
వాట్ ఎ లెగ్ ‘సర్’జీ!
రవీంద్ర జడేజాకు ఏ ముహుర్తాన ధోని ‘సర్’ అనే నిక్‌నేమ్ పెట్టాడో గానీ...
రవీంద్ర జడేజాకు ఏ ముహుర్తాన ధోని ‘సర్’ అనే నిక్‌నేమ్ పెట్టాడో గానీ... అప్పటి నుంచి అతనిపై సోషల్ మీడియాలో జోక్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఈసారి తనకు కాస్త బాధ కలిగించే జోక్ ఒకటి ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. ఇప్పటివరకూ ఏడేళ్లలో జడేజా మూడు జట్ల తరఫున ఐపీఎల్ ఆడాడు.
తొలుత రెండేళ్ల పాటు రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏడాది నిషేధం ఎదుర్కొన్నాడు. 2011లో కొచ్చి టస్కర్స్ కేరళ తరఫున ఆడాడు. 2012 నుంచి ఇప్పటివరకూ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్ తొలి సీజన్‌లోనే తను స్టార్‌గా మారడంతో ఈ లీగ్ ద్వారా కావలసినంత డబ్బు వచ్చింది. అంతా బాగానే ఉంది. కానీ జడేజా ఇప్పటివరకూ ఆడిన మూడు జట్లూ ఐపీఎల్‌లో లేవు. కొచ్చి టస్కర్స్‌ను బీసీసీఐ నిషేధిస్తే... తాజాగా రాజస్తాన్, చెన్నైలపై లోధా కమిటీ రెండేళ్ల నిషేధం విధించింది. దీం తో అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ మసే అంటూ సోషల్ మీడియాలో సర్ మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పాపం... జడేజా తన తప్పేం లేకపోయినా ఇలాంటి ముద్ర పడింది.