
8 పరాజయాల తర్వాత విజయం
తమ సుదీర్ఘ పర్యటనలో వెస్టిండీస్ జట్టు ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది.
షార్జా: తమ సుదీర్ఘ పర్యటనలో వెస్టిండీస్ జట్టు ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్తో ఇక్కడ షార్జాలో జరిగిన మూడో టెస్టులో వెస్టిండీస్ ఐదు వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. పాక్ విసిరిన 153 పరుగుల విజయలక్ష్యాన్ని విండీస్ ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 114/5 ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు గురువారం ఆట కొనసాగించిన విండీస్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి గెలుపొందింది.
ఓవర్ నైట్ ఆటగాళ్లు క్రెయిగ్ బ్రాత్వైట్(60 నాటౌట్), డోవ్రిచ్(60 నాటౌట్) రాణించి విండీస్కు విజయాన్ని అందించారు. చివరి రోజు ఆటలో విండీస్ విజయానికి 39 పరుగులు అవసరం కాగా, పాక్ గెలుపుకు ఐదు వికెట్లు అవసరమయ్యాయి. అయితే విండీస్ లక్ష్యం స్పల్పం కావడంతో పాక్ కు ఓటమి తప్పలేదు.
అంతకుముందు మూడు ట్వంటీ 20 సిరీస్లో, మూడు వన్డేల సిరీస్లో వైట్ వాష్ అయిన విండీస్.. తొలి రెండు టెస్టుల్లో ఓటమి పాలైంది. దాంతో చివరి టెస్టులో కూడా విండీస్ కు ఓటమి తప్పదని భావించినా.. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో రాణించి చివరకు గెలుపుతో ఊరట చెందింది. ఒకవేళ ఈ మ్యాచ్ను పాక్ గెలిచి ఉంటే సరికొత్త అధ్యాయాన్ని ఆ జట్టు లిఖించే అవకాశం దక్కేది. ఒక టూర్లో వరుసగా తొమ్మిది మ్యాచ్ల్లో గెలిచిన ఘనతను పాక్ సొంతం చేసుకునేది.