆమిర్‌ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశాడు.

ప్రధానంగా వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ జరుగనున్న తరుణంలో అందుకు ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని భావించే టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమిర్‌ పేర్కొన్నాడు. ‘ పాకిస్తాన్‌ తరఫున క్రికెట్‌ ఆడాలనేది నా ఏకైక కోరిక. పాకిస్తాన్‌ క్రికెట్‌కు సాధ్యమైనంత వరకూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే నేను దృష్టి సారించా. రాబోవు పరిమిత ఓవర్ల సిరీస్‌లను నేను చాలెంజ్‌గా తీసుకుంటున్నా. కేవలం వైట్‌ బాల్‌ క్రికెట్‌పైనే ఫోకస్‌ చేయాలనుకుంటున్నా’ అని ఆమిర్‌ తెలిపాడు.

ఆమిర్‌ 17 ఏళ్ల వయసులోనే 2009లో గాలేలో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా టెస్ట్‌ ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ 36 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆమిర్‌ 119 వికెట్లు సాధించాడు.  నాలుగేసి వికెట్లను ఆరు సార్లు తీసిన ఆమిర్‌.. ఐదు వికెట్లను నాలుగు సందర్బాల్లో సాధించాడు. జమైకాలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భాగంగా ఒక ఇన్నింగ్స్‌లో ఆమిర్‌ 44 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. ఇదే అతని అత్యుత్తమ టెస్టు ప్రదర్శన.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top