
మాంచెస్టర్ : విశ్వవేదికగా నేడు దాయాదుల పోరు చూడాలనుకున్న క్రికెట్ అభిమానులకు చేదువార్త. మాంచెస్టర్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారనుంది. ప్రస్తుతం అక్కడ వర్షం లేదు. కానీ దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. సరిగ్గా మ్యాచ్ సమయానికి వర్షం జోరందుకునే అవకాశం ఉందని అక్కడి వాతావరణ ఏజెన్సీలు ప్రకటిస్తున్నాయి. ఈ వెదర్ రిపోర్ట్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి చిరుజల్లులు ప్రారంభమై మ్యాచ్ ఆరంభమయ్యే సమయానికి వర్షం జోరు అందుకోనుంది. 65 శాతం వర్షం పడే అవకాశం ఉంది. గాలులు కూడా బలంగా వీచనున్నాయి.
భారత్-పాక్ మ్యాచ్ వెదర్ రిపోర్ట్
వాస్తవానికి శనివారం రోజంతా వాతావరణం బాగానే ఉంది. కొద్ది సేపు ఎండ కూడా కాయడంతో అభిమానులు సంతోషించారు. అయితే భారత జట్టు ప్రాక్టీస్ ముగించిన పది నిమిషాల తర్వాత చినుకులు మొదలయ్యాయి. సాయంత్రానికి వర్షం జోరు పెరిగింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల సమయంలో కూడా అక్కడ భారీ వర్షం కురిసింది. పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచినా ఔట్‌ఫీల్డ్ పనితీరుపైనే సందేహాలు ఉన్నాయి. చిన్న జల్లులకే సాయంత్రం మైదానంలో వేర్వేరు చోట్ల నీళ్లు నిలిచిపోయాయి. ఇలాంటి పరిస్థితిల్లో మరోసారి వర్షం పడితే మ్యాచ్ నిర్వహించడం కష్టం కానుంది. ఇప్పటికే తడిసి ఉన్న మైదానంలో మళ్లీ చినుకులు పడితే మ్యాచ్ కోసం గ్రౌండ్‌ను సిద్ధం చేయడం చాలా కష్టం.