
సరికొత్త చరిత్రపై పాక్ దృష్టి
ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టును సరికొత్త చరిత్ర ఊరిస్తోంది.
షార్జా: ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టును సరికొత్త చరిత్ర ఊరిస్తోంది. వెస్టిండీస్తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టును పాకిస్తాన్ గెలిస్తే ఆ జట్టు కొత్త అధ్యాయం లిఖిస్తుంది. ఇప్పటివరకూ వెస్టిండీస్ను టీ 20ల్లో, వన్డేల్లో క్లీన్ స్వీప్ చేసిన పాకిస్తాన్.. ఆ తరువాత ఆడిన రెండు టెస్టుల్లోనూ విజయం సాధించింది. ఇప్పుడు మూడో టెస్టును కూడా గెలిస్తే క్రికెట్ చరిత్రలో పాక్ పేరిట కొత్త చరిత్ర లిఖించబడుతుంది.
ఇప్పటివరకూ ఏ జట్టు కూడా ఒక పర్యాటక జట్టుపై వరుసగా తొమ్మిది మ్యాచ్లు గెలిచిన చరిత్ర లేదు. ఈ సువర్ణావకాశం ఇప్పుడు పాక్ ముంగిట ఉంది. ఆదివారం పాక్-విండీస్ల మధ్య మూడో టెస్టు షార్జాలో ఆరంభం కానుంది. అంతకుముందు దుబాయ్లో జరిగిన తొలి టెస్టులో పాక్ 56 పరుగులతో విజయం సాధించగా, అబుదాబిలో జరిగిన రెండో టెస్టులో 133 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. వెస్టిండీస్ లో కీలక ఆటగాళ్లు దూరం కావడంతో విజయం సాధించడం కోసం అపసోపాలు పడుతోంది. మరోవైపు పాక్ బ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా ఉండటం కూడా ఆ జట్టు అద్భుతవిజయాలకు మరో కారణం. ఇదిలా ఉండగా, పాక్ స్పిన్నర్ యాసిర్ షా కూడా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దాంతో మరో వైట్ వాష్పై పాక్ ధీమాగా ఉంది. ఒకవేళ మూడో టెస్టులో కూడా విండీస్ కు పరాభవం తప్పకపోతే చెత్త రికార్డును మూటగట్టుకుని తన పర్యటనను భారంగా ముగించాల్సి వస్తుంది.