
ఆ దిగ్గజం మాటలు నన్నెంతో మార్చాయి!
గత ఐపీఎల్ సీజన్లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను కలుసుకోవడం తనకెంతో కలిసొచ్చిందంటున్నాడు యువ సంచలనం బాసిల్ థంపి.
న్యూఢిల్లీ: గత ఐపీఎల్ సీజన్లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను కలుసుకోవడం తనకెంతో కలిసొచ్చిందంటున్నాడు యువ సంచలనం బాసిల్ థంపి. ముంబై ఇండియన్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న సచిన్‌ను కలుసుకున్నప్పుడు తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశారని గుజరాత్ లయన్స్ ఆటగాడు బాసిల్ థంపి తెలిపాడు. ఆ వివరాలు అతడి మాటల్లోనే.. 'గత ఐపీఎల్ సీజన్ ముగుస్తుందనగా స్వయంగా సచిన్ పాజీ నాకు కాల్ చేసి రమ్మన్నారు. సచిన్‌ను కలిసిన సందర్భంగా.. నా ఆటతీరును మెచ్చుకున్నారు. నేను ఆడిన మ్యాచ్‌లను జాగ్రత్తగా గమనించినట్లు చెప్పారు. ఒత్తిడి సమయాల్లో నేను బౌలింగ్ చేసిన విధానం ఆకట్టుకుందని, మంచి భవిష్యత్తు ఉందని ప్రోత్సహించారని' థంపి వివరించాడు.
కేరళకు చెందిన యువ ఫాస్ట్‌బౌలర్ బాసిల్ థంపి ఐపీఎల్ ప్రదర్శనతో ఆకట్టుకుని భారత్-ఏ జట్టులో చోటు దక్కించుకున్నాడు. డెత్ ఓవర్లలో యార్కర్లతో రెచ్చిపోయే థంపి, దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ద్వారా భారత్ ఏ జట్టులో అరంగేట్రం చేయనున్నాడు థంపి. తన కల నిజమయ్యే రోజు దగ్గర్లోనే ఉందంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఈ సెలక్షన్ అనంతరం ఫిట్‌నెస్ పరీక్షల నిమిత్తం జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడు. అయితే భారత్ ఏ జట్టుకు ఎంపిక అనంతరం బంధువులు, సన్నిహితుల అభినందనలతో తన ఫోన్ మోత మోగిపోయిందని తెలిపాడు. అయితే ఐపీఎల్ వల్లే తనకు గొప్ప అవకాశం లభించిందని, జాతీయ జట్టులోనూ నిరూపించుకునేందుకు సిధ్దంగా ఉన్నట్లు థంపి చెప్పాడు.