షార్జా మాస్టర్స్‌ టోర్నీ: హారికకు అగ్రస్థానం | Wang Hao bags Sharjah Masters Chess title | Sakshi
Sakshi News home page

షార్జా మాస్టర్స్‌ టోర్నీ: హారికకు అగ్రస్థానం

Apr 2 2017 1:35 AM | Updated on Sep 5 2017 7:41 AM

షార్జా మాస్టర్స్‌ టోర్నీ: హారికకు అగ్రస్థానం

షార్జా మాస్టర్స్‌ టోర్నీ: హారికకు అగ్రస్థానం

ఇటీవలే ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక...

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలే ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక... అదే జోరును షార్జా మాస్టర్స్‌ టోర్నీలోనూ కనబరిచింది. షార్జాలో శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో హారిక మహిళల విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నిర్ణీత తొమ్మిది రౌండ్‌ల తర్వాత హారిక ఆరు పాయింట్లు సాధించింది. మూడు గేముల్లో గెలిచిన హారిక, మరో ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని ఈ టోర్నీలో అజేయంగా నిలిచింది.

భారత్‌కే చెందిన శ్రీజ శేషాద్రి, మేరీ ఆన్‌ గోమ్స్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మరోవైపు ఇదే టోర్నీ ఓపెన్‌ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్‌ ఆదిబన్‌ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్‌ల తర్వాత ఆదిబన్‌తోపాటు మరో ఐదుగురు క్రీడాకారులు కూడా ఏడు పాయింట్లు సాధించి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంక్‌లను వర్గీకరించగా ఆదిబన్‌కు రెండో స్థానం లభించింది. వాంగ్‌ హావో (చైనా) విజేతగా నిలువగా... మార్టిన్‌ క్రాట్‌సివ్‌ (ఉక్రెయిన్‌) మూడో స్థానాన్ని పొందాడు.

హరికృష్ణ గేమ్‌ ‘డ్రా’...
చైనాలో జరుగుతున్న షెన్‌జెన్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ టోర్నీలో హైదరాబాద్‌ ప్లేయర్‌ పెంటేల హరికృష్ణ ఐదో ‘డ్రా’ నమోదు చేశాడు. యు యాంగి (చైనా)తో శనివారం జరిగిన తొమ్మిదో రౌండ్‌ గేమ్‌ను హరికృష్ణ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. తొమ్మిదో రౌండ్‌ తర్వాత హరికృష్ణ 4.5 పాయింట్లతో పీటర్‌ స్విద్లెర్‌ (రష్యా)తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఆదివారం జరిగే చివరిదైన పదో రౌండ్‌లో లిరెన్‌ డింగ్‌ (చైనా)తో హరికృష్ణ ఆడతాడు. లిరెన్‌ డింగ్‌ 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌) ఐదు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement